Mosquitos In Hyderabad: రాత్రయితే చాలు.. అక్కడంతా భయం భయం. ఔను.. చీకటి పడిందంటే చాలు, అక్కడి ప్రజలు ఒక్కరూ బయటకు రావడం లేదు. అంతేకాదు తలుపులు కూడా మూసేస్తున్నారు. ఇంతలా వారు భయపడే పరిస్థితికి గల కారణం.. ఏ దెయ్యమో.. భూతమో కాదు. చేతబడి భయం కానే కాదు. ఆ కాలనీ భయపడే పరిస్థితికి కారకులు ఎవరో తెలుసా.. దోమలు. ఆ కాలనీపై సమరమే ప్రకటించాయట దోమలు. ఔను దోమల ధాటికి ఆ కాలనీ వాసుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావట. అందుకే చీకటి పడితే చాలు.. ఇక్కడ తలుపులు మూత గ్యారంటీ.
హైదరాబాద్ నగరంలోని మణికొండలో ఇబ్రహీం బాగ్, నేక్నాంపూర్ కాలనీలు ఉన్నాయి. ఈ కాలనీ పరిసర ప్రాంతాలలో నీటి సరస్సు ఉంది. ఈ సరస్సులో నిత్యం నీరు నిల్వ ఉంటుంది. సరస్సు అందాలు అందరినీ ఆకట్టుకుంటాయి. అది పగలుకే పరిమితమట. రాత్రయితే అందాలు దేవుడెరుగు, అసలు సమరం అప్పుడు మొదలవుతుందని కాలనీ వాసులు అంటున్నారు. సాయంత్రం 6 కాగానే ఇళ్లకు తలుపులు వేయాల్సిందే. లేకుంటే సరస్సు నుండి వచ్చే దోమలు ఒక్కొక్కటిగా కాదు షేర్ ఖాన్.. ఏకంగా వంద మందిని పంపించు.. అనే మగధీర సినిమా డైలాగ్ మాదిరిగానే ఒకేసారి లక్షల సంఖ్యలో దోమలు సమరం ప్రకటిస్తున్నాయట.
సాయంత్రం వేళ ఈ కాలనీలకు దోమల బెడద అధికంగా ఉంటుందని స్థానికులు తెలుపుతున్నారు. తీవ్రమైన దోమల బెడద కారణంగా సాయంత్రం 6 గంటల తర్వాత నివాసితులు ఇళ్లలోనే ఉండాల్సి వస్తుందట. అలా బయటకు వచ్చారో దోమ కాటుకు గురవ్వాల్సిందే. ఏదో ఒక దోమ కాటు అయితే ఫరవాలేదు. సినిమాలో యాక్షన్ సీన్లను తలపించే ఇట్టే పట్టి పీడిస్తున్నాయట. అందుకే మహాప్రభో.. దోమల బెడద నుండి కాపాడండి అంటూ అక్కడి ప్రజలు కోరుతున్నారు. కాలనీ వాసుల గృహాలలో వారానికి ఒకరైన జ్వరాల బారిన పడుతున్నారని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి దోమలను అరికట్టే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
కాలనీలో గల చిన్నారులను ఆటవిడుపుగా బయటకు పంపించే పరిస్థితి లేదని, అందుకు దోమలే కారణమని తెలుపుతున్నారు. చెరువుల పరిరక్షణ మంచిదేనంటున్న స్థానికులు, ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఓ వైపు ఎండలు విపరీతంగా ఉన్నా, దోమల ఎఫెక్ట్ అధికంగా ఉందని, జోరు వానలు కురిస్తే తమ పరిస్థితి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే జీహెచ్ఎంసీ అధికారులకు తగిన ఆదేశాలిచ్చి దోమల బెడద నుండి కాలనీని కాపాడాలని వారు కోరుతున్నారు.
Also Read: పొలంలో నోట్ల కట్టలు.. షాకైన రైతులు, ఇంతలో ఊహించని ట్విస్ట్
ఇదే పరిస్థితి మణికొండ సమీప ప్రాంతాలలో కూడా ఉందని తెలుస్తోంది. దోమల నియంత్రణకు ఫాగింగ్ యంత్రం ద్వారా ప్రతిరోజూ పొగను వదలేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు సూచిస్తున్నారు. అయితే పరిసరాల పరిశుభ్రత పాటించాలని, అప్పుడే దోమల నివారణ సాధ్యమవుతుందని అధికారులు తెలుపుతున్నారు. మొత్తం మీద దోమల ధాటికి ఓ కాలనీ భయపడి సాయంత్రం 6 గంటలకు తలుపులు మూసే పరిస్థితి ఉండడం విశేషం. దీనిని బట్టి అక్కడ దోమల బెడద ఎలా ఉందో చెప్పవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.