⦿ సెమీ అర్బన్, రూరల్ జోన్లలో పర్యాటకానికి ప్రోత్సాహకాలు
⦿ అటవీ, ఐటీ, టీజీఐఐసీ, మెడికల్, స్పోర్ట్స్ విభాగాలతో సమన్వయం
⦿ పర్యాటక శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
పర్యాటకుల్ని ఆకర్షించేందుకు తెలంగాణలో ఎన్నో అద్భుతాలున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు సరైన ప్రచారం కల్పించకపోవడం, వినూత్న పద్ధతిలో ఆలోచించకపోవడంతో పర్యాటక రంగంలో ఆశించిన మార్పుల్ని అందుకోలేకపోయినట్లు వెల్లడించారు. పర్యాటక శాఖపై ఐసీసీసీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావుతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.. అనేక విషయాలపై అధికారులకు సూచనలు, సలహాలు అందజేశారు. పర్యాటక శాఖపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పని చేయడం వల్ల రాష్ట్రానికి ఆదాయం సమకూరడమే కాదని, స్థానికంగా యువతకు పెద్ద ఎత్తున ఉపాధీ అవకాశాలు కూడా లభిస్తాయని అన్నారు. అందుకే.. పర్యాటకాన్ని ఉపాధి కల్పించే వనరుగా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేసారు.
తెలంగాణ ఘన చరిత్రను వర్తమానానికి అనుసంధానిస్తూ.. భవిష్యత్‌కు బాటలు వేసేలా పర్యాటక శాఖను తీర్చిదిద్దాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులు ఆకర్షించాలన్న సీఎం.. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రోత్సాహాకాలు కల్పించాలన్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో అందమైన ప్రకృతి అందాలకు మరింత ఆదరణ ఉండాలని, ముఖ్యంగా నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్‌లో బోట్ హౌస్ అందుబాటులో ఉంచాలని సూచించారు.
ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయిన డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు తెలంగాణను వేదికగా మార్చాలని, అందుకు కావాల్సిన ప్రణాళికల్ని రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. తెలంగాణలోని పురాతన ఆలయాలకు ఎంతో ఆదరణ ఉందని, వాటిని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఆలయాలకు వెళ్లేందుకు అన్ని సౌకర్యాలు అభివృద్ధి చేయాలన్నారు. అలాగే.. విస్తృతంగా వ్యాపించి ఉన్న అటవులు, అభయారణ్యాలకు పర్యాటకంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉందని… ఆ దిశగా దృష్టిసారించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అభయారణ్యాల్లో సఫారీ రైడ్లు సహా పర్యాటకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు.
భద్రాచలం, సలేశ్వరం, రామప్ప వంటి ఆలయాలు.. మల్లెల తీర్ధం, బొగత జలపాతాలు, బౌద్ధ స్తూపాలు, జైన ఆలయాలు ఇలా ప్రతి ఒక్క పర్యాటక ప్రదేశంలో వసతులు మెరుగుపర్చాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే.. ఆయా ప్రాంతాలకు సరైన ప్రచారం కల్పించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో భువనగిరి కోట రోప్ వే పనుల పైనా ఆరా తీశారు. భూ సేకరణలో కొంత జాప్యం జరిగిందని.. ఇప్పుడు భూ సేకరణ పూర్తయినందు వల్ల త్వరలో టెండర్లు పిలవాలని సూచించారు. సాధ్యమైనంత త్వరగా భువనగిరి కోట రోప్ వే పనులకు టెండర్లు పిలవడంతో పాటు కోటపై ఉన్న చారిత్రక కట్టడాల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
Also Read : యంగ్ ఇండియా స్కూల్స్ పై కీలక ప్రకటన.. స్పీడ్ పెంచిన ప్రభుత్వం..
పర్యాటక శాఖ పాలసీకి తుది రూపు ఇచ్చే సమయంలో అటవీ, ఐటీ, విద్యుత్, టీజీ ఐఐసీ, వైద్య, క్రీడల శాఖలతో సమన్వయం చేసుకోవాలని.. ఒక శాఖ విధానాలు మరో శాఖ విధానాలకు ఆటంకంగా ఉండకుండా జాగ్రత్తలు పాటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. అడ్వెంచర్ స్పోర్ట్స్‌కు పర్యాటక శాఖలో ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించారు. వైద్య అవసరాలకు విదేశాల నుంచి వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా.. వైద్య పర్యాటకులుగా సులువుగా వచ్చిపోయేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పర్యాటక శాఖకు బడ్జెట్ కేటాయింపులు పెరిగేలా చూస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో హామి ఇచ్చారు. సమీక్షలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సహా కీలకాధికారులు పాల్గొన్నారు.