
Telangana BJP news today(Political news in telangana): చంద్రబాబు ఢిల్లీ వెళ్లొచ్చారు. అమిత్‌షా, నడ్డాలతో సుమారు గంట సేపు మంతనాలు జరిపొచ్చారు. త్వరలోనే మళ్లీ వెళ్తారని.. ఈసారి మోదీతో ఫైనల్ టాక్స్ ఉంటాయని అంటున్నారు. వీళ్లు వాళ్లు ఎందుకు కలుస్తున్నారో అందరికీ తెలుసు. కానీ, బయటకు ఏమీ తెలీనట్టు మాట్లాడుతున్నారు. చంద్రబాబు హస్తిన టూర్‌పై ఏపీ నాయకులెవరూ పెద్దగా స్పందించలేదు. వైసీపీ గమ్మునుంది. టీడీపీ లోలోన మురిసిపోతోంది. బీజేపీ సైలెంట్‌గా ఉండిపోయింది. కానీ….
చంద్రబాబు ఢిల్లీ టాక్స్‌కు.. తెలంగాణలో మాత్రం రీసౌండ్ వస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెంటనే స్పందించారు. ఆ ముగ్గురి భేటీ పొత్తుల గురించి కాకపోవచ్చన్నారు. తామెవరితోనూ పొత్తు పెట్టుకోమని.. సింగిల్‌గానే బరిలో దిగుతామని తేల్చి చెప్పారు. మిగతా కమలనాథులు సైతం అదే వాయిస్ గట్టిగా వినిపిస్తున్నారు. ఎందుకు? బీజేపీ నేతలు ఎందుకంతగా ఉలిక్కిపడుతున్నారు? వెంటనే ఎందుకలా రియాక్ట్ అవుతున్నారు? ఏమాత్రం ఆలస్యం చేసినా.. ఫుల్ డ్యామేజ్ అవుతుందని అలర్ట్ అయ్యారా? గత ఎన్నికల సమయంలో జరిగిన పొలిటికల్ డ్రామా గుర్తుకొచ్చిందా?
అది 2018 ఎన్నికల సమయం. అప్పటికే నాలుగున్నరేళ్ల కేసీఆర్ పాలనపై ప్రజావ్యతిరేకత భారీగానే ఉంది. టీఆర్ఎస్ గెలుపు కష్టమేననే టాక్ నడుస్తోంది. గులాబీ బాస్ సైతం టెన్షన్‌గానే కనిపించేవారు. సరిగ్గా అలాంటి సంక్లిష్ట సమయంలో.. అనుకోని అస్త్రం కేసీఆర్ చేతికిచ్చింది ప్రతిపక్ష కాంగ్రెస్. తెలంగాణలో టీడీపీతో కాంగ్రెస్ చేతులు కలిపింది. గద్దరు, కోదండరాం లాంటివాళ్లు సైతం వారికి జతకలిశారు. రాహుల్ గాంధీ, చంద్రబాబు ఒకే వేదికను పంచుకున్నారు. ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న కేసీఆర్.. ఒక్కసారిగా వాయిస్ రెయిజ్ చేసేశారు. పోయి పోయి.. ఆ తెలంగాణ ద్రోహి చంద్రబాబుతో కలుస్తారా? కావాలంటే తామే ఓ పది సీట్లు పడేసేవాళ్లం కదా.. అంటూ ఒక్కసారిగా సెంటిమెంట్ రాజేశారు. చంద్రబాబు భుజాలపై తుపాకీ పెట్టి కాంగ్రెస్‌ను గట్టిగా టార్గెట్ చేశారు. ఆ సెంటిమెంట్ అస్త్రం పని చేసిందని చెబుతారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుగా ఓడి.. టీఆర్ఎస్ గెలవడానికి.. టీడీపీతో పొత్తే ప్రధాన కారణమనే వాదన బలంగా వినబడింది.
ఈసారి చంద్రబాబు బీజేపీకి దగ్గరవుతుండటంతో.. తెలంగాణ కాషాయదళంలో గుబులు రేపుతోంది. పొత్తు ఏపీ వరకే పెట్టుకున్నా.. దాన్ని బూచీగా చూపి.. కేసీఆర్ మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ఎక్కడ రెచ్చగొడుతారోననేది కమలనాథుల ఫికర్‌లా కనిపిస్తోంది. అందుకే, చంద్రబాబుతో తమకేం సంబంధం లేదంటూ.. ఇక్కడి బీజేపీ నేతలు అడగకుండానే ఆన్సర్ చెబుతున్నారు. అక్కడా.. ఇక్కడా.. ఒక్కటి కాదనే మెసేజ్ ఇస్తున్నారని అంటున్నారు.
ఏపీలో టీడీపీ, బీజేపీ పొత్తు దాదాపు కన్ఫామ్! అదే జరిగితే.. చంద్రబాబు ఎఫెక్ట్.. తెలంగాణలో ఏమేరకు ఉంటుందోననేది ఆసక్తికరంగా మారింది. గతంలో అంటే టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీగా ఉండేది కాబట్టి.. టీడీపీతో పొత్తుపై కేసీఆర్ సెంటిమెంట్ రాజేశారు. కానీ.. ఇప్పుడు బీఆర్ఎస్‌తో దేశవ్యాప్తంగా విస్తరించాలని చూస్తున్న గులాబీ బాస్.. గతంలో మాదిరి ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టే పరిస్థితి ఉండదని.. అలా చేస్తే అది ఆయన పార్టీ ఇమేజ్‌కే మైనస్‌గా మారుతుందని అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో!
NBK: బాలయ్యా.. నోరు అదుపులో పెట్టుకోవయ్యా! పిల్లలతో చెప్పించుకోకయ్యా!!