China Manja Effect: సంక్రాంతి ముందు నుండే హెచ్చరించారు పోలీసులు. ప్రమాదం అంటూ ప్రచారం సాగించారు. అక్కడికి దాడులు నిర్వహించారు. వ్యాపారాలు నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు. ఏకంగా హైదరాబాద్ నగరంలో దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున వాటిని స్వాధీనం చేసుకున్నారు. అయినా పోలీసుల మాటలను పెడచెవిన పెట్టి మరీ, కొందరు అన్నంత పని చేశారు. అలా చేసినందుకే కొందరు పాపం.. గాయాల పాలయ్యారు. ఇంతకు ఈ ఘటనలకు అసలు కారణం ఏమిటో తెలుసా.. చైనా మాంజాలు.
సంక్రాంతి వచ్చింది. పతంగుల హడావుడి ఖచ్చితంగా ఉంటుంది. కానీ పతంగులు ఎగుర వేసేందుకు యువకులు కొన్ని నిబంధనలు పాటించాలని ప్రభుత్వం పలు సూచనలు జారీ చేసింది. అంతేకాదు పోలీసులు కూడ సంక్రాంతి పండుగను సంబరంగా జరుపుకోండి.. ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దంటూ హెచ్చరించారు.
ప్రధానంగా పతంగులు ఎగురవేసే సమయంలో చైనా మాంజాలను వినియోగించరాదని సూచించారు. గత ఏడాది తెలంగాణలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకొని, పోలీసులు ముందుగానే అప్రమత్తమైంది. కానీ కొందరు చేసిన నిర్వాకంతో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. నిన్న నిజామాబాద్ లో జరిగిన ఘటన మరువకముందే, సంక్రాంతి పండుగ రోజు చైనా మాంజాల బారిన పడి కొందరికి తీవ్రగాయాలయ్యాయి.
నిజామాబాద్ జిల్లాలో సంక్రాంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా కొందరు యువకులు చైనా మాంజాలను చేతబట్టి పతంగులను ఎగురవేశారు. వద్దన్నా చైనా మాంజాలను చేతబట్టి గాలిలోకి వదలగా అవి తెగిపడ్డాయి. నిన్న నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి లో బాలుడి గొంతుకు చైనా మంజా తగిలి తీవ్ర గాయాలైన విషయం అందరికీ తెలిసిందే.
తృటిలో పెనుప్రమాదం తప్పిందని వైద్యులు తెలిపారు. ఆ ఘటన మరువకముందే సంక్రాంతి రోజు కూడ అదే కమ్మర్పల్లి సమీపంలో చైనా మాంజా ప్రవీణ్ అనే యువకుడి గొంతుకు తగిలింది. ప్రవీణ్ బైక్ పై వస్తున్న క్రమంలో చైనా మంజా తగలగా, గొంతుకు తీవ్రగాయమైంది. వెంటనే స్థానికులు అతడిని వైద్యశాలకు తరలించారు.
అలాగే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం కర్ధనూరు గ్రామం వద్ద కూడ ఇదే తరహా ఘటన మంగళవారం జరిగింది. రహదారి గుండా వెళ్తున్న ఓ ప్రయాణికునికి చైనా మాంజ తగలగా, మెడకు తీవ్ర గాయమైంది. అలా తెగడంతో పాటు తీవ్ర రక్తస్రావం కాగా స్థానికులు అతడిని 108 వాహనంలో వైద్యశాలకు తరలించారు. బాధితుడు వికారాబాద్ వాసి వెంకటేష్ గా గుర్తించారు.
Also Read: TG Schemes: మీకు రూ. 12 వేలు కావాలంటే.. ఈ అర్హతలు ఒకసారి చెక్ చేసుకోండి
ప్రమాదమంటూ పలుమార్లు హెచ్చరించినప్పటికీ, పెడచెవిన పెట్టి చైనా మాంజాలను వినియోగించిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పాపం.. సంక్రాంతికి సంబరంగా పండుగ జరుపుకుంటున్న క్రమంలో చైనా మాంజాల ధాటికి తీవ్రగాయాల పాలు కావడంతో క్షతగాత్రుల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.