Panama Earthquake: ప్రశాంతంగా ఉన్న పనామాను భూకంపం ఒక్కసారిగా అతలాకుతలం చేసింది. భూమి కంపించిన తీరుకు ఎత్తైన భవనాలు ఊగిపోయాయి. మొబైల్ నెట్‌వర్క్‌లు కుప్పకూలాయి. హర్రెరా మధ్య ప్రావిన్స్‌కు దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వీధుల్లోకి పరుగులు తీశారు.
భూకంపంతో వణికిపోయిన పనామా..
భూకంపానికి పనామా రవాణా వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైంది. ప్రధాన రహదారులు నిలువునా చీలిపోవడంతో పలు ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ముందుజాగ్రత్త చర్యగా పనామా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తక్షణమే మూసివేశారు. రాకపోకలు సాగించాల్సిన విమానాలను పక్కదేశాలకు దారిమళ్లించారు. ఈ భూకంపం ఒక్కసారిగా ముగిసిపోలేదు. భూకంపం అనంతరం ఏకంగా 80కి పైగా తీవ్రమైన ప్రకంపనలు నమోదు కావడం ప్రజలను మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో రెస్క్యూ టీమ్‌లు రంగంలోకి దిగాయి.
పసిఫిక్ తీరాన సునామీ హెచ్చరికలు..
భూకంప భయం ఒకవైపు ఐతే… పసిఫిక్ తీరానికి జారీ అయిన సునామీ హెచ్చరికలు తీరప్రాంత ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. పనామా, కొలంబియా, కోస్టారికా సహా దక్షిణ అమెరికా తీరప్రాంతాలపై రాకాసి అలలు విరుచుకుపడే ప్రమాదం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం రెడ్ అలర్ట్ ప్రకటించింది. తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, ఎత్తైన పునరావాస కేంద్రాలకు వేగంగా తరలిస్తున్నారు. ముంచుకొస్తున్న రాకాసి అలల భయంతో తీరప్రాంతం నిశ్శబ్దంగా మారగా.. అధికార యంత్రాంగం అత్యవసర చర్యల్లో నిమగ్నమైంది. సునామీ ముప్పు పొంచి ఉండడంతో ప్రజలు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు.
పనామా అధ్యక్షుడు స్పందన..
భూకంప తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో ప్రజలు ఆందోళన చెందవద్దని అన్నారు. అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని ప్రజలకు పిలుపునిచ్చారు. భూకంపం తర్వాత పరిస్థితిని సమీక్షించేందుకు ఆయన పెనోనోమే ప్రాంతాన్ని సందర్శించారు. దేశవ్యాప్తంగా స్కూళ్లకు సెలవు ప్రకటించారు. భూకంపం నష్టంపై పొరుగుదేశాలు, అమెరికా సైతం సహాయానికి ముందుకొస్తున్నాయి.
Also Read: రాష్ట్రపతి భవన్ భేటీతో మారిన పొలిటికల్ గేమ్.. ఓటు చోరీకి రాహుల్ ఇస్తున్న ఆధారాలేంటి?