Crime News: ఆటోలో సామాన్లు విక్రయించడం తెలుసు. అలాగే తినుబండారాలు అమ్మకాలు కూడ జరుగుతుంటాయని తెలుసు. ఇక్కడ ఓ ఆటో డ్రైవర్ వినూత్నంగా ఆలోచించాడు. అమ్మకాలలో కూడ ఇదో రకం వెరైటీ అమ్మకానికి శ్రీకారం చుట్టాడు ఈ ఆటో డ్రైవర్. వ్యాపారం చూస్తే మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నప్పటికీ, పోలీసులు మాత్రం అతడిని అరెస్ట్ చేశారు. అసలే ఆటో డ్రైవర్.. పాపం బిజినెస్ చేస్తుంటే పోలీసులు పట్టుకోవడం ఏమిటని ఆశ్చర్యపోయారా.. ఇక అసలు విషయంలోకి వెళితే..
చందాపూర్ కు చెందిన హాఫీజ్ అనే యువకుడు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజూ ఆటోలో ఏదొక వ్యాపారం సాగించేవాడు. ఈ క్రమంలో ఎవరు ఈ ఐడియా ఇచ్చారో కానీ, ఆటోలో ఏకంగా గంజాయి అమ్మకాన్ని ప్రారంభించాడు. ఊరూరూ తిరుగుతూ ఆటోలో వస్త్రాలు, సామాన్లు, తినుబండారాలు విక్రయించినట్లుగానే గంజాయి అమ్మకాలకు తెరలేపాడు.
గుట్టుచప్పుడు కాకుండా రోజూ కొండాపూర్, మియాపూర్, నానక్ రామ్ గూడ, శేర్లింగ పల్లి, ఇతర ప్రాంతాల్లో గంజాయి విక్రయాలను ఆటోలో సాగిస్తున్నాడు. దీనితో జిల్లా టాస్క్ ఫోర్స్ టీమ్ కు సమాచారం అందింది. ఓ యువకుడు ప్రతిరోజూ గంజాయి అమ్మకాలను ఆటోలో కొనసాగిస్తున్నట్లు గుర్తించిన టాస్క్ఫోర్స్ పోలీసులు మాటు వేశారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి, ఆటోను స్వాధీనం చేసుకున్నారు.
ఆటోను తనిఖీ చేయగా గంజాయి నింపిన చిన్న చిన్న ప్యాకెట్లు పోలీసులకు కనిపించాయి. అందులో 700 గ్రాముల గంజాయి పాకెట్లు 800 గ్రాముల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 1.50 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు డిటిఎఫ్ సిఐ ప్రవీణ్ కుమార్ ఎస్సై శ్రీకాంత్ రెడ్డిలు తెలిపారు.
Also Read: Seethaka on BRS: బీఆర్ఎస్ పై మంత్రి సీతక్క ఫైర్.. సుద్దపూస మాటలు మానుకోవాలని హితవు
నిందితుడు నేరం అంగీకరించగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. ఈ దాడులలో కానిస్టేబుల్స్ మల్లేష్, నెహ్రూ, నికుల్ సాయి శంకర్ లు పాల్గొనగా, మొత్తం టీంను డిటిఎఫ్ టీం ని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలా సన్ రెడ్డి, శంషాబాద్ ఎక్సైజ్ సూపర్డెంట్ కృష్ణప్రియ అభినందించారు.