Recovery Agents: స్వేచ్ఛ బ్యూరో: తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించని వారిపట్ల ఆయా బ్యాంకులు, రికవరీ ఏజెంట్ల దురుసు చర్యలకు చెక్ పడనుంది. లోన్ తీసుకున్న వారిని.. వారికి గ్యారంటీ ఇచ్చిన వారిని బూతులు తిట్టటం, భయపెట్టేలా మాట్లాడటం ఇకపై చెల్లదు. ఈ మేరకు స్పష్టమైన మార్గదర్శకాలతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ ముసాయిదాను విడుదల చేసింది. సాధారణ ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలను ఈనెల 31వ తేదీలోపు తెలియ చేయవచ్చని పేర్కొంది. మన దేశంలో దిగువ, మధ్య, ఎగువ మధ్య తరగతులకు చెందిన వారే తొంభై శాతానికి పైగా ఉంటారు. వీరిలో చాలా మంది సొంత బైక్ కొనటానికి కూడా బ్యాంక్, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలపై ఆధార పడతారు. నెలకు అయిదు, ఆరంకెల జీతం ఉన్నవారు, చిరు వ్యాపారులు సొంతింటి కలను నిజం చేసుకోవటానికి కూడా రుణాలు తీసుకుంటుంటారు. అయితే, ఊహించని ఖర్చులు వచ్చిపడ్డా, చేస్తున్న ఉద్యోగం పోయి కొత్త జాబ్ దొరకక పోయినా సకాలంలో ఈఎంఐలు కట్టలేక పోతారు. తీసుకున్న రుణాలను చెల్లించలేక పోతారు.
అప్పుడు రికవరీ ఏజెంట్లు రంగంలోకి దిగుతారు. అప్పు తీసుకున్న వారి ఇండ్లకు మళ్లీ మళ్లీ వస్తూ గొడవలు పెట్టుకుంటారు. కట్టడం చేత కానోడివి అప్పు ఎందుకు తీసుకున్నావంటూ నలుగురిలో పరువు తీస్తారు. రోజులో అయిదారుసార్లు ఫోన్లు చేసి బూతులు తిడతారు. కొన్నిసార్లు లోన్ తీసుకున్న వారి వ్యక్తిగత సమాచారం, ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తామని బెదిరిస్తారు. లోన్ మీద బైక్ కొన్నా, కారు తీసుకున్నా సకాలంలో డబ్బు చెల్లించక పొతే వాటి సొంతదారులకు చెప్పకుండానే వాహనాలను తీసుకెళ్లి పోతారు. అదేమని అడిగితే బాకీ పడ్డ డబ్బు వడ్డీ సహా కట్టి తీసుకెళ్లమని చెబుతారు. ఇంకొన్నిసార్లు లోన్ తీసుకున్న వారి ఫోన్లు, టాబ్లెట్లను టెక్నాలజీ సాయంతో బ్లాక్ కూడా చేస్తున్నారు.
దీనిపై ఓ జాతీయ బ్యాంక్ లో సీనియర్ స్థాయి అధికారితో మాట్లాడగా ఈ సమస్య చాలా రోజుల నుంచి ఉన్నదే అని చెప్పారు. జాతీయ బ్యాంకుల రికవరీ ఏజెంట్లు సాధారణంగా హద్దులు దాటి ప్రవర్తించరని తెలిపారు. కారణం పరీక్ష పెట్టి పాసైన వారినే జాతీయ బ్యాంకులు రికవరీ ఏజెంట్లుగా పెట్టుకుంటాయని చెప్పారు. రుణగ్రహీతల పట్ల ఎలా ప్రవర్తించాలి అన్నదానిపై వీరికి స్పష్టమైన మార్గదర్శకాలు ఉంటాయని వివరించారు. ఇక, జాతీయ బ్యాంకులు రికవరీ మొత్తంపై కేవలం ఒక్క శాతం మాత్రమే కమీషన్ గా ఇస్తాయని తెలిపారు. ప్రైవేట్ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ సంస్థలు రికవరీ ఏజెంట్లకు పది శాతం వరకు కమీషన్ ఇస్తాయని తెలిపారు. దాంతో వాళ్లు తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తారని వివరించారు.
Also Read: Korra Meenu: తెలంగాణలో కొర్రమీను చాపకు కేరాఫ్‌గా ఆ జిల్లా..?
కాగా, రికవరీ ఏజెంట్ల దురుసు ప్రవర్తనతో ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు ఉన్నాయి. తరచూ ఇలాంటి విషాదాలు వెలుగు చూస్తుండటంతో రిజర్వ్ బ్యాంక్ ఈ అంశంపై దృష్టి సారించింది. రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించని వారిని వేధించే బ్యాంకులు, రికవరీ ఏజెంట్ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్సనల్, కార్, హోమ్ లోన్ బకాయిలను వసూలు చేయడానికి కస్టమర్ల మొబైల్ ఫోన్లను డిసేబుల్ చెయ్యటం వంటి చర్యలకు పాల్పడవద్దని ప్రతిపాదించింది. రికవరీ ఏజెంట్ల ప్రవర్తన, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై కఠినమైన మార్గదర్శకాలతో కూడిన ముసాయిదాను విడుదల చేసింది.
