MLA Support: స్వేచ్ఛ బ్యూరో: కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్ధుల్లో కాస్త టెన్షన్ నెల కొన్నది. రెండు ఎమ్మెల్సీ సెగ్మెంట్ల పరిధిలోని ఎమ్మెల్యేలు తమకు సహకరిస్తారా? లేదా? అని ఆయా అభ్యర్ధులు మదన పడుతున్నారు. పార్టీ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, ఎమ్మెల్సీ క్యాండిడేట్ లలో ని అనుమానం మాత్రం తగ్గడం లేదు.ఇందుకు పార్టీలోని అంతర్గత సమీకరణాలే కారణంగా తెలుస్తున్నది. గ్రాడ్యుయేట్ స్థానాలను కైవసం చేసుకోవాలని అధిష్టానం దిశానిర్దేశం చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నట్లు అభ్యర్ధులు ఇప్పటికే గుర్తించారు. దీంతో ఆయా అభ్యర్ధులకు టిక్కెట్ తెచ్చుకోవడం ఒక ఎత్తైతే, విజయం సాధించడం మరో సవాల్ గా మారింది. ప్రస్తుత పరిస్థితులు, రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల అభ్యర్ధులను బేరీజు వేసుకుంటూ కాంగ్రెస్ క్యాండియేట్ లు గెలుపు కొరకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
సమస్య ఇదేనా..?
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు రెండున్నర ఏళ్లు దాటిపోయింది. కానీ ఇప్పటికీ మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం కుదరడం లేదని పార్టీలోని ముఖ్య నాయకులే చెబుతున్నారు. తమ నియోజకవర్గాల అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులో తీవ్ర అలసత్వం వహిస్తున్నారని మెజార్టీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అంతేగాక కీలక పదవుల భర్తీ, నామినేటెడ్ పోస్టుల కేటాయింపుల్లో తమకు కనీస సమాచారం ఇవ్వకుండా మంత్రులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అధికార పార్టీకి చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నారు.ఈ నేపథ్యంలో తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు కాకపోవడం, మంత్రుల వద్ద తమకు ప్రాధాన్యం దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో సంపూర్ణంగా సహకరిస్తారా? అనే డౌట్ మాత్రం అభ్యర్ధుల్లో ఉన్నది. ఇప్పటికే ఓట్ల నమోదు, ప్రచారంలో కొంత మంది ఎమ్మెల్యేలు మొహం చాటేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలవాలంటే నియోజకవర్గాల వారీగా ఓటర్ల నమోదు నుంచి ప్రచారం వరకు ఎమ్మెల్యేల భాగస్వామ్యం అత్యంత కీలకం. కానీ, మంత్రులపై ఉన్న అసంతృప్తిని ఎమ్మెల్యేలు ఈ ఎన్నికలపై చూపిస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
పీసీసీకి ఫిర్యాదు..
ఖమ్మం, వరంగల్, నల్లగొండ.. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ ..ఈ రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎమ్మెల్యేలతో వేర్వేరుగా ఓ మీటింగ్ ఏర్పాటు చేయాలని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్ధులు పార్టీని కోరారు. సమన్వయం, సహకారం వంటి అంశాలపై పార్టీ నుంచి స్పష్టమైన ఆదేశాలు, సూచనలు ఇవ్వాలని అభ్యర్ధులు కోరుతున్నారు. లేకుంటే మంత్రులపై ఉన్న కోపాన్ని ఎమ్మెల్యేలు తమ ఎన్నికలపై ప్రభావం చూపిస్తారని భావిస్తున్నారు. కొంత మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే గ్రాడ్యుయేట్ సమీక్షలకు ముఖ్య నాయకులను దూరం చేస్తున్నట్లు కూడా టాక్. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పార్టీ ఇమేజ్ బాగున్నప్పటికీ… క్షేత్రస్థాయిలో నేతల మధ్య సమన్వయ లోపం ప్రత్యర్థి పార్టీలకు కలసివచ్చే అవకాశముందని ఎమ్మెల్సీ అభ్యర్ధులు పార్టీ దృష్టికి తీసుకువచ్చారు.
Also Read: వైసీపీకి ఆ సత్తా లేదు.. అందుకే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు! – మంత్రి రాంప్రసాద్‌రెడ్డి