Assistant Professor Recruitment: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని 12 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్(డైరెక్ట్ రిక్రూట్మెంట్) పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో జారీ చేసిన ఏకీకృత నియామక మార్గదర్శకాలను సవరిస్తూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా మంగళవారం సవరిస్తూ నూతన మార్గదర్శకాలను జారీ చేశారు. ఉన్నత విద్యామండలి సమర్పించిన ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సుల మేరకు గతంలో ఉన్న జీవో నిబంధనల్లో ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. సవరించిన నిబంధనల ప్రకారం, ఇకపై అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన మరియు షార్ట్‌లిస్ట్ ప్రక్రియను తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ప్రత్యేక స్క్రుటినీ కమిటీ నిర్వహించనుంది. గతంలో ఈ బాధ్యతను ఆయా విశ్వవిద్యాలయాల అంతర్గత స్క్రీనింగ్ పద్ధతికి వదిలివేయగా, ఇప్పుడు పారదర్శకత కోసం ఉన్నత విద్యామండలి పర్యవేక్షణలోకి తీసుకువచ్చారు. ఈ కమిటీలో వైస్-ఛాన్సలర్ నామినీ, ఉన్నత విద్యామండలి నామినేట్ చేసే సబ్జెక్ట్ నిపుణుడు, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్పర్సన్, కన్వీనర్‌గా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సభ్యులుగా ఉంటారు.
మార్కుల వెయిటేజీ విధానం ఇలా..
యూజీసీ, ఏఐసీటీఈ వంటి జాతీయ నియంత్రణ సంస్థల నిబంధనల ప్రకారం అభ్యర్థుల అర్హతలను నిర్ధారిస్తారు. అకడమిక్ అండ్ రీసెర్చ్ రికార్డ్(పార్ట్ ఏ)కు గరిష్టంగా 50 మార్కుల వెయిటేజీ కేటాయించారు. అభ్యర్థుల డిగ్రీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్డీ మార్కులు, నెట్/సెట్ అర్హతలు, రీసెర్చ్ పబ్లికేషన్స్, బోధనా అనుభవం ఆధారంగా యూజీసీ 2018 నిబంధనల ప్రకారం ఈ 50 మార్కులను లెక్కిస్తారు. ఇకపోతే డొమైన్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ స్కిల్స్(పార్ట్-బీ)కి గరిష్టంగా 30 మార్కులు కేటాయించారు. ఇందులో భాగంగా డెమో ద్వారా బోధనా నైపుణ్యాలకు 10 మార్కులు, సబ్జెక్ట్ నాలెడ్జ్/ఇన్వైటెడ్ లెక్చర్లకు 10 మార్కులు, రీసెర్చ్ ఆప్టిట్యూడ్‌కు 5 మార్కులు, పుస్తకాల ప్రచురణకు 5 మార్కులు కేటాయించారు.
ఇంజినీరింగ్, టెక్నికల్ కోర్సులకు ప్రత్యేక విధానం
నెట్/సెట్ వంటి పరీక్షలు లేని టెక్నికల్, ఇంజినీరింగ్ లేదా ఇతర ప్రత్యేక సబ్జెక్టుల అభ్యర్థుల కోసం స్కోరింగ్ విధానాన్ని సులభతరం చేశారు. అభ్యర్థుల మిగిలిన అర్హతలను 93 మార్కులకు లెక్కగట్టి, ఆ మొత్తాన్ని 100 మార్కుల స్కేల్‌కు విస్తరిస్తారు. ఆ తర్వాత దానిని 50 మార్కుల వెయిటేజీకి కుదించి షార్ట్‌లిస్ట్ ప్రక్రియ పూర్తి చేస్తారు. ఇంటర్వ్యూలకు ఎంతమంది అభ్యర్థులను పిలవాలనే తుది నిర్ణయాన్ని ఆయా విశ్వవిద్యాలయాలకే వదిలివేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సవరించిన నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, రిజిస్ట్రార్లను ఉన్నత విద్యాశాఖ ఆదేశించింది.
Also Read: విద్యార్థులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. రూ.204 కోట్లు విడుదల!