Rajasingh vs Bandi Sanjay: రాజాసింగ్ మా పార్టీ ఎమ్మెల్యే అంటూనే.. రాజాసింగ్ కోసం రూల్స్ మార్చాలా..? వ్యక్తి కోసమో.. వ్యక్తి ప్రయోజనాల కోసమో భారతీయ జనతా పార్టీ స్టాండ్ మార్చుకునే పార్టీనా..? అంటూ గోషామహల్ బాద్‌షా రాజాసింగ్‌కు గట్టిగానే చురకలు అంటించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. దాంతో టోటల్ సీన్ అంతా రాజాసింగ్ వర్సెస్ బండి సంజయ్ అన్నట్లు మారిపోయింది. ఇటు పార్టీ రాజాసింగ్ వర్గీయులు, అటు బండి సంజయ్ వర్గీయులు కూడా సై అంటే సై అనుకునే పరిస్థితి తలెత్తింది. ఇప్పటికే మా దమ్మెంటో చూపిస్తాం అంటూ రాజాసింగ్ రాష్ట్ర నాయకత్వానికి పంపిన హెచ్చరికలకు … అంతే గట్టిగా మీ దమ్మెంటో అధిష్టానం చూసుకుంటుంది మేము కాదంటూ బండి సంజయ్ ధీటుగా సమాధానాలు ఇస్తున్నారు.. దీంతో పార్టీ సంస్థాగత ఎన్నికల సీన్ అంతా ఒక్కసారిగా మారిపోయింది.
వివాదానికి ఇదే కారణం..
ఇటీవల బిజెపి జిల్లా అధ్యక్షుల నియామకం జరిగింది. తొలుత 19 మంది జిల్లా అధ్యక్షులను, తాజాగా మరో నలుగురు జిల్లా అధ్యక్షులను పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ నలుగురి పేర్లలో రాజాసింగ్ సూచించిన గోల్కొండ అధ్యక్షుడి పేరు లేకపోవడమే వివాదానికి కారణమైంది. గోల్కొండ బీజేపీ అధ్యక్షుడి ఉమా మహేశ్ పేరును అధిష్టానం ప్రకటించడం రాజాసింగ్ కు మింగుడు పడటం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా రాజాసింగ్ పోటీ చేసినప్పుడు ఉమా మహేశ్ సహకరించలేదంట. కాంగ్రెస్ , ఎంఐఎం పార్టీలతో ఉమా మహేశ్ కుమ్మక్కు అయ్యారని రాజాసింగ్ ఆరోపిస్తూ.. పార్టీ నిర్ణయంపై ఫైర్ అవుతున్నారు
ALSO READ: CSIR Recruitment: నిరుద్యోగులకు శుభవార్త.. టెన్త్ పాసైతే చాలు.. జీతం రూ.63,200 భయ్యా..
బండి సంజయ్ వ్యాఖ్యలు చర్చనీయాంశం
ఈ నేపధ్యంలో రాజాసింగ్ ఎపిసోడ్‌పై బండి సంజయ్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. హిందుత్వ ఎజెండాను ముందుకు తీసుకుపోవడంలో రాజాసింగ్, బండి సంజయ్ లకు మించిన నేతలు తెలంగాణ బీజేపీలో లేరు.. ఎందుకంటే మసీదు తవ్వితే శివ లింగాలు వస్తే మాకు, శవాలు వస్తే మీకు అంటూ ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేసి అప్పట్లో కలకలం రేపారు బండి సంజయ్.. రాజాసింగ్ అయితే మహమ్మద్ ప్రవక్త మీద వివాదస్పద వాఖ్యలు చేసి, పార్టీ నుంచి రెండేళ్ల పాటు సస్పెండ్ కూడా అయ్యారు. అయితే బ్యాక్ రౌండ్ లేకనో, ఇంకోటో తెలీదు కానీ రాజాసింగ్ పార్టీ నుంచి సస్పెండ్ అయి అవమానాలు ఎదుర్కొంటే.. బండి సంజయ్ కరీంనగర్ కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగారు.
కరుడుగట్టిన హిందుత్వ నేతల మధ్య వార్
గోషామహల్ నుంచి వరుసగా గెలుస్తున్న రాజాసింగ్‌కి శాసనసభలో పార్టీ ఫ్లోర్ లీడర్ అవ్వాలనే కోరిక ఉన్నప్పటికీ ఆ కోరిక నెరవేరలేదు. కానీ బండి సంజయ్ మాత్రం కేంద్ర మంత్రి అయ్యారు. అలాంటి కరుడుగట్టిన హిందుత్వ నేతల మధ్య తేడాలు రావడం బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేతలో బండి సంజయ్ ప్రధాన పాత్ర పోషించారు. అటువంటి బండి సంజయ్ మారిపోయారని రాజాసింగ్ వర్గం అంటోంది. రాజసింగ్ పార్టీ లైన్ దాటుతూ లిమిట్స్ క్రాస్ చేస్తున్నారని బండి సంజయ్ అంటున్నారు. ఇలా వారిద్దరు పరస్పర విమర్శలు చేసుకునే స్థాయికి వచ్చారంటే పార్టీలో ఏం జరుగుతుందో అర్థంకావడం లేదని తలలు పట్టుకుంటున్నాయి కాషాయ శ్రేణులు. జిల్లాల అధ్యక్షుల నియామకంలో రాజసింగ్ చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ ఇవ్వడంతో వారిద్దరి మధ్య వార్ పిక్ స్టేజికి చేరుకుందనే టాక్ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది.
