POCSO Cases: స్వేచ్ఛ బ్యూరో: కీచకుడే సిగ్గు పడేలా ప్రవర్తిస్తున్నారు కొందరు మృగాళ్లు. తమ వికృత వాంఛ లకు పాల బుగ్గల చిన్నారులను సైతం బలి చేస్తున్నారు. చేసిన నేరం నుంచి తప్పించుకోవటానికి వారిని దారుణంగా హతమారుస్తున్నారు. దారుణమైన విషయమేమిటంటే కొందరు కామాంధులు తమ పైశాచికత్వానికి బాలురను కూడా బలి చేస్తుండటం. జీవితాంతం మరిచిపోలేని పీడకలలను చిన్నారులకు మిగిలిస్తుండటం. పకడ్భంధీ చట్టాలు ఉన్నా..కొన్ని కేసుల్లో కఠిన శిక్షలు పడుతున్నా ఈ నేరాలు ఏయేటికాయేడు పెరిగిపోతుండటం గమనార్హం. పోలీసు గణాంకాల ప్రకారమే గడిచిన అయిదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా పోక్సో చట్టం ప్రకారం 18,994 కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కన రోజుకు 9మంది చిన్నారులు లైంగిక దాడులకు గురవుతున్నారన్నది సుస్పష్టం. ఆందోళళనాకర అంశం ఏమిటంటే వీటిలో 99శాతం కేసుల్లో బాధితులకు బాగా తెలిసిన వారే నిందితులుగా ఉండటం. వీరిలో జన్మనిచ్చిన వారితోపాటు తోబుట్టువులు, బంధువులు, ట్యూషన్ మాస్టర్లు, టీచర్లు, ఇరుగుపొరుగు వారు ఉంటున్నారు.
పోక్సో యాక్ట్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో ట్రై కమిషనరేట్లు ముందు వరుసలో ఉండటం గమనార్హం. గత అయిదేళ్లలో రాష్ట్రం మొత్తం మీద 16,994 కేసులు నమోదు కాగా 2,619కేసులతో రాచకొండ (ప్రస్తుతం మల్కాజిగిరి) కమిషనరేట్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తరువాత 2,293 కేసులతో హైదరాబాద్ ఉండగా, 2026 కేసులతో సైబరాబాద్ కమిషనరేట్ మూడో స్థానంలో ఉంది. ఒక్క 2025లోనే పోక్సో చట్టం ప్రకారం నమోదైన కేసుల్లో చెంచల్ గూడ జైలుకు 4,176మంది రిమాండ్ అయ్యారు. ఈ తరహా నేరాలు పెరిగిపోవటానికి మద్యం, గంజాయి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. మత్తులో పశువుల్లా మారుతున్న కొందరు ముక్కుపచ్చలారని చిన్నారులను తమ వికృత వాంఛలకు బలి చేస్తున్నారు. ఇక, మైనారిటీ కూడా తీరని బాలురు కూడా ఈ తరహా నేరాలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఇంటర్ నెట్ అన్నది సుస్పష్టం. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థి చేతుల్లో కూడా మొబైల్ ఫోన్ ఉండటం సర్వసాధారణమై పోయింది. తెలిసీ తెలియని వయసులో సెల్ ఫోన్లో పోర్న్ వీడియోలు చూస్తున్న వారిలో కొందరు అలాంటి అనుభవం కోసం దారుణాలకు తెగిస్తున్నారు. జన్మనిచ్చిన తండ్రులు, తోడబుట్టిన అన్నదమ్ములు, దగ్గరి బంధువులు, చదువులు చెప్పాల్సిన టీచర్లు, ట్యూషన్ మాస్టర్లు చిన్నపిల్లలపై లైంగిక దాడులకు పాల్పడిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి.
Also Read: Urea Black Market: కరీంనగర్ జిల్లాలో యూరియా మాఫియా అరాచకం
నిజానికి చిన్నారులు లైంగిక దాడులకు గురి కాకుండా చూసేందుకు పోక్సో చట్టాన్ని అత్యంత కఠినంగా రూపొందించారు. ఈ చట్టం ప్రకారం కేసు రిజిష్టర్ అయితే దాంట్లోని నిందితుడు తన నిర్దోషిత్వాన్ని తానే నిరూపించుకోవాల్సి ఉంటుంది. అయితే, చట్టం కఠినంగా ఉన్నా కేసుల విచారణ నత్తనడకన నడుస్తోంది. దీంతో ఈ తరహా నేరాలకు పాల్పడుతున్న వారిలో భయం లేకుండా పోతోంది. గత అయిదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 16,994 కేసులు పోక్సో చట్టం ప్రకారం నమోదు కాగా కేవలం 188 కేసుల్లో మాత్రమే నిందితులకు శిక్షలు పడ్డాయి. దీనినిబట్టే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఈ తరహా నేరాలకు చెక్ పెట్టటంలో తల్లిదండ్రులు, టీచర్ల పాత్ర కీలకమని సీనియర్ పోలీసు అధికారులు చెబుతున్నారు. పిల్లలకు ఖచ్చితంగా గుడ్ టచ్…బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. ప్రతీరోజూ పిల్లలతో కనీసం ఓ గంట స్నేహపూర్వకంగా మాట్లాడాలన్నారు. ఎలాంటి సమస్య ఎదురైనా తమకు నేరుగా చెప్పగలిగే ధైర్యాన్ని వారికి అందివ్వాలని అంటున్నారు. ఇక, పిల్లలకు మొబైల్ ఫోన్ కొనివ్వటంతో తమ పని అయిపోయిందన్నట్టుగా తల్లిదండ్రులు వ్యవహరించ వద్దని చెబుతున్నారు. ఫోన్లను వాళ్లు ఎలా ఉపయోగిస్తున్నారు? ఏం బ్రౌజ్ చేస్తున్నారు? అన్నదానిపై కన్నేసి పెట్టాలని సూచిస్తున్నారు. అశ్లీల వెబ్ సైట్లు ఓపెన్ కాకుండా సెట్టింగ్స్ లోకి వెళ్లి వాటిని బ్లాక్ చేయాలని చెబుతున్నారు.
కాగా, పోక్సో చట్టం ప్రకారం నమోదవుతున్న కేసుల్లో పోలీసులు అధికారులు వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి కోర్టులకు పక్కా సాక్ష్యాధారాలతో ఛార్జ్ షీట్ ను సమర్పించాలన్న అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. కోర్టులు కూడా వీలైనంత త్వరగా ఈ కేసుల్లో విచారణను ముగించి నిందితులకు కఠిన శిక్షలు విధించాలని జనం కోరుకుంటున్నారు. ఈ కేసుల్లోని నిందితులకు పడుతున్న శిక్షల గురించి మీడియా, సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని అంటున్నారు. అప్పుడే ఇలాంటి నేరాలు చేయాలనుకునే వారిలో కొంతైనా భయం పడుతుందంటున్నారు. తద్వారా కొన్ని నేరాలనైనా నివారించ వచ్చని చెబుతున్నారు.
Also read: Student Suicide: పిల్లి పెట్టిన చిచ్చు.. సూసైడ్ చేసుకున్న ఎంబీబీఎస్ విద్యార్దిని..!