Hyderabad Rains: భాగ్యనగరం హైదరాబాద్‌పై వరుణుడు బీభత్సం సృష్టించాడు. మేఘాలకు చిల్లు పడినట్టుగా కుండపోతను తలపించింది వర్షం. గంటల వ్యవధిలో పలు ప్రాంతాల్లో దాదాపు 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే ఏ స్థాయిలో వర్షం పడిందో అర్థం చేసుకోవచ్చు. ఆ వర్షానికి నగరజీవులు ఉక్కిరి బిక్కిరయ్యారు. ప్రధాన రోడ్లు చెరువులుగా మారిపోయాయి.
మోకాలి లోతు నీళ్లలో కార్లు, టూ వీలర్స్ ముందుకు కదిలించలేక ఇబ్బందులుపడ్డారు. ఇక లోతట్టు ప్రాంతాల గురించి చెప్పనక్కర్లేదు. భారీ వర్షానికి తోడు ఎగువ నుంచి వచ్చిన నీటి తోడుకావడంతో కాలనీలను వరద చుట్టుముట్టింది. పార్క్ చేసిన బైక్‌లు నీట మునిగాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. లోతట్టు ప్రాంతాల ప్రజలు నిద్రలేని రాత్రి గడపాల్సి వచ్చింది.
బుధవారం రాత్రి 8 గంటలకు మొదలైన వర్షం 11 గంటల వరకు కుండపోత వర్షం పడింది. ఇక మియాపూర్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, అమీర్‌పేట్, సనత్‌నగర్, చందానగర్, మాదాపూర్, రాయదుర్గం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోని ప్రధాన రహదారులపై నీరు ప్రవహించింది.
సికింద్రాబాద్ మొదలు అంబర్పేట్, మెహదీపట్నం, ఆసిఫ్ నగర్, నాంపల్లి, రాజేంద్ర నగర్, అల్వాల్, బోయినపల్లి, బేగంపేట్, మల్కాజ్ గిరి, చార్మినార్ ప్రాంతాలు తడిచి ముద్దయ్యాయి. కేవలం మూడు గంటల్లో దాదాపు 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముషీరాబాద్ తాళ్లబస్తీలో అత్యధికంగా 15.05 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.
ALSO READ: పేదరికం నిర్మూలనకు విద్య ఏకైన ఆయుధం-సీఎం రేవంత్
మోండా మోర్కెట్, మారెడ్‌పల్లి, మెట్టుగూడ ప్రాంతాల్లో 13సెంటీ మీటర్లు వర్షం కురిసింది. ఇక భోలక్‌పూర్, హెచ్‌సీయూ, చిలకలగూడ, మియాపూర్ వంటి ప్రాంతాల్లో 12 సెంటీమీటర్లు పైగానే వర్షం కురిసింది. నగరంలోని చాలా ప్రాంతాల్లోకి వరద నీరు భారీగా రావడంతో వాహనాలు సగానికి పైగానే నీటమునిగాయి. సాయంత్రం డ్యూటీ దిగి ఇంటికి వెళ్లేవారు పడిన కష్టాలు అన్నీఇన్నీకావు.
కనీసం రోడ్డు దాటేందుకు ఇబ్బందులు పడ్డారంటే గతరాత్రి ఏ రేంజ్‌లో వర్షం పడిందో అర్థం చేసుకోవచ్చు. ఇక మియాపూర్-చందానగర్ జాతీయ రహదారిపై వరద చేరడంతో కిలోమీటర్ల మేరా వాహనాలు రోట్లపై నిలిచిపోయాయి. ప్రధాన కూడళ్లలో అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ కొనసాగింది. భారీ వర్షం నేపథ్యంలో పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల అల్పపీడనం కారణంగా వర్షాలు పడే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిచింది.
తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డిలలో 40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
గురువారం, శుక్రవారం గంటకు 60 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
నిన్న హైదరాబాద్‌లో భారీ వర్షపాతం నమోదు
మియాపూర్‌లో 9.7, లింగంపల్లిలో 8.2, HCUలో 8.5, గచ్చిబౌలిలో 6.6, చందానగర్‌లో 6.4, హఫీజ్‌పేట్‌లో 5.6, ఫతేనగర్‌లో 4.7 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు
చెరువులను తలపించిన రహదారులు #HyderabadRains https://t.co/cFNZqSCZj7 pic.twitter.com/iYW9f05NTT
— BIG TV Breaking News (@bigtvtelugu) September 18, 2025