Big Stories

Retaining Wall Collapsed : బాచుపల్లిలో తీవ్ర విషాదం.. గోడ కూలి ఏడుగురు దుర్మరణం, సీఎం దిగ్భ్రాంతి

Hyderabad news today(Telangana news updates): హైదరాబాద్ ను భారీ వర్షం కుదిపేసింది. మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి ఎప్పటిలాగానే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ భారీ వర్షం తీవ్ర విషాదాన్ని కూడా మిగిల్చింది. నిర్మాణంలో ఉన్న ప్రహరి గోడ కూలి ఏడుగురు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. బాచుపల్లి పీఎస్ పరిధిలోని రేణుక ఎల్లమ్మ కాలనీ రైజ్ నిర్మాణ సంస్థ చేపట్టిన భవన నిర్మాణం వద్ద ఈ ప్రమాదం జరిగింది.

- Advertisement -

అరవింద్ రెడ్డి అనే బిల్డర్ కు చెందిన రైజ్ కన్స్ట్రక్షన్ లో 30 అడుగుల భారీ రిటైనింగ్ గోడ కూలి సెంట్రింగ్ వర్కర్స్ ఉంటున్న షెడ్స్ పై పడింది. ఘటనపై సమాచారం అందుకున్న కూకట్ పల్లి పోలీసులు.. జేసీబీ సాయంతో మృతదేహాలను వెలికితీశారు. మృతులు ఒడిశా, ఛత్తీస్ గడ్ రాష్ట్రాలకు చెందినవారుగా గుర్తించారు. మృతుల్లో నాలుగేళ్ల బాలుడు సహా.. ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు.

- Advertisement -

Also Read : నేడు, రేపు కూడా వర్షాలు కురుస్తాయి: వాతావరణ శాఖ

మృతులు ఒడిశాకు చెందిన రాజు (25), తిరుపతి (20), శంకర్ (22), ఖుషి (20), ఛత్తీస్ గఢ్ కు చెందిన రాంయాదవ్ (34), గీత (30), హిమాన్షు (4) లుగా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బిల్డర్, సెంట్రింగ్ కూలీల కాంట్రాక్టర్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి చెందారు. నిర్మాణంలో ఉన్న గోడకూలి ఏడుగురు మృతి చెందడంపై ఆయన దిగ్భ్రాంతి చెందారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.

హైదరాబాద్ లోని బహదూర్ పురా క్రాస్ రోడ్డు సమీపంలో.. వర్షం కురుస్తున్న సమయంలో ఓ వ్యక్తి విద్యుత్ స్తంభాన్ని తాకడంతో షాక్ తగిలింది. దాంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. మరోవైపు బేగంపేట ఓల్డ్ కస్టమ్స్ బస్తీ నాలా వద్ద 2 మృతదేహాలు కొట్టుకువచ్చాయి. ఆ రెండు మృతదేహాలను వెలికితీసిన పోలీసులు.. వారి వివరాలను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News