Bhatti Vikramarka: తెలంగాణ అసెంబ్లీలో పీసీ గోష్ కమిషన్ నివేదికపై జరిగిన చర్చ ఉద్రిక్తంగా మారింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బిఆర్‌ఎస్ నేత హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి.. తప్పు చేసిన వారు బాధ్యత వహించాలి. తప్పుడు ప్రచారంతో ప్రజలను మోసం చేయొద్దు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలోనే 2007లో అనుమతులు లభించి 2009లో ప్రారంభమైన ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టుని సమయానికి పూర్తి చేసి ఉంటే, కేవలం రూ. 38,000 కోట్ల వ్యయంతో 16.4 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని చెప్పారు. అంతేకాకుండా, 7 జిల్లాలకు తాగునీరు, హైదరాబాద్ జంట నగరాలకు 30 టీఎంసీల తాగునీరు, పరిశ్రమలకు 16 టీఎంసీల నీరు అందుబాటులోకి వచ్చేదని వివరించారు.
భట్టి మాట్లాడుతూ.. నిజాంసాగర్, పోచారం వంటి ప్రాజెక్టులు వందేళ్ల క్రితం నిర్మాణమైనా వరదలను తట్టుకుని నిలబడ్డాయి. కానీ లక్షన్నర కోట్లతో నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు ఒక్క ఎకరానికీ నీరు ఇవ్వకుండానే విఫలమై కూలిపోయిందని విమర్శించారు. పీసీ గోష్ నివేదికను హరీష్ రావు చెత్త రిపోర్టు అంటున్నారు. మీరు తప్పు చేయకపోతే హైకోర్టుకు ఎందుకు వెళ్లారు? రిపోర్టు ఆధారంగా ఈ రాష్ట్రాన్ని ఎలా రక్షించాలో, ప్రజల సొమ్ము తిరిగి ఎలా సాధించాలో ఆలోచించడమే మా లక్ష్యం అని ఆయన అన్నారు.
భట్టి మరింతగా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ, “ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టులో ఇప్పటికే రూ.11,680 కోట్లు ఖర్చు చేశారు. ఆ ప్రాజెక్టును కేవలం రూ. 38,500 కోట్లలో పూర్తి చేసి ఉంటే, లక్షల ఎకరాలకు నీరు చేరేది. కానీ మీరు ఆ ప్రాజెక్టును పక్కన పెట్టి కాళేశ్వరం కోసం అంచనాలను పెంచి ప్రజల సొమ్మును వృథా చేశారని అన్నారు.
అలాగే ప్రాణహిత – చేవెళ్ల వద్ద నీరు అదే, కాలేశ్వరం వద్ద నీరు అదే. కానీ కేవలం మీ అవసరాల కోసమే ప్రాజెక్టు ఎత్తును తగ్గించి, లిఫ్ట్‌లతో ఖర్చు పెంచి, విద్యుత్ బిల్లులు పేరుకుపోయేలా చేశారు. ఇప్పుడు కాలేశ్వరం ద్వారా నీటిని లిఫ్ట్ చేయడానికి సంవత్సరానికి 12,000 కోట్లకు పైగా ఖర్చు అవుతోంది. ఇది ఏమైనా ప్రజలపై మోసం కాదా? అని మండిపడ్డారు.
Also Read: CPI Narayana: కేసీఆర్ రాజీనామా చెయ్.. సీఎం రేవంత్ కు ఫుల్ సపోర్ట్.. సిపిఐ నారాయణ కామెంట్స్!
పీసీ గోష్ కమిషన్ నోటీసుల గురించి మాట్లాడుతూ, ఏప్రిల్ 27, 2024న కమిషన్ పబ్లిక్ నోటీసు ఇచ్చింది. ప్రధాన పత్రికల్లో ప్రకటన ఇచ్చి అందరికీ సమాచారం అందించింది. అయినా మాకు నోటీసు ఇవ్వలేదని, పిలవలేదని కోర్టుకు వెళ్లడం పూర్తిగా తప్పుదోవ పట్టించే ప్రయత్నమని భట్టి స్పష్టం చేశారు. మీరు ప్రాజెక్టులను సక్రమంగా పూర్తి చేసి ఉంటే బనకచర్ల ప్రాజెక్టు ఈరోజు చర్చకు కూడా రాకపోయేది. కానీ మీ దోపిడీ, తప్పు నిర్ణయాలే ఈ పరిస్థితికి కారణం అయ్యాయి. గోష్ నివేదికను చెత్త బుట్టలో వేసేస్తామని అంటున్న వారు, ప్రజలు తమను ఎక్కడ వేశారో ఒకసారి గుర్తు చేసుకోవాలని ఎద్దేవా చేశారు.
అలాగే, అసెంబ్లీలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తమ వైపు నుంచి స్పష్టమైన సమాచారం ఇచ్చారని, కానీ హరీష్ రావు మాత్రం వాస్తవాలను దాచిపెట్టి తప్పుడు పత్రాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
భట్టి విక్రమార్క తన ప్రసంగాన్ని ముగిస్తూ.. మేము పది సంవత్సరాలు అసెంబ్లీలో పోరాడాం. మాకు మైక్ ఇవ్వకపోయినా, బయటకు వెళ్లిపోలేదు. ఇప్పుడు మాత్రం మేము ప్రజల కోసం నిజం బయటకు తేవడం మాత్రమే చేస్తున్నాం. ఈ నివేదికపై చర్చ జరపడం రాష్ట్ర భవిష్యత్తుకు చాలా ముఖ్యం. ఇకపై ప్రజలను మోసం చేయొద్దని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలతో అసెంబ్లీ వాతావరణం కాసేపు ఉత్కంఠభరితంగా మారింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం గోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తీసుకోబోయే నిర్ణయాలపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.