Baby heart surgery : పెద్దవాళ్లకు గుండె ఆపరేషన్ చేయాలంటేనే సవాలక్ష సమస్యలు ఎదురవుతాయని మనందరికీ తెలుసు.. మరి ఇంకా పుట్టని బిడ్డకు శస్త్ర చికిత్స చేయాలంటే ఎలా.? వినేందుకే అసాధ్యం అనిపిస్తున్నా.. నిజం చేసి ఆశ్చర్యపరిచారు హైదరాబాద్ వైద్యులు. గర్భస్థ శిశువు గుండెకు సమస్య తలెత్తగా.. తల్లి గర్భంలోనే ఆ గుండెకు చికిత్స చేశారు. చేయడమే కాదు.. ఆపరేషన్ ని విజయవంతం చేసి ఔరా అనిపించారు. ఇందుకోసం ప్రపంచంలోనే అత్యాధునిక, సరికొత్త చికిత్సా విధానాన్ని అనుసరించారు.
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంకి చెందిన సోని ప్రియ అనే మహిళ రెండోసారి గర్భవతి. ఆమెకు రెగ్యులర్ వైద్య పరీక్షలతో పాటు గర్భం దాల్చిన 18-22 వారాల మధ్య నిర్వహించే కీలక టిఫా స్కానింగ్ చేశారు. ఇందులో.. శిశువు గుండెలోని అయోటిక్ వాల్వు మూసుకుపోయినట్లు గుర్తించారు. దీంతో.. హైదరాబాద్ లోని రెయిన్ బో ఆసుపత్రి వైద్యుల్ని సంప్రదించారు. పూర్తి పరీక్షలు నిర్వహించి.. గర్భస్థ శిశువుకు అత్యవసరంగా చికిత్స చేయాలని నిర్ధరించారు. లేని పక్షంలో శిశువు మృతి చెందే అవకాశాలున్నట్లు గుర్తించారు. దాంతో.. అత్యంత సాహసోపేతంగా, అత్యాధునిక వైద్య విధానాల్ని వినియోగించి.. శిశువుకు చికిత్స చేసేందుకు సిద్ధమయ్యారు.
చికిత్స విధానం ఎలా ఉంటుంది..
గర్భస్థ శిశువు గుండెలోని అయోటిక్ వాల్వును తిరిగి తెరిచేందుకు ఫీటల్ బెలూన్ అయోటిక్ వాల్వాటామి అనే విధానం అందుబాటులో ఉంది. కానీ.. ఇప్పటి వరకు పెద్దవాళ్లకు మాత్రమే ఎక్కువగా వినియోగించగా.. తొలిసారి 27 వారాల శిశువుకు ఈ విధానంలో చికిత్స అందించారు. ఈ విధానంలో చిన్న సూది సాయంతో చిన్న బెలూన్‌తో తల్లి గర్భం నుంచి శిశువు గుండె లోపలకు పంపి.. అయోటిక్ వాల్వును సగభాగం తెరుస్తారు. దాంతో.. రక్త ప్రసరణ, గుండె పెరుగుదల సక్రమంగా ఉంటుంది.
శిశువు పుట్టిన తర్వాత మిగిలిన భాగాన్ని మళ్లీ ఇదే బెలూన్ పద్ధతిలో పూర్తిగా ఓపెన్ చేస్తారు.కాగా.. ఈ సర్జరీలు ప్రస్తుతానికి 60% విజయవంతం అవుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో.. ఈ పద్ధతికి సరికొత్త విధానాన్ని జోడించి.. గర్భస్థ శిశువుకు చికిత్స చేసినట్లు ఆసుపత్రి వైద్యులు చీఫ్ పీడియాట్రిక్ కార్డియాలజిస్టు డాక్టర్ కొనేటి నాగేశ్వరరావు, డాక్టర్ శ్వేతా బఖ్రు, పీడియాట్రిక్ కార్డియాలజిస్టు డాక్టర్ ఫణి భార్గవి.. తదితరులు వెల్లడించారు.
తల్లి గర్భంలో మత్తు మందు..
చికిత్స చేసే ముందుగానే..గర్భస్థ శిశువుకు తల్లి గర్భం ద్వారా మత్తు మందు ఇస్తారు. ఇందుకోసం పెద్ద నీడిల్ ని వినియోగించి.. గుండెకు 3.5 మి.మీ రంధ్రం చేస్తారని వైద్యులు తెలిపారు. దాని ద్వారా 4.5 మి.మీ బెలూన్‌ను పంపి మూసుకుపోయిన అయోటిక్ వాల్వును పూర్తిగా తెరిచినట్లు తెలిపారు. బెలూన్ బయటకు వచ్చినప్పటికీ గుండెకు చేసిన రంధ్రం ద్వారా రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది. అలా జరిగితే.. ఆ రక్తం శిశువు గుండె చుట్టూ చేరి ప్రాణాలకు ప్రమాదకరంగా మారే ప్రమాదముందని వైద్యులు చెప్పారు.
అలాంటి ప్రమాదాన్ని నివారించేందుకు రక్తస్రావం జరగకుండా నిరోధిెంచేందుకు.. 4.5 మి.మీ ల పరికరాన్ని గుండె లోపలికి పంపించి ఆ రంధ్రాన్ని మూసేసినట్లు వైద్యులు వివరించారు. ఈ విధానంలో చికిత్స చేసిన తర్వాత.. కొన్నిరోజులకే శిశువు గుండె పనితీరు మంచిగా మెరుగైందని తెలిపారు.
Also Read : ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో భారీ పేలుడు.. 8 మందికి తీవ్రగాయాలు
ఈ ప్రక్రియ మొత్తం గతేడాది సెప్టెంబరు తొలి వారంలో నిర్వహించగా.. నవంబర్ 5న బిడ్డ ప్రసవించింది. గర్భస్థ శిశువుకు ఇలా పెద్ద రంధ్రం చేసి పెద్దసైజు బెలూన్‌తో అయోటిక్ వాల్వును తెరవడం ప్రపంచంలోనే తొలిసారి అని, ఇది వైద్య రంగంలోనే అద్భుత విజయమని చెబుతున్నారు. ఇన్నాళ్లు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న శిశువు.. పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆ చిన్నారి గుండె పనితీరు మిగతా చిన్నారుల మాదిరిగానే ఉన్నట్లు వెల్లడించారు.