హాట్ టాపిక్‌గా రాజాసింగ్ వ్యాఖ్యలు
సరే హిందుత్వ ఎజెండానీ ఎవరు ఎక్కువగా ముందుకు తీసుకెళ్తున్నారు అనేది అటు ఉంచితే, దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఏ హిందుత్వ కార్యక్రమాలకైనా తెలంగాణ నుంచి రాజసింగ్ కు మాత్రమే ఆహ్వానం ఉంటుంది, తాజాగా మధ్య ప్రదేశ్ లో జరిగిన హిందుత్వ భారీ బహిరంగ సభలో తెలంగాణ బీజేపీ నుంచి రాజసింగ్ ముఖ్య వ్యక్తగా పొల్గొన్నారు.. అది రాష్ట్ర బీజేపీ నేతలకు ఎవరికి మింగుడు పడటం లేదనే టాక్ వినిపిస్తోంది. అందులో భాగంగానే బండి సంజయ్ తో పాటు బీజేపీలో ఉన్న కీలక లీడర్లను రాజాసింగ్ క్రాస్ చేస్తున్నారని, అందుకే ఆయన్ని సైడ్ చేయాలనే ఉద్దేశంతో పార్టీ రాష్ట్ర నాయకులు ఉన్నారనే చర్చ నడుస్తోంది . అది అట్లా ఉంచితే ఇన్సైడ్ జరుగుతున్న పరిణామాలను, అంశాలను దృష్టిలో పెట్టుకొని తనపై కావాలనే పార్టీలో కుట్రలు చేస్తున్నారని, స్వయంగా రాజాసింగే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీలో హాట్ టాపిక్‌గా మారాయి
రాజాసింగ్ వ్యవహారంపై బండి సంజయం స్పందించడంతోనే రచ్చ
రాజాసింగ్ పార్టీ లైన్ దాటితే ఆ వ్యవహారం పార్టీ చూసుకుంటుంది.. కానీ అందుకు భిన్నంగా రాజసింగ్ వ్యవహారంపై బండి సంజయ్ స్పందించడం రచ్చ రేపుతోంది. మొత్తం మీద అంతర్గతంగా ఉన్న విభేధాలన్నీ సంస్థాగత ఎన్నికల్లో బయటపడుతుండటంతో అధిష్టానం రాష్ట్ర పార్టీపై గట్టి ఫోకస్ పెడుతోందంట. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ రాజకీయాలు వేరని అధిష్టానానికి బాగా తెలుసు. అందులో భాగంగానే ఆచితూచి అధిష్టానం అడుగులు వేస్తోంది. ఉన్న ఫలంగా రాజాసింగ్ దూరమైతే పార్టీ తెలంగాణపై అనుకున్న లక్ష్యాలకు భారీ గండి పడుతుందనే అంచనాల్లో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇటు రాజాసింగ్, అటూ బండి సంజయ్ లకు అధిష్టానం క్లాస్ పీకినట్టుగా తెలుస్తోంది. ఎవరికి ఎవరు న్యాయ నిర్ణేతలు అవకండి … సంయమనం పాటించండి అని సున్నితంగానే మందలించినట్టు సమాచారం.
మరో చర్చకు దారి..
అయితే ఈ పంచాయితీలన్ని సంస్థాగత ఎన్నికల నుంచే ఏర్పడ్డాయి కాబట్టి పార్టీ నేతలపై వస్తున్న ప్రచారాలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆ ఎత్తుగడలు ఫలించడం లేదు. అయినా పార్టీ నాయకత్వం అధ్యక్షుల నియామకంలో ఎలాంటి ఒత్తిడిలకు లోనవ్వకుండా సంస్థగత ఎన్నికలు జరుగుతున్నాయని, ఎలాంటి ఏకపక్ష నిర్ణయాలు లేవని, జిల్లాల అధ్యక్షుల ఎంపికలో పార్టీ నిర్ణయమే ఫైనల్ అని బీజేపీ రాష్ట్ర సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ ఇన్చార్జి ఎండల లక్ష్మీనారాయణ చెప్పుకొస్తున్నారు. అంతేకాదు రాజాసింగ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ రాజాసింగ్ ప్రపోజల్ చేసిన వ్యక్తుల్లోనే ఒకరికి గోల్కొండ అధ్యక్షుడిగా నియమించడం జరిగిందని బాంబు పేల్చారు. ఎండల లక్ష్మి నారాయణ చెబుతున్న మాటలకు, రాజాసింగ్ చేస్తున్న వాఖ్యలకు ఎలాంటి పొంతన లేకుండా ఉండటంతో పార్టీ వర్గాల్లో మరో చర్చ మొదలైంది.
ALSO READ: KCR BIRTHDAY: మా నాన్న తెలంగాణ హీరో.. KTR ఎమోషనల్ ట్వీట్
అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందో..?
మొత్తం మీద బీజేపీ సంస్థాగత ఎన్నికలు చివరికి రాజాసింగ్ వర్సెస్ బండి సంజయ్‌గా మారిపోయాయి. సంస్థాగత ఎన్నికలు సజావుగా జరగడం లేదని అంతా అమ్యామ్యాలకు అమ్ముడు పోతున్నారనే టాక్ బలంగా వినిపిస్తున్న నేపధ్యంలో రాజాసింగ్ తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు. బండి సంజయ్ మాత్రం అంతా పార్టీ లైన్లోనే జరుగుతుందని, అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అంటూ రాజాసింగ్‌కు చురకలు అంటించారు. మరి ఢిల్లీ బీజేపీ పెద్దలు రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న నేతల పంచాయతీలను ఎలా చక్కబెడరారో? పార్టీలో కొనసాగడంపై రాజాసింగ్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి..