Singareni Mines: స్వేచ్ఛ బ్యూరో: కేంద్ర బొగ్గు శాఖ ప్రతీ ఏటా నిర్వహించే అత్యుత్తమ గనుల ఎంపికలో ఈసారి సింగరేణి సంస్థ నుంచి 5 గనులు 5-స్టార్ రేటింగ్ సాధించి జాతీయ స్థాయి ఉత్తమ అవార్డులకుఎంపికయ్యాయి. కేంద్ర బొగ్గు శాఖ విడుదల చేసిన జాబితాలో శ్రీరాంపూర్ ఏరియాకు చెందిన ఆర్ కే న్యూటెక్, ఆర్ కే -6, సత్తుపల్లి ఏరియా నుంచి జేవీఆర్ ఓసీ-2, బెల్లంపల్లి ఏరియా నుంచి ఖైరిగూడ ఓపెన్ కాస్టు గని, రామగుండం-3 ఏరియా నుంచి ఆర్ జీ ఓసీ-1 గనులు అత్యుత్తమ 5-స్టార్ రేటింగ్ గనులుగా ఎంపికయ్యాయి. దేశవ్యాప్తంగా 382 గనులు ఈ 5 స్టార్ రేటింగ్ కోసం దరఖాస్తు చేసుకోగా.. అందులో 50 గనులు 5 స్టార్ రేటింగ్‌కు ఎంపికయ్యాయి. అందులో 5 గనులు సింగరేణి నుంచి ఉండటం విశేషం.
గతేడాది 4 గనులకు ఈ 5-స్టార్ రేటింగ్ రాగా 2024-2025 సంవత్సరానికి గాను సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా 5 గనులకు 5-స్టార్ రేటింగ్ లభించడం విశేషం. దీనిపై ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ఉత్తమ గనుల అధికారులకు, కార్మికులకు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఇతర గనులకు కూడా ఈ గనులను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. బొగ్గు గనుల్లో ఉత్తమ పని విధానం, కార్మిక సంక్షేమం, పర్యావరణహిత చర్యలు, సమీప గ్రామాల అభివృద్ది వంటి 7 ప్రధాన విభాగాల్లో మొత్తం 50 అంశాల్లో అత్యుత్తమంగా ఉంటున్న గనులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ తన అనుబంధ సంస్థ అయిన కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రతీ ఏడాది ఈ పోటీని నిర్వహిస్తున్నారు.
కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ వారు ప్రతీ ఏటా దేశ వ్యాప్తంగా ఉన్న బొగ్గు గనుల నుంచి 5-స్టార్ రేటింగ్ లో పాల్గొనవల్సిందిగా ఆహ్వానం పలుకుతుంటారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ బొగ్గు మైనింగ్ కంపెనీలు ఈ 5-స్టార్ రేటింగ్ కోసం స్వీయ మూల్యాంకనం నిర్వహించుకుని దరఖాస్తు చేస్తుంటాయి. ఇందులో ప్రధానంగా 7 విభాగాల్లో గనుల ప్రతిభ, పని పరిస్థితులు పరిగణనలోకి తీసుకుంటారు. ఆ గనుల్లో మైనింగ్ ఎలా నిర్వహిస్తారు? బొగ్గు తవ్వకం టెక్నాలజీని సమర్ధవంతంగా వాడుతున్నారా? గని ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? గని ప్రభావిత ప్రాంతాల్లో, గ్రామాల్లో సంక్షేమ చర్యలు, కార్మిక సంక్షేమ చర్యలు ఏ స్థాయిలో అమలవుతున్నాయి?, రక్షణ, కార్మికుల భద్రతకు తీసుకొంటున్న చర్యలు, పర్యావరణహిత చర్యలు వంటివి పరిశీలనకు తీసుకొంటారు.
Also Read: Corporation Appointments: కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్.. ఫైనల్ లిస్ట్ విడుదల..?
ఈ 7 ప్రధాన విభాగాల్లో మొత్తం 50 అంశాల్లో ఏ గనులు అయితే నూటికి 90 శాతం మార్కులు పైబడి సాధిస్తాయో వాటిని 5-స్టార్(అత్యుత్తమ) గనులుగా గుర్తిస్తారు. 5-స్టార్ రేటింగ్ ఇచ్చేముందు కోల్ కంట్రోలర్ విభాగానికి చెందిన నిపుణుల బృందం ఆ గనులను సందర్శించి, ఆ గనులు ఇచ్చిన సమాచారం సరైనదేనా? కాదా? అని తనిఖీ చేస్తారు. ప్రత్యక్ష పరిశీలనలో సంతృప్తి చెందిన తర్వాతనే అత్యుత్తమ గనులను 5-స్టార్ రేటింగ్ గనులుగా ఎంపిక చేసి ప్రకటిస్తారు. సింగరేణి సంస్థలో కూడా కోల్ కంట్రోలర్ విభాగం నిపుణుల బృందం ఇటీవల ప్రత్యక్ష పరిశీలన జరిపింది. అనంతరం 5 గనులను 5 స్టార్ రేటింగుకు ఎంపిక చేసింది.
సింగరేణి సంస్థ పనితీరుకు, రక్షణ, భద్రత, పర్యావరణహిత చర్యల అమలుకు గుర్తింపుగా ఈ అవార్డులు లభించాయని ఉత్తమ గనుల అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే 5-స్టార్ కన్నా కొంచెం తక్కువ మార్కులు(80-90 శాతం) సాధించిన గనులను 4 స్టార్ రేటింగ్ గనులు అంటారు. ఈ గనులకు ఎటువంటి అవార్డులు ఇవ్వరు కానీ దాదాపు ఉత్తమ శ్రేణి వరకు వచ్చిన గనులుగా గుర్తింపు వస్తుంది. సింగరేణిలో ఈసారి 4-స్టార్ రేటింగ్ ను 17 గనులు సాధించడం విశేషం. కొద్ది మార్కుల తేడాతో ఈ గనులు 5-స్టార్ రేటింగ్ ను కోల్పోయాయి.
Also Read: నల్లగొండ జిల్లాలో ఇంత అందమైన జలపాతం ఉందా? వర్షాకాలంలో ఒక్కసారైనా వెళ్లాల్సిందే!