Supreme Court: మేము చేస్తే రైట్.. ఎదుటి వారు చేస్తే రాంగ్.. అన్నట్లు వ్యవహరించిన బీఆర్ఎస్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. గులాబీ పార్టీ అధికారంలో ఉన్న రెండు సార్లు.. విలీనం పేరుతో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఆఖరికి ఎంపీలకు కూడా తమ కండువా కప్పేసి, విపక్షాలను నామరూపాయలు లేకుండా చేయడానికి తెగ ప్రయత్నించింది. దాంతో అసెంబ్లీలో వారికి ఎదురు లేకుండా పోయింది. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యే సరికి ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు అనైతికమని, తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడమే అంటూ తెగ హడావుడి చేస్తూ.. న్యాయపోరాటాలకు కూడా దిగింది. తీరా చూస్తే కారు దిగిపోయిన ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం, సుప్రీం కోర్టు సైతం స్పీకర్ డెసిషనే ఫైనల్ అని స్పష్టం చేయడంతో బీఆర్ఎస్ పెద్దలు మింగలేక కక్కలేక సతమతమవుతున్నారంట
తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలందరికీ క్లీన్‌చిట్ ఇస్తూ ఇటీవల స్పీకర్ తుది నిర్ణయం వెలువరించారు. ఈ క్రమంలోనే స్పీకర్ నిర్ణయాన్ని తప్పుపడుతూసుప్రీంకోర్టును ఆశ్రయించిన బీఆర్‌ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని.. ఇక ఈ పిటిషన్‌పై విచారణ జరపాల్సిన అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. దీంతో ఆ ఎమ్మెల్యేలకు భారీ ఊరట లభించింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు విచారణ ముగిసినట్లు ప్రకటించింది. ఈ వ్యవహారంలో అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారని తేల్చి చెప్పింది. ఈ కేసులో స్పీకర్ తరఫున లాయర్ చేసిన వాదనలతో సుప్రీంకోర్టు సంతృప్తి చెందింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై బీఆర్ఎస్ వారిపై అనర్హత వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు, సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ఫిరాయింపుల పిటిషన్లపై విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సుప్రీంకోర్టు గడువు విధించడంతో.. స్పీకర్ తన తుది నిర్ణయాన్ని వెల్లడించారు.
అయితే పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్‌చిట్ ఇవ్వడంతో.. ఆ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. తాజాగా మరోసారి సుప్రీంకోర్టు మెట్లెక్కింది. పార్టీ ఫిరాయించిన తమ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై సుదీర్ఘ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా తుది తీర్పు ఇచ్చింది. సుప్రీంలో ఈ కేసు విచారణ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తరఫున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. పార్టీ ఫిరాయింపులు, ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి ఇప్పటికే దాఖలు చేసిన పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ జరిపారని.. వాటిపై తగిన నిర్ణయం తీసుకుని.. ఎమ్మెల్యేలకు క్లీన్‌చిట్ ఇచ్చిన విషయాన్ని లాయర్ అభిషేక్ మను సింఘ్వీ కోర్టుకు విన్నవించారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను తెలంగాణ స్పీకర్ కార్యాలయం పరిష్కరించినట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో అభిషేక్ మను సింఘ్వీ చేసిన వాదనలతో జస్టిస్ సంజయ్ కరోల్ బెంచ్ ఏకీభవించింది.
Also Read: AP Crime News: కర్నూలులో తీరని విషాదం.. కన్నబిడ్డలతో సహా చెరువులో దూకి తల్లి ఆత్మహత్య
ఈ వ్యవహారంలో ఇప్పటికే స్పీకర్ తుది నిర్ణయం తీసుకుని.. తన తీర్పును వెలువరించినందున.. ఇక ఈ పిటిషన్లపై విచారణ జరపాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ ముగిసినట్లు వెల్లడించింది. అదే సమయంలో తెలంగాణ స్పీకర్ తన తీర్పు కాపీలను.. ఫిర్యాదుదారులకు 2 రోజుల్లో ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. పార్టీ ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి, దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలె యాదయ్య. అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, సంజయ్‌లకు స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు పార్టీ మారారు అనడానికి ఎలాంటి బలమైన ఆధారాలు లేవని, ఇప్పటికీ వారంతా బీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నట్లు స్పీకర్ ప్రకటించారు. స్పీకర్ నిర్ణయంతో ఏకీభవించిన సుప్రీం కోర్టు బీఆర్ఎస్ దాఖలుచేసిన అనర్హత పిటీషన్లను డిస్పోజ్ చేసింది.
ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో కారు పార్టీ ఎటూ కదలలేని స్థితిలో పడిపోయిందంట. పార్టీ ఫిరాయించారని ఆరోపిస్తున్న ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ పరంగా ఫిర్యాదు చేయలేదు. ఆ పార్టీ నేతలు ఎవరికి వారు సదరు ఎమ్మెల్యేలపై విడివిడిగా స్పీకర్‌కు ఫిర్యాదు చేసి, కోర్డుకెక్కారు. అది కూడా గులాబీ పార్టీకి మైనస్ అయిందంటున్నారు. వాస్తవానికి చట్టసభల్లో సభాపతి నిర్ణయమే ఫైనల్. సాధారణంగా స్పీకర్ తీసుకునే నిర్ణయాల్లో కోర్టులు కూడా జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదు. అది తెలియనట్లు గులాబీ నేతలు నానాయాగీ చేసి అభాసుపాలయ్యారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లో విషయంలో స్పీకర్ నిర్ణయం వెలువడ్డాక కూడా .. బీఆర్ఎస్ నేతలు దాన్ని తప్పుపడుతూ తీవ్ర విమర్శలు చేశారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లకు క్లీన్‌చిట్ ఇవ్వడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు.
సోషల్ మీడియా వేదికగా స్పీకర్ నిర్ణయంపై ధ్వజమెత్తిన కేటీఆర్.. ఇది ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక ‘చీకటి రోజు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా రాజ్యాంగ వ్యవస్థలను వాడుకుంటున్నారని ఆరోపించారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. సరైన సమయంలో ప్రజలే వీరికి బుద్ధి చెబుతారు అంటూ కేటీఆర్ తన ట్వీట్‌లో హెచ్చరించారు.మూడో సారి కూడా అధికారం తమదే అని కలలుగన్న బీఆర్ఎస్ గత ఎన్నికల్లో 39 స్థానాలకే పరిమితమై గద్దె దిగాల్సి వచ్చింది. తర్వాత బైపోల్స్‌లో రెండు సిట్టింగ్ స్థానాలు కోల్పోవడంతో పాటు, పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో సాంకేతికంగా బీఆర్ఎస్ బలం 27కి పడిపోయింది. అయితే పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ అనర్హత వేటు భయంతో మున్సిపల్ ఎన్నికల ముందు యూటర్న్ తీసుకుని బీఆర్ఎస్ తోనే ఉంటానని ప్రకటించడంతో.. ఆ పార్టీకి 28 మంది సభ్యులు మిగిలినట్లైంది. అదలా ఉంటే తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలి ఎన్నికల్లో బొటాబొటీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన అప్పటి టీఆర్ఎస్.. ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా లేకుండా అన్ని పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుని అసెంబ్లీలో ఇష్టానుసారం వ్యవహరించిందన్న విమర్శలున్నాయి.
2014లో 12 సీట్లు గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలని, బెదిరించో, బతిమలాడో విలీనం పేరుతో కలిపేసుకుంది. అప్పట్లో వారి ప్రలోభాలకు లొంగని రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎంగా ఆ పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు. ఇక రెండో సారి అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డికి ఏకంగా కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చి, తాను చేసిందే కరెక్ట్ అన్నట్లు వ్యవహరించారు. అప్పుడు బీఆర్ఎస్ శ్రేణులకు నైతిక విలువలు వంటివేమీ గుర్తుకు రాలేదు. అధికారం కోల్పోయి, వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో పరాజయాలు వెక్కిరిస్తుంటే… పార్టీ ఫిరాయింపులు పెద్ద పాపమన్నట్లు గులాబీ నేతలు నీతి సూక్తులు వల్లెవేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదేమైనా స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అని సుప్రీంకోర్టు స్ఫష్టం చేయడంతో .. సదరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడి , ఉపఎన్నికలు వస్తాయని తెగ ప్రచారం చేసుకున్న బీఆర్ఎస్‌కు అన్ని దారులు మూసుకుపోయినట్లైంది. చేసుకున్నోడికి చేసుకున్నంత అంటే ఇదేనేమో?
Story By Apparao, Big Tv
Also Read: Best Phones Under 20K: కేవలం రూ.20,000 లోపు లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు.. ఫీచర్స్, స్పెసిఫికేషన్లు ఇవే