సాధారణ రుణాల వసూళ్ల కోసం రుణగ్రహీతల ఫోన్లు, టాబ్లెట్లను టెక్నాలజీ ద్వారా బ్లాక్ చేయడానికి వీల్లేదని ముసాయిదాలో పేర్కొంది. ఒకవేళ సదరు మొబైల్ ఫోన్‌ను సదరు బ్యాంక్ ఇచ్చిన లోన్ ద్వారా కొనుగోలు చేసి ఉంటే దాన్ని బ్లాక్ చేయడానికి బ్యాంకుకు అనుమతి ఉంటుంది. అయితే, ఈ ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా చెయ్యాల్సి ఉంటుంది. లోన్ ఈఎంఐ చెల్లించకుండా 90 రోజులు దాటిపోయి బ్యాంకు నోటీసులు ఇచ్చినా కస్టమర్ స్పందించకపోతేనే ఫోన్ బ్లాక్ చేయాలి. ఫోన్ బ్లాక్ చేసినా ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఇన్‌కమింగ్ కాల్స్, అత్యవసర ఎస్ఓఎస్ ఫీచర్లు, ప్రభుత్వ పబ్లిక్-సేఫ్టీ నోటిఫికేషన్లు వంటి అత్యవసర సేవలను నిలిపివేయటానికి వీల్లేదు. ఇక, కస్టమర్ బకాయిలను చెల్లించిన వెంటనే గరిష్టంగా గంట లోపు మొబైల్ ఫోన్‌పై విధించిన ఆంక్షలను బ్యాంకులు తొలగించాలి. ఒకవేళ తప్పుడు కారణాలతో ఫోన్ బ్లాక్ చేసినా, లేదా బకాయిలు చెల్లించిన తర్వాత కూడా గంటలోపు అన్‌లాక్ చేయకపోయినా బ్యాంకు కస్టమర్‌కు గంటకు 250 రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలి.
Also Read: తెలంగాణలో పర్యాటకులకు ఇక పండగే.. సంచలన నిర్ణయం తీసుకున్న సర్కార్!
ఇక, కస్టమర్లను సామాజిక మాధ్యమాల ద్వారా అవమానించడం, బూతు పదజాలం ఉపయోగించడం వంటి ఫిర్యాదులపై రిజర్వ్ బ్యాంక్ తీవ్రంగా స్పందించింది. లోన్ తీసుకున్న వారిని, వారికి గ్యారంటీ ఇచ్చిన వారిని భయపెట్టేలా మాట్లాడటం, బూతులు తిట్టడం పూర్తిగా నిషిద్ధం అని పేర్కొంది. సోషల్ మీడియాలో కస్టమర్ల ఆడియోజ్ వీడియో రికార్డింగులు లేదా వ్యక్తిగత వివరాలను పోస్ట్ చేయవద్దని తెలిపింది. మొబైల్, సోషల్ మీడియా యాప్స్ ద్వారా అసభ్యకరమైన మెసేజ్‌లు పంపటం వంటివి చేయరాదని పేర్కొంది. లోన్ తీసుకున్న వారికి మితిమీరిన కాల్స్, మెసేజ్ లు చేయవద్దని తెలిపింది. రికవరీ కాల్స్ ను తప్పనిసరిగా రికార్డు చెయ్యాలంది. బ్యాంక్ ఉద్యోగులు, రికవరీ ఏజెంట్లు కస్టమర్లకు చేసే ప్రతి కాల్ సమయం, కాల్స్ సంఖ్యను రికార్డు చేయాలని పేర్కొంది. అలాగే ఆ కాల్స్‌లో ఏం మాట్లాడారనే కంటెంట్‌ను కూడా భద్రపరచాలని తెలిపింది. బ్యాంకులకు ప్రత్యేక రికవరీ పాలసీ ఉండాలని, నిబంధనలు ఉల్లంఘించే ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
సవరించిన ఈ నిబంధనలను అక్టోబర్ 1వ తేదీ నుంచి అమలు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ప్రతిపాదించింది. ఈ ముసాయిదాపై స్టేక్‌హోల్డర్లు, సాధారణ ప్రజలు తమ అభిప్రాయాలను, సలహాలను మే 31 వరకు తెలియజేయవచ్చని తెలిపింది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRBs), కో ఆపరేటివ్ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ చేసిన ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే రికవరీ ఏజెంట్ల ఆగడాలకు అడ్డుకట్ట పడటం ఖాయం అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
Also Read: చెక్ పోస్టు ముందే అక్రమ మద్యం సిట్టింగులు.. పట్టించుకోని అధికారులు