Revanth Reddy: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం వల్ల రాబోయే రోజుల్లో తాగునీరు, సాగునీరు, విద్యుత్ కొరత తీవ్రంగా మారే అవకాశం ఉంది. ఈ సంక్షోభాన్ని ముందే గుర్తించి తగిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో కోలుకోలేని దెబ్బ తింటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను తీవ్రంగా హెచ్చరించారు. సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన, వచ్చే జూన్ వరకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పక్కా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
రూపాయి ఖర్చుకైనా వెనుకాడం..
ప్రస్తుత పరిస్థితిలో విద్యుత్ సమస్య తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉంద ని సిఎం ఆందోళన వ్యక్తం చేశారు. ‘విద్యుత్ కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఎంత ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉంది. కానీ దురదృష్టవశాత్తు మార్కెట్లోనే విద్యుత్ దొరికే పరిస్థితి లేదు’ అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న విద్యుత్‌ను చాలా పొదుపుగా వినియోగించుకోవాలని కోరారు. విద్యుత్ ఆధారితంగా జరిగే అత్యవసరం కాని పనులను సాధ్యమైనంత వరకు తాత్కాలికంగా వాయిదా వేసుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
చుక్క నీరు వృథా కాకూడదు!
గతంలో వచ్చిన కోవిడ్ సంక్షోభాన్ని ఏ రకంగా ఎదుర్కొన్నామో, అదే తరహా పకడ్బందీ ప్రణాళికతో ఎల్‌నినో సవాలును కూడా దాటాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చుక్క నీరు కూడా వృథా కాకుండా చూడాలన్నారు. భవిష్యత్తులో నీటి సమస్య జటిలం కాకుండా ముందుజాగ్రత్త పనులు తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు.
అధికారులకు దిశానిర్దేశం..
ఈ పోరాటంలో ప్రజలను నేరుగా భాగస్వాములను చేయడమే అత్యంత కీలకమని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎల్‌నినో ప్రభావంపై విస్త్రతంగా అవగాహన కల్పించాలన్నారు. సినిమాలు, మీడియా, కళాజాతాలు , ఇతర సామాజిక మాధ్యమాలను ఉపయోగించి నీరు, విద్యుత్ పొదుపుపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Also Read: కుప్పకూలిన నెట్‌వర్క్‌లు, మూతపడ్డ ఎయిర్‌పోర్ట్.. పనామాలో మహా విపత్తు!