Kaushik Reddy Arrests : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీకున్నారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర హుజురాబాద్ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిన పోలీసులు.. కరీంనగర్ కు తరలిస్తున్నారు. కరీంనగర్ వన్ టౌన్ పోలీసు స్టేషన్ కు తరలించనున్నారు.
కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన జిల్లా ప్రజాప్రతినిధుల సమావేశంలో జగిత్యాల డాక్టర్ సంజయ్ పై దురుసుగా ప్రవర్తించడంతో పాటు పైపైకి వచ్చి.. నెట్టేశారు. ఈ విషయమైన రాష్ట్రవ్యాప్తంగా.. రాజకీయ చర్చ జరిగింది. ఓ ప్రజాప్రతినిధిగా.. తోటి ఎమ్మెల్యేపై కౌశిక్ ప్రవర్తన సరిగా లేదంటూ.. అన్ని పార్టీల నేతలు విమర్శించారు. ఈ నేపథ్యంలోనే పాడి కౌశిక్ అరెస్ట్ చోటుచేసుకుంది.
ఈ ఘటనలో అధికారిక కార్యక్రమాన్ని రసాభాసగా మార్చడంతో పాటు ఎమ్మెల్యేపై దాడి చేశారంటూ.. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదైయ్యాయి. ఎమ్మెల్యే సంజయ్‌పై అనుచితంగా ప్రవర్తించారంటూ ఆయన వ్యక్తిగత పీఏ కట్రోజు వినోద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ 1టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ 2023లోని సెక్షన్ 132, 115(2), 352, 292 కింద కేసు నమోదు చేయగా, సమావేశంలో గందరగోళం సృష్టించి ప్రభుత్వ కార్యక్రమాన్ని దారి తప్పినందుకు ఆర్డీఓ మహేశ్వర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు చేశారు.
ఈ రెండింటితో పాటు కరీంనగర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లేశం మరో ఫిర్యాదు చేశారు. తన పట్ల పాడి కౌశిక్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు మూడు వేర్వేరు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లోనే పాడి కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కరీంనగర్ తరలిస్తున్నారు. జిల్లా న్యాయమూర్తి ఎదుట.. కౌశిక్ రెడ్డిని ప్రవేశపెట్టనున్నారు.
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ వార్త తెలియగానే.. బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీమ్ కరీంనగర్ కు బయలుదేరింది. ఆయనను రిమాండ్ కు తరలించకుండా అడ్డుకునేందుకు చట్ట ప్రకారం ప్రయత్నాలు ప్రారంభించింది.
అసలేం జరిగిందంటే..
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతుండగా.. అసలు మీరు ఏ పార్టీ అని కౌశిక్ రెడ్డి నిలదీయడంతో గొడవ మొదలైంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్, శ్రీధర్ బాబు సమక్షంలోనే వాగ్వాదం జరగడం హాట్ టాపిక్‌గా మారింది. తొలుత సంజయ్ మాట్లాడుతుండగా.. అడ్డుకున్న పాడి కౌశిక్, సంజయ్ కి మైక్ అవ్వద్దు అంటూ అడ్డుకున్నారు. అసలు నువ్వు ఏ పార్టీ అంటూ వివాదాన్ని రేపారు. దీంతో.. క్రమంగా వివాదం పెద్దది అయ్యింది. అప్పటికే.. వారిని వారించేందుకు వచ్చిన ఇతర నాయకులు, ఎమ్మెల్యేల సమక్షంలోనే ఇరువురు నాయకులు.. ఒకరినొకరు తోసుకున్నారు.
Also Read : తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్.. పండుగ వేళ పసుపు బోర్డు ప్రారంభోత్సవం.. ముహుర్తం ఎప్పుడంటే..
జగిత్యాల ఎమ్మెల్యే మాట్లాడుతుండగా.. మీదకి వచ్చిన పాడి కౌశిక్.. తనను అడ్డుకోవడమే కాకుండా దురుసుగా మాట్లాడారని సంజయ్ ఆరోపించారు. జిల్లా అభివృద్ధి పై చర్చించకుండా.. అనవసర విషయాల్ని మాట్లాడుతూ, వ్యక్తిగత విమర్శలు చేశారంటూ ఆగ్రహించారు. వీరిద్దరి ఫైట్ తో ఒక్కసారిగా కరీంనగర్ కలెక్టరేట్ ప్రాంగణంలో రాజకీయ వేడి రగులుకుంది. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల తోపులాటలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తొటి ఎమ్మెల్యే అనే గౌరవం లేకుండా.. ఓరేయ్ అంటూ అసభ్యకర మాటల్ని కౌశిక్ వాడినట్లుగా వీడియోల్లో రికార్డ్ అయ్యింది. అలాగే.. ఎమ్మెల్యే సంజయ్ పైకి దూసుకెళ్లి, ఆయనపై దాడికి ప్రయత్నించినట్లుగా ఉండడంతో.. అన్ని వర్గాల ప్రజల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.