⦿ సమరానికి సై
⦿ నేటి నుంచి సభాపర్వం
⦿ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
⦿ అస్త్రశస్త్రాలతో అధికార, విపక్ష పార్టీలు సిద్ధం
⦿ సభ ముందుకు కీలక బిల్లులు, ఆర్డినెన్సులు!
⦿ సభలో కాంగ్రెస్ ఏడాది పాలన, రైతు భరోసా, రుణమాఫీ, హైడ్రా, మూసీ, లగచర్ల ఘటనలు
⦿ రసవత్తరంగా నడవనున్న సభలు
⦿ కేసీఆర్ ఈసారైనా వచ్చేనా?
హైదరాబాద్, స్వేచ్ఛ: Telangana Assembly sessions: గత సోమవారం ప్రారంభమయ్యి వాయిదా పడిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ (సోమవారం)పునః ప్రారంభం కానున్నాయి. ఉదయం 10.30 గంటల సమయంలో ఉభయ సభలు మొదలుకానున్నాయి. ఈ సమావేశాల ఒకరినొకరు ఇరుకున పెట్టేందుకు అటు అధికార, ఇటు విపక్ష పార్టీలు సన్నద్ధమయ్యాయి. అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. ఈ సమావేశాల్లో రెండు బిల్లులను ప్రభుత్వం సభ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. కొత్త రెవెన్యూ చట్టం ఆర్‌వోఆర్ బిల్లు, పంచాయతీరాజ్ సవరణ బిల్లును తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటివరకు ఇద్దరు పిల్లలు ఉన్న వ్యక్తులకు మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉండేది.
ఆ పరిమితిని ముగ్గురు పిల్లలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ సవరణ బిల్లులో మార్పులు చేయనుంది. ఇక 5 ఆర్డినెన్సులు, 2 వార్షిక నివేదికలు కూడా సభ ముందు రానున్నాయి. తెలంగాణ జీతాలు, పింఛన్ల చెల్లింపు, అనర్హతల తొలగింపు (సవరణ) ఆర్డినెన్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (సవరణ) ఆర్డినెన్సు 2024, హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (సవరణ) ఆర్డినెన్సు 2024, తెలంగాణ వస్తువుల, సేవల పన్ను (సవరణ) ఆర్డినెన్సు 2024 ఆర్డినెన్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రశపెట్టనున్నట్టు సమాచారం. విద్యుత్, అటవీ శాఖలకు సంబంధించిన సంస్థల నివేదికలను సంబంధిత మంత్రులు ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు.
రసవత్తర చర్చలు గ్యారంటీ
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన తర్వాత జరుగుతున్న సమావేశాలు కావడంతో సభలు వాడివేడిగా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. పలు పథకాల అమలును బీఆర్ఎస్ ప్రశ్నించే అవకాశం ఉంది. ఏడాది కాలంలో అమలు చేసిన కార్యక్రమాలను ప్రభుత్వం వెల్లడించే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా రైతు రుణమాఫీ వివరాలు సభకు తెలియజేయనుంది. ఇక తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ విషయంలో బీఆర్ఎస్ వైఖరిని ప్రభుత్వం ఎండగట్టే అవకాశం ఉంది. ఈ మేరకు హస్తం పార్టీ వ్యూహాలు సిద్ధం చేసుకుంది. కాంగ్రెస్ ఏడాది పాలన, రైతు భరోసా, రుణమాఫీ, హైడ్రా, మూసీ ప్రక్షాళన, గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు, లగచర్ల దాడి ఘటనలపై సభలో రసవత్తర చర్చ జరిగే ఛాన్స్ ఉంది.
ఈసారైనా కేసీఆర్ వస్తారా?
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈసారైనా అసెంబ్లీ రాస్తారా.. రారా.. అనేది ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ సమావేశాలకు హాజరయ్యి సభా మర్యాద కాపాడాలని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఒకవేళ కేసీఆర్ హాజరైతే ఆయన ఏం మాట్లాడుతారు, ప్రభుత్వ పెద్దలు ఏవిధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కాగా, అధికారం నుంచి దిగిపోయాక కేసీఆర్ ఒక్కసారి మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో హాజరయ్యి కొద్దిసేపటికే వెళ్లిపోయారు.
Also Read: Venu Swamy prediction: జైలుకు వెళ్తే చాలు.. సీఎం అవుతారట.. మీరూ ట్రై చేస్తున్నారా!
డుమ్మా కొట్టిన ఎమ్మెల్యేలపై నిలదీత
ఇటీవల ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ వేదికగా రెండు రోజులపాటు జరిగిన ఎమ్మెల్యేల శిక్షణా తరగతులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. అసెంబ్లీ శిక్షణా తరగతులను డుమ్మా కొట్టిన విధానంపై బీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సీరియస్‌గా ఉన్నారని తెలుస్తోంది. కాగా రెండు రోజుల శిక్షణాతరగతుల్లో సభా మర్యాదలు, విధివిధానాలపై అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్ కలిసి చట్టసభ్యులకు అవగాహన కల్పించారు. ఈ ఓరియెంటేషన్ సెషన్‌లో కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం ల్యేలు మాత్రమే పాల్గొన్నారు.