Sircilla RDO: ఆ తండ్రికి ఇద్దరు కొడుకులు.. వారిద్దరి చూసి తెగ మురిసిపోయేవాడు. తన జీవితం రాజ భోగంగా ఉంటుందని భావించాడు. వారిద్దరు పెద్దవాళ్లయ్యారు.. పెళ్లి చేశాడు. ఇంతలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రభుత్వం ఇచ్చింది. ఆ ఇంటిని పెద్ద కొడుకు తన భార్య పేరిట రాయించుకున్నాడు.
చివరకు ఆ తండ్రిని రోడ్డు మీదకు గెంత్తేశారు కొడుకులిద్దరు. రోడ్డుపై భిక్షాటన చేస్తూ కడుపు నింపుకునేవాడు. ఈ విషయం ఆయన ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లాడు పెద్దాయన. రంగంలోకి దిగిన అధికారులు, ఆ కొడుకులిద్దరికీ ఊహించని ఝలక్ ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగింది?
సిరిసిల్లకు చెందిన అదువాల రాజమల్లుకు ఇద్దరు కొడుకులు. ఒకరు అనిల్‌కుమార్ కాగా, మరొకరు సురేశ్. ఈ ఫ్యామిలీకి రెండేళ్ల కిందట గత ప్రభుత్వం తంగళ్లపల్లి మండలంలో డబుల్ బెడ్రూం ఇంటిని కేటాయించింది. ఇంతవరకు బాగానే సాగింది. ఇక్కడే అసలు కథ మొదలైంది.
కొడుకుల మైండ్‌లో ఏం ఆలోచన వచ్చిందో తెలీదు. ఆ ఇంటిని రాజమల్లు పేరున ఇవ్వాల్సి ఉండగా పెద్ద కొడుకు అనిల్‌కుమార్ తన భార్య పేరిట రాయించుకున్నాడు. చివరకు కన్నతండ్రి ఇంట్లో నుంచి బయటకు గెంత్తేశారు.
ALSO READ: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. తెలంగాణలో యంగ్ ఇండియా స్కూళ్లు, ఇవీ ప్రత్యేకతలు
తొలుత ఈ విషయాన్ని ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లాడు రాజమల్లు. అధికారుల నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో పెద్దాయన రోడ్లపై భిక్షాటన చేసి కడుపు నింపుకునేవాడు. ఈ వ్యవహారంపై అధికారులు అంతర్గతంగా విచారణ చేపట్టారు.
తంగల్లపల్లి ఎమ్మార్వో పూర్తి స్థాయి విచారణ చేసి ఆర్డీవో రమేశ్‌కు నివేదిక ఇచ్చారు. రంగంలోకి దిగిన ఎమ్మార్వో, ఆర్డీఓలు నేరుగా రాజమల్లు ఇంటికి వెళ్లారు. వారం రోజుల్లో ఇంటిని ఖాళీ చేసి తండ్రికి అప్పగించాలని ఆదేశించారు ఆర్డీఓ. అంతేకాదు కొడుకులిద్దరూ ప్రతీ నెల రెండు వేలు చొప్పున చెల్లించాలన్నది ప్రధాన పాయింట్.
డబుల్ బెడ్రూమ్ ఇంటిని రాజమల్లు పేరున మార్చాలని తహసీల్దారు ఆదేశించారు. కొడుకు అనిల్ కుమార్‌కు నోటీసులు ఇచ్చారు. తనకు పూర్తి స్థాయిలో న్యాయం చేసిన అధికారులకు రాజమల్లు కృతజ్ఞతలు తెలిపారు. తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆర్డీవో రమేష్ అన్నారు.