CM Revanth Reddy: న్యూఢిల్లీలో ఇవాళ ఏఐసీసీ కార్యాలయం ప్రారంభమైన విషయం తెలిసిందే. కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం సీఎం విలేకర్లతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి 140 ఏళ్ల చరిత్ర ఉందని.. పార్టీ ఎలాంటి స్వార్థం లేకుండా దేశం కోసం పని చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గొప్ప చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ దళితులు, గిరిజనులు, మైనార్టీల సంక్షేమంతో పాటు అభివృద్ధి కోసం పాటు పడిందని గుర్తు చేశారు.
140 ఏళ్లు దేశాన్ని నడిపిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సొంత కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుందని అన్నారు. నిన్నగాక మొన్న వచ్చిన ప్రాంతీయ పార్టీలతో పాటు బీజేపీ సైతం పార్టీ కార్యాలయాలు నిర్మించుకున్నాయని అన్నారు. బీజేపీ అర్థిక స్థితి, నిన్న మొన్న వచ్చిన ప్రాంతీయ పార్టీల ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో.. కాంగ్రెస్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చూడండి అని అన్నారు. దేశ భవిష్యత్తు కోసం ఇకపై ఈ కార్యాలయం నుంచి ప్రణాళికలు రచించబోతున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో పేద ప్రజలందరికీ ఇక్కడి నుంచే దిశా నిర్దేశం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read: Medak district: మెదక్ జిల్లాలో తల్వార్లతో యువకుల హల్చల్..
ప్రపంచంలోనే మేటి దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా విధి విధానాలు రూపొందిస్తామని అన్నారు. ఇవాళ దేశ ప్రజలకు పండగ రోజు అని.. దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ అని.. ఈ రోజు అద్భుతమైన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుందని అన్నారు. దేశ ప్రయోజనానికి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఒక వేదిక కాబోతుందని అన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి అపాయింట్ మెంట్ కోరినట్లు చెప్పారు. అపాయింట్ మెంట్ ఖరారు కాగానే వారిని కలవనున్నట్లు చెప్పుకొచ్చారు. తెలంగాణకు సంబంధించిన విషయాలపై చర్చించనున్నామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.