పొరుగు దేశాలు అయిన నేపాల్, భూటాన్ ప్రజల రాకపోకలకు సంబంధించి భారత్ నిబంధనలను సరళతరం చేసింది. సరిహద్దు ప్రయాణ నిబంధనలలో భారీ మార్పులను ప్రకటించింది. సెప్టెంబర్ 2 నుంచి ఈ నిబంధనలు అమలు చేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది.
నేపాల్, భూటాన్ పౌరులు రోడ్డు మార్గం లేదంటే వాయుమార్గంలో ఇక సులభంగా ఇండియాలోకి రావచ్చు. పాస్ పోర్టు, వీసా లేకపోయినా ఫర్వాలేదు. వాటికి బదులుగా ప్రయాణికులు చెల్లుబాటు అయ్యే నేపాల్, భూటాన్ గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుంది. నేపాల్, రాయల్ భూటాన్ మిషన్ జారీ చేసిన పరిమిత చెల్లుబాటు ఫోటో ID ఉన్నా చాలు. 10–18 సంవత్సరాల వయసున్న మైనర్లకు, చెల్లుబాటు అయ్యే పత్రాలను కలిగి ఉన్న తల్లిదండ్రులతో ప్రయాణిస్తుంటే, ప్రిన్సిపాల్ సంతకం చేసిన స్కూల్ ఫోటో ఐడీ ఉంటే సరిపోతుంది. 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఎటువంటి ఐడీని చూపించాల్సిన అవసరం లేదు.ఈ నిబంధనల సడలింపు నేపాల్, భూటాన్ నుంచి నేరుగా వచ్చే పౌరులందరికీ వర్తిస్తుంది. అయితే, ఈ దేశాల పౌరులు ఏదైనా ఇతర దేశం మీదుగా భారత్ లోకి వస్తే పాస్ పోర్ట్ తప్పనిసరి. ఇక ఈ మార్గదర్శకాలు టిబెటన్ శరణార్థులకు కూడా వర్తిస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వారి ప్రవేశ సమయం ఆధారంగా చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను కలిగి ఉండాలి.
సరిహద్దు ప్రయాణ అనుమతుల సడలింపుతో పాటు, ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వచ్చే ఇమ్మిగ్రేషన్, ఫారినర్స్ చట్టం, 2025 కింద కఠినమైన పర్యవేక్షణను అమలు చేయనుంది. ఈ చట్టం పాస్ పోర్ట్ నియమాలు 1950, ఫారినర్స్ ఆర్డర్ 1948 లాంటి పాత చట్టాలను ఫుల్ ఫిల్ చేయనుంది. ఇది యూనిఫామ్ ఇమ్మిగ్రేషన్ ఫ్రేమ్ వర్క్ ను సృష్టిస్తుంది. బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ (BOI) అధికారులు ఇమ్మిగ్రేషన్ మోసాలను పరిశీలించేందుకు, అక్రమ వలసదారులను బహిష్కరించడానికి కీలక చర్యలు చేపడుతుంది. నేపాల్ నుంచి వచ్చిన వారితో సహా విదేశీ పౌరులు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (OCIలు) ఫారమ్ Cని సమర్పించాలి. అయితే హోటళ్ళు, ఆసుపత్రులు, యూనివర్సిటీలు విదేశీ గెస్టులు, విద్యార్థుల వివరాలను అందించాల్సి ఉంటుంది. నిబంధనలను పాటించకపోతే రూ. 3 లక్షల వరకు జరిమానాలు, మూడు సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.
మానవతా దృక్పథం భాగంగా డిసెంబర్ 31, 2024, అంతకు ముందు భారతదేశంలోకి ప్రవేశించిన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ మైనారిటీలు(హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులు) చెల్లుబాటు అయ్యే పాస్ పోర్ట్ లు, వీసాలు కలిగి ఉండాల్సిన అవసరం లేదని చెప్పింది. జనవరి 9, 2015 నాటికి వచ్చిన రిజిస్టర్డ్ శ్రీలంక తమిళులకు కూడా ఉపశమనం కల్పించింది.
Read Also: ఈ దేశానికి వెళ్తే మీరు విమానాల్లో ఫ్రీగా తిరగొచ్చు.. చిల్లిగవ్వ కూడా చెల్లించక్కర్లేదు!