Batti Vikramarka : దేశంలోని వనరులు, సంపద అంతా ప్రజలకు దక్కాలి కానీ.. కొంత మంది పెట్టుబడిదారులకు కాదని, అలాంటి ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఏఐసీసీ సీనియర్ పరిశీలకుడు, స్టార్ క్యాంపెయినర్ గా జార్ఘండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న భట్టి విక్రమార్క.. అక్కడి కార్యకర్తలతో బూతు స్థాయి మీటింగుల్లోనూ, బహిరంగ సభల్లోనూ పాల్గొంటూ అక్కడి కూడమిని గెలిపించే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆదివారం నాడు జార్ఖండ్ లోని రాంఘర్ నియోజకవర్గ పార్టీ బూత్ స్థాయి సమావేశంలో, చిత్తార్పూర్ సీ, డీ బ్లాక్, రాజరప్ప బహిరంగ సభలో పాల్గొన్న భట్టి విక్రమార్క.. నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అదానీ, అంబానీ వంటి కొద్దిమంది క్రోనో క్యాపిటలిస్ట్ నుంచి జార్ఘండ్ కు విముక్తి కల్పించాలని, ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని పిలుపునిచ్చారు.
భారత్ జోడో యాత్రతో రాహుల్ ప్రజాస్వామిక శక్తుల్ని ఏకం చేశారన్న భట్టి విక్రమార్క.. విద్వేషాలను రగిలించే వారి చేతిలో దేశాన్ని పెట్టవద్దని, ప్రేమ ద్వారా అన్ని జాతులు, మతాలకు సమాన అవకాశాలు ఇస్తామనే సందేశాన్ని ఇచ్చారని అన్నారు. బీజేపీ పార్టీ దేశంలోని సంపదల్ని, ప్రభుత్వ రంగ సంస్థల్ని అదానీ, అంబానీలకు దోచిపెడుతున్నారంటూ మండిపడ్డ భట్టి విక్రమార్క.. అలాంటి వారి నుంచి దేశాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని తెలిపారు.
ఎన్నో విలువైన సహజ వనరులున్న జార్ఘండ్ లో.. కూటమి అభ్యర్థుల గెలుపు ద్వారానే వాటికి రక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. బీజేపీ వాటన్నింటినీ దోపిడీదారుల చేతిలో పెట్టాలని చూస్తుందని ఆరోపించారు. వారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సింది రాష్ట్ర ప్రజలే అని తెలిపారు. దేశ సంపదను జనాభా నిష్పత్తికి అనుగుణంగా పంపిణీ జరగాలన్న భట్టి విక్రమార్క.. దానికోసం ముందుగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్ని సూచించారు. అలా జరగాలంటే.. కూటమి విజయం సాధించాలని అన్నారు.
జార్ఘండ్ ప్రజలు డబ్బుకు లొంగిపోయే రకం కాదన్న తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి.. వారికి వివేచన, విచక్షణ ఉందని దానిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. బ్లాక్, గ్రామ కాంగ్రెస్, పోలింగ్ బూత్ అధ్యక్షులు సమావేశమై విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఇండియా కూటమి ఇస్తున్న హామీలు, మేనిఫెస్టోను ఓటర్లకు పెద్ద ఎత్తున వివరించాలని, విస్తృతంగా ప్రచారం చేయాలని మార్గనిర్దేశం చేశారు.
Also Read : ఇక్కడి నుంచే ఆదేశిస్తున్నా.. జిల్లా రూపురేఖలు మారిపోవాలి..సీఎం రేవంత్ రెడ్డి
రాంఘర్ అభ్యర్థి మమతా దేవిని భారీ మెజార్టీతో గెలిపించాలని, అలాగే కూటమి అభ్యర్థులను అందరినీ గెలిపించాలన్నారు. ఈ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఏఐసీసీ నాయకులు గులాం అహమద్ మీర్, ఏఐసీసీ సెక్రటరీ సిరివెళ్ల ప్రసాద్, జార్ఘండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేశవ్ కమలేష్ మహతో, షహ్ నాజ్ అన్వర్ సహా కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.