IMD Alerts: దక్షిణ భారతదేశానికి రుతుపవనాలు ముందే విజృంభించనున్నాయి. నేటి నుంచే కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వర్షాల తుఫాన్ తాకుతోందని ఐఎండీ అంటోంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు దంచికొట్టే సూచనలు వాతావరణ శాఖ తెలియజేసింది. ఇక గోవా, కోస్తా కర్ణాటక, రాయలసీమ, పుదుచ్చేరి మీదుగా మబ్బులు కమ్ముకొని దిగిరానున్నాయి. అసలు ఏయే తేదీలలో వర్షాల జోరు సాగుతుందో తెలుసుకుందాం.
గత కొన్ని రోజులుగా ఎండలకు ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. వానలు కొంత ఊరటనిస్తుండగా, కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇవే వర్షాలు ముప్పుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. దేశంలోని దక్షిణ ద్వీపకల్ప రాష్ట్రాల్లో రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని భారత వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది. జూన్ 12 నుండి 15 తేదీల వరకు కర్ణాటకలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, జూన్ 13 నుంచి 15 వరకు గోవా, కొంకణ్ తీరాల్లో కూడా వరద ముప్పు సూచనలున్నాయి.
కర్ణాటకపై ఇంకాస్త ఎక్కువగా..
కర్ణాటకలో జూన్ 9 నుండి 13 వరకు రుతుపవన ప్రభావం అధికంగా ఉంటుందని హెచ్చరికలు వెలువడ్డాయి. ప్రత్యేకించి తీరప్రాంత కర్ణాటక, ఉత్తర మరియు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటకల్లో జూన్ 11 నుండి 15 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా. గంటకు 50 కి.మీ వేగంతో ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో గంటకు 70 కి.మీ వేగంతో కూడా గాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, తెలంగాణలలో.. హై అలర్ట్
జూన్ 9 -13 మధ్య తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం చెబుతోంది. కొన్ని చోట్ల మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరికలు జారీ చేశారు. జూన్ 10 నుండి 13 మధ్య రాయలసీమలోనూ, అలాగే జూన్ 12న తెలంగాణలో కూడ భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఉరుములు, మెరుపులు, వడగండ్ల వానల ముప్పు కూడా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
కోస్తాంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో మెరుపులు.. వీచే గాలులు అధికం
జూన్ 9 నుండి 12 వరకు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో 50 నుండి 70 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశముందని, తుఫానుతో పోల్చదగ్గ స్థితి తలెత్తే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రత్యేకించి తీరప్రాంత ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సూచిస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలోకి పోకూడదని ఐఎండీ ప్రకటించింది.
ఉత్తర భారతదేశం మాత్రం కాస్త భిన్నం
దక్షిణ భారతదేశం వర్షాలతో తడుస్తుండగా, వాయువ్య భారతదేశం మాత్రం ఎండలకు వణికిపోతోంది. వచ్చే 4 నుండి 5 రోజుల పాటు రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, పశ్చిమ యుపి తదితర రాష్ట్రాల్లో వేడి తీవ్రంగా ఉండనుంది. ఈ ప్రాంతాల్లో హీట్‌వేవ్ పరిస్థితులు నెలకొనబోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల దాటే అవకాశముందని హెచ్చరికలు వెలువడుతున్నాయి.
భారీ వర్షాలకు కేంద్రం నుంచి అలర్ట్
ఈ వరుస వానల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి సహాయ చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించింది. కొన్నిచోట్ల రెడ్ అలర్ట్, మరికొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, గోవా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సూచించారు.
Also Read: Indian Railway Export: ఇది ఇండియన్ రైల్వే సత్తా.. ఆ దేశం రా రమ్మని పాట పాడుతోంది.. ఎందుకంటే?
తేదీల వారీగా.. ఎక్కడ వర్షాలు?
జూన్ 9-13: కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, లక్షద్వీప్‌లలో మోస్తరు వర్షాలు
జూన్ 9-12: కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం – 70 కి.మీ వేగంతో ఈదురుగాలులు
జూన్ 13-15: గోవా, కొంకణ్ – భారీ వర్షాలు
జూన్ 12-15: కేరళ, తమిళనాడు – అతి భారీ వర్షాలు
జూన్ 13: ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక – భారీ వర్ష సూచన
జూన్ 13-15: తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ – అతి భారీ వర్ష సూచన
ఈ నేపథ్యంలో ప్రజలంతా వాతావరణ శాఖ విడుదల చేసే తాజా సూచనలను గమనిస్తూ, అవసరమైతే బయటికి వెళ్లకూడదని అధికారులు కోరుతున్నారు. జాగ్రత్త తీసుకుంటే వర్షం ఆనందంగా ఉంటుందని, లేనిపక్షంలో అది హానికరం కూడా అవుతుందని ఐఎండీ హెచ్చరించింది.