Hyderabad : ఒకే చోట మూడు ఫ్లైఓవర్లు. ఒక దాని మీద మరొకటి. అద్భుతం కదా. గచ్చిబౌలి జంక్షన్ అందుకు వేదికైంది. లేటెస్ట్‌గా మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఐటీ సెక్టార్‌లో ట్రాఫిక్ కష్టాలను మరింతగా తీర్చనుంది. కొండాపూర్ నుంచి ORR వరకు.. రయ్ రయ్ మంటూ దూసుకెళ్లిపోవచ్చు. ఆఫీస్ లేట్ అవుతోందనే టెన్షన్ అక్కర్లేదు. విమానం మిస్ అవుతుందేమోననే ఆందోళన అక్కర్లేదు. కొత్తగా నిర్మించిన పీజేఆర్ ఫ్లై ఓవర్‌తో ట్రాఫిక్ మరింత స్మూత్ కానుంది.
ఐటీ కారిడార్‌లో పీజేఆర్ ఫ్లైఓవర్
ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్ వరకు నిర్మించిన పీజేఆర్ ఫ్లై ఓవర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి శనివారం ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్‌తో ఐటీ కారిడార్‌లో ప్రయాణించే వారికి ఎంతో యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. గచ్చిబౌలి జంక్షన్ దగ్గర ట్రాఫిక్ రద్దీ బాగా తగ్గుతుంది. జర్నీ టైమ్ చాలా సేవ్ అవుతుంది.
మల్టీ లేయర్ ఫ్లైఓవర్
అత్యాధునిక హంగులతో మల్టీ లెవల్ ఫ్లైఓవర్ నిర్మించారు. వ్యూహాత్మక రహదారి అభివృద్ధి కార్యక్రమం కింద రూ.182.72 కోట్ల వ్యయంతో నిర్మించారు. 1.2 కిలో మీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. మూడవ-స్థాయి ఫ్లైఓవర్‌గా నిర్మించారు. దీని కింద ఇప్పటికే రెండు ఫ్లైఓవర్లు ఉన్నాయి. ఈ ఫ్లైఓవర్ కింద శిల్పా లేఅవుట్ ఫేజ్ 1 ఫ్లైఓవర్.. దాని కింద గచ్చిబౌలి జంక్షన్ ఫ్లైఓవర్ ఉంటుంది. కొండాపూర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు.. వయా గచ్చిబౌలి మీదుగా ఎలాంటి ట్రాఫిక్ ప్రాబ్లమ్ లేకుండా డైరెక్ట్‌గా చేరుకోవచ్చు.
SRDP ద్వారా చేపట్టిన 42 పనులలో 37 పనులు ఈ ఫ్లైఓవర్‌తో పూర్తయ్యాయి. ఫలక్‌నుమా రైల్వే ఓవర్ బ్రిడ్జి, శాస్త్రిపురం ROB పనుల రైల్వే భాగాన్ని రెండు మూడు నెలల్లో పూర్తి చేయాలని కమిషనర్ కర్ణన్ లక్ష్యంగా పెట్టుకుని రైల్వే అధికారులను కోరారు. జూలై చివరి నాటికి ఫలక్‌నుమా ROB పనులను, ఆగస్టు చివరి నాటికి శాస్త్రిపురం ROB పనులను పూర్తి చేయాలని కమిషనర్ లక్ష్యంగా నిర్దేశించారు. ఈ రెండు ROBలు పూర్తయితే, 39 SRDP పనులు పూర్తవుతాయి. వాహనదారులు ఈ ప్రాంతంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రయాణించవచ్చు.