MLA Anirudh Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యే రహస్య భేటీ ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేగుతోంది. రాష్ట్రంలో ఇప్పుడు ఈ సంఘటన హాట్ టాపిక్‌గా మారింది. ఈ రహస్య భేటి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినట్లు వార్తలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. భేటీలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, మేఘా రెడ్డి తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఎట్టకేలకు స్పందించారు. ఓ మీడియ ప్రతినిధితో ఆయన మాట్లాడారు.
ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసిన విషయం నిజమేనని అన్నారు. తాను ఏ ఫైల్ ను కూడా రెవిన్యూ మంత్రి దగ్గర పెట్టలేదని చెప్పారు. అసలు నిజానికి అది ఏ ఫైల్ అనేది నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి చెప్పాలని అన్నారు. రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో అభివృద్ధి, కొన్ని ప్రాజెక్టుల పనుల కోసం ఒక చోట కలిసి మాట్లాడుకుంటే తప్పెంటి అని ఆయన ప్రశ్నించారు. అసలు తాము రహస్యంగా సమావేశం కాలేదని తేల్చి చెప్పారు. కానీ మేం అధిష్టానంతో మాట్లాడాల్సింది చాలా ఉందని అన్నారు. రాష్ట్ర పార్టీ ఇన్ ఛార్జి దీపాదాస్ మున్షీతో భేటీ అయిన తర్వాత ప్రతి విషయం మాట్లాడుతా అని పేర్కొన్నారు. ‘అన్ని వివరాలు తెలియజేస్తా. నా క్యారెక్టర్‌ను తప్పుగా చూపిస్తే ఊరుకునేది లేదు. అన్ని ఆధారాలతో పెద్దలతో కలిసి మాట్లాడుతా’ అని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సెన్సెషనల్ కామెంట్స్ చేశారు.
అయితే.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడిన తీరు చూస్తుంటే.. నిధుల కేటాయింపులో తమకు అన్యాయం జరుగుతోందని అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొందరు రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలకు మాత్రమే నిధుల తరలింపు జరుగుతోందని దీన్ని బట్టి తెలుస్తున్నది. ముఖ్యంగా మంత్రుల నియోజకవర్గాలేకు అభివృద్ధి కోసం నిధులు వెళ్తున్నాయనే భావన కొందరు ఎమ్మెల్యేల్లో ఉన్నట్లు సమాచారం. తమ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదనే.. కొందరు ఎమ్మెల్యేలు రహస్య భేటీ అయినట్లు టాక్ నడుస్తోంది.
Also Read: Hyderabad News: పొద్దుపొద్దున్నే ఘోర ప్రమాదం.. ఒకరు సజీవ దహనం
కనీసం తమ నియోజకవర్గానకిి గానీ.. తమకు వ్యక్తిగతంగా కూడా గౌరవం దక్కడం లేదని భావన వారిలో గట్టిగా ఉన్నట్లు విశ్వనీయ వర్గాల సమాచారం. అయితే దీనిని కొన్నిపార్టీలు తమకు అనుకూలంగా మార్చుకుని కాంగ్రెస్ పార్టీపై ట్రోల్ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి అలజడులు జరగలేదని.. అంతా బాగానే ఉందని తెలంగాణ కాంగ్రెస్ చెప్పుకొస్తుంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్.. తాజాగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రహస్య భేటీపై ఆరాతీశారు. తాను పార్టీకి చెందిన కొందరి ఎమ్మెల్యేలతో కలిసి భోజనం చేయాలనే ఉద్దేశ్యంతోనే సమావేశం నిర్వహించినట్లు ఎమ్మెల్యే అనిరుధ్ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై నిజానిజాలు త్వరలోనే తెలియనుంది. అసలు ఎమ్మెల్యేలు ఎందుకు భేటీ అయ్యారు..? నిజంగానే వారి నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు జరగడం లేదా..? తదితర విషయాలపై తెలంగాణ కాంగ్రెస్ ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి మరీ.