Revanth Reddy: రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచీ ఆయన మాట్లాడే తీరు చాలా ఘాటుగా.. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా ఉంటుంది. తాజాగా ములుగు జిల్లా పర్యటనలోనూ ఆయన అదే దూకుడు చూపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూనే, కేసీఆర్ కుటుంబంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సొంత చెల్లెలిని ఇంటి నుంచి వెళ్లగొట్టిన వాళ్లు తెలంగాణకు శనీశ్వరులంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద కలకలమే రేపుతున్నాయి.
ములుగు రూపురేఖలు మారుస్తాం..
ములుగు జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ముఖ్యంగా ఇక్కడి సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేయడంతో పాటు, చారిత్రక రామప్ప ఆలయం, మేడారం జాతర ప్రాంగణాలను అంతర్జాతీయ స్థాయి టూరిజం స్పాట్‌లుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. స్థానిక మంత్రి సీతక్కను ప్రశంసిస్తూ.. ‘ఆమెతో రక్త సంబంధం లేకపోయినా, కన్న తోడబుట్టిన ఆడబిడ్డలా చూసుకుంటున్నాను’ అని రేవంత్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.
ఆస్తి కోసం చెల్లెలిని వెళ్లగొట్టిన రాక్షసులు
గత బీఆర్ఎస్ పాలనపై నిప్పులు చెరిగిన సీఎం, కేటీఆర్, కేసీఆర్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. బతుకమ్మ చీరల పంపిణీలో కోట్ల రూపాయల కమిషన్లు తిన్నారని ఆరోపించారు. ‘ఒకపక్క ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెలిని ఇంట్లోంచి వెళ్లగొట్టిన రాక్షసుడు ఒకడైతే.. కొడుకు అంత పని చేస్తుంటే మౌనంగా చూస్తూ ఉండిపోయిన తండ్రి ఇంకొకడు. ఆస్తి కోసం రక్తసంబంధాలను కూడా పక్కనబెట్టిన వీరిద్దరే తెలంగాణకు పట్టిన శనీశ్వరులు’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాబోయే డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఆడబిడ్డలకు ‘ఇందిరమ్మ చీరలు’ అందజేస్తామని చెప్పారు.
కరువు రావాలని క్షుద్ర పూజలు
కేసీఆర్ కుటుంబం అధికారం పోయిన ఓర్వలేకపోతోందని రేవంత్ మండిపడ్డారు. ఫామ్‌హౌస్‌లకే పరిమితమై, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని తమిళనాడు, కర్ణాటక వెళ్లి క్షుద్ర పూజలు, అఘోరా పూజలు చేయిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కరువు వచ్చి ప్రజలు చనిపోవాలని కోరుకుంటున్నారని, అయితే దేవుడు తమ వైపే ఉన్నాడని అన్నారు. అందుకే ఎల్ నినో ప్రభావం ఉన్నప్పటికీ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిగా నిండిందని పేర్కొన్నారు. అదే విధంగా యువత ఇంగ్లిష్‌తో పాటు జపనీస్, జర్మన్, కొరియన్ భాషలు నేర్చుకుంటే గ్లోబల్ ఉద్యోగావకాశాలు వస్తాయని, ఇందుకు ప్రభుత్వం సహకరిస్తుందని ములుగు సభలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ఈ వ్యాఖ్యల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ములుగు పర్యటన ముగించుకుని, హన్మకొండ జిల్లా పరకాలకు బయలుదేరారు. అక్కడ సంత మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొని, రూ.484 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
Also Read: హైదరాబాద్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 18 నుంచి ఈ రూట్లో వన్-వే అమలు!