Telangana BJP: స్వేచ్చ బ్యూరో: తెలంగాణ బీజేపీలో అంతర్గత పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పార్టీ ఆఫీస్ బేరర్ల పనితీరుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అసంతృప్తి వ్యక్తంచేసినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో ఎవరెవరు ఏం చేస్తున్నారు? ఎవరి వైఖరి ఎలా ఉంది? అనే విషయాలపై అధిష్ఠానం వద్ద పూర్తి చిట్టా ఉందని ఆయన నేరుగానే హెచ్చరించినట్లు సమాచారం. పనితీరు మార్చుకోని పక్షంలో పదవుల నుంచి తప్పుకోవాల్సి వస్తుందని నితిన్ నబీన్ గట్టి సంకేతాలు పంపినట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
పదవులు వచ్చే వరకు ఒకలా.. వచ్చిన తర్వాత మరోలా వ్యవహరిస్తున్న కొందరు నేతల తీరుపై నితిన్ నబీన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బాధ్యతలు దక్కిన తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతాన్ని విస్మరిస్తున్న నేతల జాబితా ఇప్పటికే సిద్ధమైందని సమాచారం. ఇదిలాఉండగా నేతలు ఆఫీస్ లో ప్రెస్ మీట్లకే పరిమితం కావద్దని, ప్రజా సమస్యలను గుర్తించి క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ప్రజలు బీజేపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని, తెలంగాణలో బీజేపీకి అధికారంలోకి వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయని, ఆ అవకాశాన్ని పూర్తిస్థాయిలో వినియగించుకోవాలని సూచనలు చేసినట్లు వినికిడి.
ఇప్పటికైనా నియోజకవర్గాల్లో పట్టు పెంచుకోకుంటే కఠిన చర్యలు తప్పవని, బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తే పదవులను వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. పార్టీలో సొంత అజెండాలు నడుపుతూ, గ్రూపు రాజకీయాలకు తెరలేపుతున్న నేతలపై నితిన్ నబీన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడినట్లు సమాచారం. గ్రూపు రాజకీయాలను ఏమాత్రం సహించే ప్రసక్తే లేదని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత విభేదాలు పక్కనబెట్టి ఉమ్మడిగా పనిచేయాల్సిందేనని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని హెచ్చరించినట్లు సమాచారం. గడిచిన ఆరు నెలల కాలంలో ఏ నాయకుడు ఎంతవరకు ప్రజల్లో ఉన్నారు? పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను ఏ మేరకు విజయవంతం చేశారు? అనే అంశాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు స్వయంగా నివేదిక కోరినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఆరు నెలల పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఆధారంగానే భవిష్యత్తులో నేతల పదవుల కొనసాగింపుపై కీలక నిర్ణయాలు ఉంటాయని నితిన్ నబీన్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
Also Read: Farm Pond: మేకను కాపాడబోయి.. నీటిలో పడి మహిళ మృతి!
అధిష్ఠానం వద్ద అందరి జాతకాలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించడం ప్రస్తుతం రాష్ట్ర బీజేపీలో తీవ్ర కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని ముఖ్య నేతలు, ఆఫీస్ బేరర్లు క్షేత్రస్థాయిలో ఏం చేస్తున్నారనే అంశంపై అధిష్టానం ఇప్పటికే ఒక నివేదికను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎవరెవరు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు, ఎవరెవరు అంటీముట్టనట్లు ఉంటున్నారనే పూర్తి చిట్టా హైకమాండ్ వద్ద ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ నేతల గత 6 నెలల పనితీరుపై ప్రత్యేక నివేదిక కోరినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నివేదిక ఆధారంగానే రాబోయే రోజుల్లో రాష్ట్ర కమిటీలో మార్పులు చేర్పులు ఉంటాయని, అంటీముట్టనట్లుగా ఉన్నవారిపై వేటు తప్పకపోవచ్చని పార్టీ శ్రేణుల్లో బలంగా చర్చ జరుగుతోంది.
పార్టీ అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించని వారిని పదవుల నుంచి తప్పించే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. పనితీరు మార్చుకోని పక్షంలో, స్వచ్ఛందంగా పదవుల నుంచి తప్పుకోవాలని, లేదంటే అధిష్టానమే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందనే సంకేతాలు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీలో అంతర్గత విభేదాలు, గ్రూపు రాజకీయాలను ఏమాత్రం సహించేది లేదని, గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మరి నితిన్ నబీన్ దిశానిర్దేశాన్ని టీబీజేపీ తూచ తప్పకుండా పాటించి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషిచేస్తారా? లేదా? అనేది చూడాలి.