Kavitha: బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది? కవిత వ్యాఖ్యల తర్వాత అసలు డ్రామా మొదలైందా? ఆ పార్టీలో నేతలు ఎందుకు ఆలోచనలో పడ్డారు? కవిత చేస్తున్న రహస్య భేటీలు ఎంతవరకు ఫలిస్తాయి? కవిత రాజీనామాపై కేసీఆర్‌కు రాతంత్రా నిద్ర లేదా? ఇవే ప్రశ్నలు ఆ పార్టీ నేతలు వెంటాడుతున్నాయి.
అమెరికా నుంచి వచ్చిన తర్వాత కవిత వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ నేతల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం ఆమెకి అందుతున్నట్లు కనిపిస్తోంది. తొలిరోజు మీడియా ముందుకొచ్చిన కవిత, హరీష్‌రావుని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. మరుసటి రోజు ఆమె రాజీనామా చేయడంతో కారు పార్టీలో భారీ కుదుపు మొదలైంది.
కవిత వ్యవహారం రాకముందు వరకు పార్టీలో కేటీఆర్ పేరు బలంగా వినిపించేది. ఎప్పుడైతే తెరపైకి హరీష్‌రావు పేరు వచ్చిందో ఒక్కసారిగా కేటీఆర్ గ్రాఫ్ డౌన్ ఫాల్ అవుతున్నట్లు కొందరు నేతలు ఆఫ్ ద రికార్డులో చెబుతున్నారు. కవిత వ్యాఖ్యలకు పార్టీ నేతలు కౌంటర్ ఇవ్వడమే కారణమని అంటున్నారు.
ఈ లెక్కన కేసీఆర్ తర్వాత పార్టీ బాధ్యతలు హరీష్‌రావుకు అప్పగించే అవకాశం ఉందన్న ప్రచారం లేకపోలేదు. ఈ విషయం తెలియగానే కవిత అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. ప్రధాన అనుచరులతో రహస్యంగా కవిత భేటీ అయినట్టు వార్తలు వస్తున్నాయి. పార్టీని చీల్చే ప్రయత్నాలు ఆమె ఏమైనా చేస్తున్నారా? అన్న ప్రశ్నలు లేకపోలేదు.
ALSO READ: ఖైరతాబాద్ గణేష్ దర్శనం అర్థరాత్రి వరకే
బుధవారం సాయంత్రం జాగృతి సోషల్ మీడియా ప్రతినిధులతో భేటీ అయ్యారు కవిత. ఇదే క్రమంలో కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చారు. కారులో ప్రాధాన్యం దక్కని నాయకులు తనతో ప్రయాణం చేయాలని కోరినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఉద్యమ సమయంలో ఆక్టివ్‌గా పని చేసినవారిని ఆమె నుంచి ఫోన్లు వెళ్లినట్టు సమాచారం. జాగృతిలో చేరాలని కవిత కోరనున్నట్లు సమాచారం.
జరిగిన.. జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నవారు, కవిత పార్టీ పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. రాజకీయాల్లో ధనప్రవాహం సాగుతున్న ఈ రోజుల్లో పార్టీ పెట్టడమంటే మాటలు కాదని అంటున్నారు. చాలామంది పార్టీలను మేనేజ్ చేయలేక చేతులెత్తేసిన సందర్భాలు చాలానే ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.
ఈ లెక్కన కవిత వెనుక ఏదో స్కెచ్ ఉందని అంటున్నారు. లేకుంటే కాళేశ్వరం అవినీతి విషయాన్ని మరుగునపడేందుకు పార్టీ ఈ తరహా ప్లాన్ చేసిందా? అన్న చర్చ లేకపోలేదు. కవిత చేసిన వ్యాఖ్యలపై హరీష్‌రావు నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆయన సైలెంట్‌గా ఉంటే కాళేశ్వరం వ్యవహారాన్ని మరుగున పరచడమేనని అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. మొత్తానికి బీఆర్ఎస్‌లో ఏం జరుగుతుందో ఎవరికి ఎరుక.