DSP Bhimreddy: అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ. వందల కోట్ల ఆస్తులు పోగేసుకుని ఏసీబీకి పట్టుబడ్డ డీఎస్పీ భీంరెడ్డి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. లంచం రూపంలో ఆయన తీసుకున్నట్టుగా భావిస్తున్న రెండు ఇన్నోవా కార్లు, ఇండ్లు, వ్యవసాయ భూములను తాత్కాలికంగా అటాచ్ చేస్తూ ఆదాయపు పన్ను శాఖలోని బినామీ ఆస్తుల నిరోధక విభాగం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జప్తు చేసిన వాటిలో పటాన్‌చెరు ముత్తంగిలో రెండు ఇండ్లు, మొగుడంపల్లిలో 3.20 ఎకరాల విస్తీర్ణంలో నాలుగు వ్యవసాయ భూములు, ఇన్నోవా క్రిస్టా కారు ఉన్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం వీటి విలువ 59.4 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రైవేట్ మార్కెట్ రేటు ప్రకారం చూస్తే కోట్లల్లో ఉంటుందన్నారు.
ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు ప్రకారం.. జీపీఆర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ 2023 జూలైలో ముత్తంగిలోని బృందావన్ గార్డెన్స్ లో రెండు ఇండ్లను భీంరెడ్డి చేసిన సహాయానికి ప్రతిగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇంద్రకరణ్ రెడ్డి పేరుతో రిజిష్టర్ చేసింది. ఒక్కో ఇల్లు 200 చదరపు గజాల విస్తీర్ణంలో ఉండగా.. రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఒక్కోదాని విలువ 14.2 లక్షలుగా పేర్కొన్నారు. పటాన్‌చెరు సబ్ డివిజనల్ పోలీసు అధికారిగా పనిచేసిన సమయంలో భీంరెడ్డి చేసిన మేలుకు ప్రతిఫలంగానే ఈ ఇళ్లు ఇచ్చారని ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది. సంస్థకు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేయకపోవడం, సంస్థకు సంబంధించిన వివాదాల పరిష్కారంలో సహకరించడం వంటి పనులను భీంరెడ్డి చేసినట్టుగా అధికారులు పేర్కొన్నారు.
Also Read: PNR అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? దానిలోని అంకెలు దేనికి సంకేతం?
మరోవైపు జీపీఆర్ హౌసింగ్ డైరెక్టర్ కల్యాణ్ బాబు ఇచ్చిన వాంగ్మూలాన్ని సైతం ఐటీ శాఖ అధికారులు కేసులో ప్రస్తావించారు. భీంరెడ్డి సూచన మేరకే ఆస్తుల రిజిస్ట్రేషన్ కు తన పేరును ఉపయోగించుకునేందుకు అంగీకరించినట్టు ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించాడని తెలిపారు. అటు మొగుడంపల్లిలోని నాలుగు వ్యవసాయ భూములను హోంగార్డు లక్ష్మణ్ నాయక్ పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. వీటి విలువను పత్రాల్లో 8.9 లక్షలుగా పేర్కొన్నారు. అయితే ఈ భూముల అసలు లబ్ధిదారుల్లో భీంరెడ్డి ఒకరని ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది. యాపిల్ ఎంటర్ ప్రైజెస్ యజమాని ఆలూరి సురేష్ ప్రమాదాలకు సంబంధించిన వివాదాల్లో సహకరించినందుకు ప్రతిఫలంగా భీంరెడ్డికి ఇన్నోవా క్రిస్టా కారు ఇచ్చినట్టుగా విచారణలో వెల్లడైందని అధికారులు తెలిపారు.
Also Read: రైలులో విమానం రూల్.. ఈ తప్పు అస్సలు చేయెుద్దు.. లేదంటే టికెట్ ఉన్నా 6 రెట్లు ఫైన్ కట్టాల్సిందే!