Telangana Railway Routes: తెలంగాణలో కొత్త రైల్వే మార్గాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ను కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. అందులో భాగంగా రైల్వే మంత్రిని కలిసి రాష్ట్రంలో రైల్వే నెట్ వర్క్ విస్తరణ గురించి కీలక విషయాలు చర్చించారు. కాజీపేటలో ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని నెలకొల్పాలని కోరారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అనేది తెలంగాణ ప్రజల చిరకాల కోరిక అన్నారు. దాన్ని సాకారం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు. కాజీపేటలో పీరియాడిక్ ఓవర్ హాల్ వర్క్ షాప్ (పీఓహెచ్) ఏర్పాటు చేస్తామని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించిందని, కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని కోరుతూ తాను లేఖ రాశానని గుర్తు చేశారు.
రాష్ట్రంలో కొత్త రైల్వే మార్గాలను నిర్మించాలని విజ్ఞప్తి
అటు తెలంగాణలో కొత్త రైల్వే మార్గాలను నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి, రైల్వేమంత్రిని కోరారు. వికారాబాద్-కృష్ణా స్టేషన్ల మధ్య రైల్వేశాఖ పూర్తి నిధులతో కొత్త రైల్వే మార్గాన్ని నిర్మించాలని రిక్వెస్ట్ చేశారు. ఈ కొత్త రైలు కారిడార్ రెండు ప్రాంతాలకు ప్రయోజనం చేకూర్చుతుందన్నారు. ఇరు ప్రాంతాల నడుమ సుమారు 70 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుందన్నారు. ఈ మార్గాన్ని అభివృద్ధి చేయడం వల్ల దక్షిణ తెలంగాణలో, ముఖ్యంగా అభివృద్ధి చెందని పరిగి, కొడంగల్, ఇతర పరిసర ప్రాంతాలలో సిమెంట్ క్లస్టర్లు సహా ఇతర పారిశ్రమలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.
అటు కల్వకుర్తి-మాచర్ల మధ్య కొత్త రైల్వే మార్గానికి ఆమోదం తెలపాలని రేవంత్ రెడ్డి, అశ్వినీ వైష్ణవ్ ను కోరారు. వంగూరు, కందుకూరు, దేవరకొండ, చలుకుర్తి, తిరుమలగిరి మీదుగా కల్వకుర్తి నుంచి మాచర్లకు అనుసంధానం చేసే ప్రతిపాదిత మార్గం ప్రస్తుతం ఉన్న మాచర్ల మార్గాలతో అనుసంధానమై కనెక్టివిటీ మెరుగుపడుతుంది. మరోవైపు డోర్నకల్-మిర్యాలగూడ (పాపతపల్లి-జాన్ పహాడ్), డోర్నకల్-గద్వాల్ మధ్య ప్రతిపాదిత రైల్వే మార్గాలను సమీక్షించాలని కోరారు. ఈ రెండు ప్రతిపాదిత మార్గాల అలైన్‌మెంట్‌ను పునరాలోచించాని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ పై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. సంబంధిత అధికారులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
మూడు రోజుల పాటు కొనసాగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి చర్చించారు. పలు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరారు. ముఖ్యమంత్రి వెంట ఎంపీలు అనిల్ కుమార్, మల్లు రవి, సురేష్ షెట్కూర్, పోరిక్ బలరాం నాయక్, చామ కిరణ్ కుమార్ రెడ్డి, గడ్డం వంశీ, కడియం కావ్య, రామసహాయం రఘురామిరెడ్డి, కుందూరు రఘవీర్, ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్, మాజీ ఎంపీ హన్మంతరావు ఉన్నారు.
Read Also: ఇండియన్ రైల్వేలో హిస్టారికల్ మైల్ స్టోన్.. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా లింక్ చివరి ట్రాక్ కంప్లీట్!