Ragging in Medical College: నాగర్‌కర్నూల్ జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేగింది. MBBS మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సీనియర్లు ర్యాగింగ్ చేసినట్లుగా తెలుస్తోంది. సీనియర్ల వేధింపులు తట్టుకోలేక ఈ నెల 26న స్థానిక పోలీస్ స్టేషన్‌లో విద్యార్థి కంప్లైంట్ చేశాడు. అతని ఫిర్యాదు వల్లే ఆలస్యంగానైనా ఈ విషయం బయటకు వచ్చింది.
ర్యాగింగ్ పేరుతో సీనియర్లు తనను హింసించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ముగ్గురు సీనియర్లు తనను బెల్ట్‌తో కొట్టారని, తన ఫోన్ లాగేసుకున్నాని బాదితుడు వాపోయాడు. ఫోన్‌లో ఉన్న ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకొని బ్లాక్‌మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ALSO READ: జనగామలో క్షుద్రపూజలు
విద్యార్థి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ర్యాగింగ్ చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతేకాకుండా మళ్లీ ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు విద్యార్థులకు కౌన్సెలింగ్ కూడా ఇస్తామని అన్నారు. మరోవైపు కాలేజీ యాజమాన్యం కూడా ఈ ఘటనపై స్పందించింది. కాలేజీలో ర్యాగింగ్ జరిగిన విషయం తనకు తెలియదని ప్రిన్సిపాల్ తెలిపారు. ఇకపై కాలేజీలో ర్యాగింగ్ అనే పేరు కూడా వినిపించకుండా చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదన్నారు.