Disciplinary Committee: గాంధీ భవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ క్రమ శిక్షణ కమిటీ మొదటి సమావేశం జరిగింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి ఆదేశాలతో కమిటీ భేటీ అయింది. కమిటీ ముందుకు వచ్చిన సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. సమస్యలన్నీ ఒకటే అంశంతో ముడిపడి లేవనే అభిప్రాయానికి వచ్చిన కమిటీ ప్రతి సమస్యను ప్రత్యేకమైన అంశంగా పరిగణించాలని .. పార్టీ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలను తీసుకోవాలని భావిస్తోందంట. తనపై వచ్చిన ఫిర్యాదుతో సహా అన్ని ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తామని కమిటీ చైర్మన్ మల్లు రవి క్లారిటీ ఇస్తున్నారు.
స్పీడ్ పెంచిన కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి
తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దింగింది. కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీల ప్రకటన తర్వాత పనిలో స్పీడ్ పెంచారు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి. కమిటి చైర్మన్ మల్లురవి అధ్యక్షతన ఇప్పటికి రెండుసార్లు భేటీ అయింది. పార్టీ నేతల నుంచి వచ్చిన ఫిర్యాదులపై కమిటీ ఫోకస్ చేసింది. తాజాగా జరిగిన సమావేశంలో ప్రస్తుతం పార్టీలో ఉన్న పలు ఫిర్యాదులపై దాదాపు నాలుగు గంటల పాటు చర్చించారు. ఏ సమస్యను ఎలా పరిష్కరించాలో అనే అంశంపై పలు విధివిధానాలు రూపొందించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం కమిటి ముందు పలు కీలకమైన నియోజకవర్గాల ఫిర్యాదులు ఉన్నట్లు తెలుస్తోంది.
పార్టీలో పెద్ద చర్చకు దారితీసిన కొండా మురళి వ్యాఖ్యలు
కమిటీకి వచ్చిన ఫిర్యాదుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నేతల మధ్య జరిగిన వివాదాలపైనే ప్రధానంగా చర్చ జరిగిందంట. కమిటీ కూడా తొలి ప్రాధాన్యతగా ఉమ్మడి వరంగల్ అంశాన్ని తీసుకుందంటున్నారు. ఇటీవల వరంగల్‌కు చెందిన ఎమ్మెల్యేలపై కొండా మురళీ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో పెద్ద చర్చకు దారి తీశాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా దంపతులకు వ్యతిరేకంగా పలువురు ఎమ్మెల్యేలు ఇంచార్జ్ మీనాక్షి నటనాజన్‌తో పాటు అధిష్టానానికి, క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేసారు. మరోవైపు అక్కడి ఎమ్మెల్యేలపై సైతం కొండా ఫ్యామిలీ ఫిర్యాదు చేసింది. ఈ వివాదంలో మంత్రి, ఎమ్మెల్యేలు ఉన్న నేపధ్యంలో ఈ అంశాన్ని సున్నితంగా పరిష్కరించాలని కమిటీ భావిస్తోందట.
ఖైరతాబాద్‌లో విజయారెడ్డి, దానం నాగేందర్‌ల ఆధిపత్య పోరు
ఖైరతాబాద్ నియోజకవర్గంలో కూడా గ్రూప్ రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. ఇటీవల జరిగిన ఒక సమావేశంలో నియోజకవర్గ కాంగ్రెస్ నేత విజయారెడ్డి, పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్ మధ్య ఆధిపత్య పొరు కమిటీ దృష్టికి వచ్చింది. ఇక ఆసిఫాబాద్ కాంగ్రెస్ నేత రావి శ్రీనివాస్ పై సైతం ఒక ఫిర్యాదు అందినట్లు సమాచారం. మంత్రి సీతక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జీ మంత్రిగా ఉన్నప్పుడు శ్రీనివాస్ మంత్రి సీతక్కపై పలు అవినీతి ఆరోపణలు చేశారు. దీనిపై మంత్రి సీతక్క తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాను ఉమ్మడి ఆదిలాబాద్ ఇంచార్జీ మంత్రిగా ఉండలేనని తన బాధ్యతలను వేరే జిల్లాకు మార్చాల్సిందిగా ఇంచార్జీ మీనాక్షీ నటరాజన్ కు వివరించారు.
ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు మల్లు రవి నిర్ణయం
ఈ మూడు అంశాలపై ఏం చేయాలనే అంశంపై 28వ తేదీన జరగనున్న సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని కమిటీ చైర్మన్ మల్లు రవి చెప్పారు ఒక్కో సమస్యపై ఒక్కో ఎమ్మెల్యేతో పాటు ఒక పార్టీ నేతను సభ్యుడిగా వేసి ఆ కమిటీని ఆయా ప్రాంతాలకు పంపి రిపోర్ట్ తెప్పించుకోవాలనే ఆలోచనలో క్రమశిక్షణ కమిటీ ఉన్నట్టు సమాచారం. వచ్చిన రిపోర్ట్ ఆధారంగా పార్టీ ఇంట్రెస్ట్ ను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించారో వారిపై చర్యలు తీసుకోవాలని క్రమ శిక్షణ కమిటీ నిర్ణయించింది. ఇక పార్టీ ఆఫీసులో నిరసనలు తెలియచేస్తే స్ట్రిక్ట్‌గా ఉండాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది. పార్టీ ఆఫీసులో ఎవరికి నచ్చిన రీతిలో వారు నిరసనలు చేస్తామంటే చర్యలు తప్పవని క్రమశిక్షణ కమిటీ సభ్యులు హెచ్చరిస్తున్నారు.
Also Read: కవిత ఎవరు? బీసీనా? ఇంకోసారి ఆ పేరు ఎత్తకుండా..
నెలకొన్న విభేదాలపైనా చర్చించే ఛాన్స్
గాంధీ భవన్లో ఒకవైపు క్రమశిక్షణ కమిటీ సమావేశం జరుగుతుండగానే మలక్ పేట నియోజకవర్గ నేతలు ఒకరిపై ఒకరు బాహాబాహీకి దిగారు. మలక్ పేట నియోజకవర్గంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన అక్బర్, హైదరాబాద్ ఎంపీగా పోటీ చేసిన సమీర్ ఉల్లా ఖాన్ అనుచరులు రెండు వర్గాలుగా విడిపోయి విమర్శలు చేసుకున్నారు. వీరిద్దరూ హైదరాబాద్ డీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో పార్టీ నాయకులకు స్వేచ్ఛను ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏ లో ఉందని దాన్ని నిరుపయోగం చేయకుండా ఉండాలని క్రమశిక్షణ కమిటీ పార్టీ నేతలకు సూచిస్తోంది.