Telangana Politics: మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌తో తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయా? దీనిపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్‌గా ఫోకస్ చేసిందా? జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో రేవంత్ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ సంకేతాలు ఇచ్చిందా? సురేఖతోపాటు మరో ఇద్దరికి ఉద్వాసన పలకడం ఖాయమా? అవుననే అంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. ఇంతకీ రేవంత్ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ ఎప్పుడు? అనేది ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ అధికార పార్టీలో నెలకొన్న రాజకీయాలపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ చేసింది. నేతల మాటలకు సంబంధించి ఎప్పటికప్పుడు నివేదికలు హైకమాండ్ వద్దకు చేరుకుంటున్నాయి. ఈ సమస్యలకు పుల్ స్టాప్ పెట్టాలని డిసైడ్ అయ్యింది. ఈ క్రమంలో రేవంత్ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ చేస్తే ఎలా అని ఆలోచన చేస్తోందట. ఈ మేరకు తెలంగాణ కీలక నేతలకు సంకేతాలు ఇచ్చినట్టు గాంధీభవన్ నుంచి ఓ వార్త గుప్పుమంది.
సోమవారం మీడియా ముందుకొచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి, దీనిపై స్పందించేందుకు ఇష్టపడలేదు. హైకమాండ్ చూసుకుంటుందని చెప్పేశారు. రేవంత్ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ శ్రావణమాసం చివరలో ఉండవచ్చని కొందరు నేతల మాట. అంతా రెడీ అయ్యిందని అంటున్నారు. ఈ ఎపిసోడ్‌కు రెండురోజుల ముందు బెంగుళూరు వెళ్లిన మంత్రి సురేఖ, నేరుగా ఖర్గేతో మాట్లాడినట్టు చెబుతున్నారు.
ఆయన సంకేతాలు ఇచ్చారన్నది గాంధీ భవన్ వర్గాల మాట. కొండాసురేఖతోపాటు మరో ఇద్దరికి ఉద్వాసన పలికే అవకాశమున్నట్లు సమాచారం. వారి స్థానంలో కొత్తవారిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందట. కొత్తగా మంత్రులను తీసుకున్న తర్వాత శాఖలను మార్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబరు 10 లోపు ఈ తతంగం పూర్తి కానున్నట్లు తెలుస్తుంది.
వర్షకాలం అసెంబ్లీ సమావేశాలను సెప్టెంబరు 7 నుంచి ప్రారంభించాలని రేవంత్ సర్కార్ భావించింది. దీనికి రెండు లేదా మూడు రోజులు అటు ఇటుగా ఉండవచ్చని అంటున్నారు. సురేఖను తప్పిస్తే.. బీసీ మహిళకు పదవి ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. కేబినెట్ నుంచి తప్పించే మంత్రుల జాబితా ఇప్పటికే హైకమాండ్ వద్దకు వెళ్లినట్టు సమాచారం.
కేబినెట్ ప్రక్షాళన తర్వాత తలెత్తే పరిణామాలను అంచనా వేసి, వాటిని కౌంటర్ చేసేందుకు వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మంత్రి పదవులు ఆశిస్తున్న నేతల జాబితా పెద్దదిగా ఉంది. సగానికి పైగానే అందులో సీనియర్లు ఉన్నారు. ఇప్పటికే ఏఐసీసీ ఇన్‌ఛార్జ్, దీనికి సంబంధించి నివేదిక ఇచ్చినట్టు కొందరు నేతలు ఆఫ్ ద రికార్డులో చెబుతున్నారు. అయితే కేబినెట్‌లోకి వచ్చింది ముగ్గురు మహిళా మంత్రులేనని మరొక వార్త.
ALSO READ: అల్పపీడనం ప్రభావం.. తెలంగాణల్లో భారీ వర్షాలు, హైదరాబాద్‌లో అయితే..