E-Paper
Advertisement

Education Budget: రాష్ట్ర బడ్జెట్‌లో విద్యాశాఖకు రూ.26,674 కోట్లు.. గత సంవత్సరం కంటే..?

Education Budget: రాష్ట్ర బడ్జెట్‌లో విద్యాశాఖకు రూ.26,674 కోట్లు.. గత సంవత్సరం కంటే..?

Education Budget: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ప్రగతి పద్దు కింద రూ.26,674 కోట్లు ప్రతిపాదించింది. గతేడాది కంటే ఈసారి రూ.3,566 కోట్లు అదనంగా పెంచింది. ఇది మొత్తం బడ్జెట్ లో 8.2 శాతంగా ఉంది. గతేడాది విద్యారంగానికి 7.57 శాతం కేటాయింపులు చేయగా.. ఈసారి 8.23 శాతానికి పెంచుతూ ప్రతిపాదనలు చేశారు. ఉన్నత విద్యకు రూ.5443 కోట్లు ప్రతిపాదించగా ఇందులో నిర్వహణకు రూ.3263 కోట్లు కాగా పథకాలకు రూ.2180 కోట్లుగా పేర్కొన్నారు. ఇకపోతే సెకండరీ విద్యకు రూ.21,231 కోట్లు ప్రతిపాదించారు. కాగా నిర్వహణకు వ్యయంగా రూ.16458 కోట్లు, పథకాలకు రూ.4773 కోట్లు ఖర్చు చేయాలని ప్రణాళికలు చేశారు. ఇదిలాఉండగా రాష్ట్ర ప్రభుత్వం 2025-26లో సర్కార్ విద్యా రంగానికి రూ.23,108 కోట్లు ప్రతిపాదించింది.

44 చోట్ల యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన, నైపుణ్యం కలిగిన విద్యను అందించాలనే సంకల్పంతో అన్నిఅసెంబ్లీ నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను మంజూరు చేయాలని నిర్ణయించింద. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ విద్యార్థులు ఒకేచోట చదువుకునేందుకు వీలుగా అధునాతన వసతులతో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠఠశాలలు నిర్మాణానికి పూనుకుంది. కాగా ఇప్పటికే 79 స్కూళ్లను సర్కార్ మంజూరు చేసింది. అందులో 44 చోట్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.

ప్రాథమిక విద్య బలోపేతం

ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి 33 జిల్లాల్లో 1,362 ప్రీ-ప్రైమరీ విభాగాలను పైలట్ ప్రాజెక్టుగా సర్కార్ ప్రారంభించింది. రాబోయే విద్యా సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని 2,000 నుంచి 2,500 ప్రభుత్వ పాఠశాలలకు విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని భావిస్తోంది. ఇదిలా ఉండగా బాలికల విద్యను ప్రోత్సహించేందుకు 2025-26 విద్యా సంవత్సరంలో 93 కేజీబీవీలను యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ప్రకటించి, 120 కేజీబీవీలను ఇంటర్మీడియట్ స్థాయికి అప్ గ్రేడ్ చేసింది.

తెలంగాణ ప‌బ్లిక్ స్కూళ్లు

ఎంపిక చేసిన ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక మౌలిక సదుపాయాలు, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, డిజిటల్ సదుపాయాలు, ప్రత్యేక రవాణా వ్యవస్థలతో అన్ని వనరులతో కూడిన క్యాంపస్ గా అభివృద్ధి చేయాలని బడ్జెట్ లో సర్కార్ ప్రతిపాదించింది. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు 1500 మంది విద్యార్థులకు ఒకేచోట విద్య అందించేలా సర్కార్ ప్రణాళికలు చేస్తోంది.

రెండు నూతన పథకాలు

ప్రభుత్వం విద్యార్థుల పోషణ, విద్యా ఫలితాలను మెరుగుపరచడానికి వీలుగా రెండు నూతన పథకాలు ఈ బడ్జెట్ లో ప్రవేశ పెట్టింది. అందులో ఒకటి ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ కాగా రెండోది ఇంటర్ విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించారు. ఈ బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రతి విద్యార్థికి వారానికి మూడు రోజులు పాలు, మిగతా మూడు రోజులు రాగిజావ అందించనున్నారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలుచేయనున్నారు. ఇదిలా ఉండగా ఇంటర్ విద్యార్థులకు రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాలను సర్కార్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇకపోతే రాష్ట్రంలోని అన్నివసతి గృహాలు, గురుకుల విద్యాసంస్థలల్లోని వంటశాలల ఆధునీకరణకు రూ.100 కోట్లు ప్రతిపాదించింది.

Also read: Bangladesh On PSL: త‌ల‌లు లేపేస్తామ‌ని తాలిబ‌న్ల హెచ్చ‌రిక‌లు.. PSL 2026 నుంచి బంగ్లా ప్లేయ‌ర్లు ఔట్

కొత్త డిడ్రీ కాలేజీలు

స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంతో పాటు కేసముద్రం, గంగాధర, ధర్మపురి, పాకాల్, కోస్గి, దేవరకద్రలో కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను సర్కార్ ప్రారంభించింది. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల సంఖ్య 149కు చేరింది.

పాలిటెక్నిక్ లో 15 కొత్త కోర్సులు

రాష్ట్రంలో ఉన్న 57 పాలిటెక్నిక్ కళాశాలలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్ గ్రేడ్ చేశారు. అంతేకాకుండా యువతను భవిష్యత్ ఉద్యోగావకాశాలు కల్పించడానికి, ఎంటర్ ప్రెన్యూర్లుగా ఎదగడానికి వీలుగా పాలిటెక్నిక్ కళాశాలల్లో15 కొత్త కోర్సులు 2026-27 విద్యా సంవత్సరంలో ప్రారంభించాలని సర్కార్ నిర్ణయించింది.

ఓయూకు రూ.1000 కోట్లు, మహిళా వర్సిటీకి రూ.400 కోట్లు

మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రూ.వెయ్యి కోట్లు, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి రూ.400 కోట్లను సర్కార్ బడ్జెట్ లో ప్రతిపాదించింది. మిగిలిన విశ్వవిద్యాలయాలకు కూడా అవసరమైన నిధులు అందించనుంది.

అదనంగా 53 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు

పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్లో స్కిల్స్ ను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటుచేసింది. అందులో భాగంగా రాష్ట్రంలోని 65 ప్రభుత్వ ఐటీఐలను ఆధునిక పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా తీర్చిదిద్దేందుకు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా(ఏటీసీ) ప్రభుత్వం అప్ గ్రేడ్ చేసింది. కాగా దీనికి అదనంగా మరో 53 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటుచేయాలని సర్కార్ బడ్జెట్ లో ప్రతిపాదించింది. దీంతో మొత్తం 118 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు అందుబాటులోకి రానున్నాయి. ఏటీసీల్లో లో శిక్షణ పొందుతున్న ట్రైనీలకు ప్రతినెల రూ.2 వేలు స్కాలర్ షిప్ రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Also Read: Telangana Economy: తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికలు విడుదల చేసిన ప్రభుత్వం

‘ఇంటర్’లో మధ్యాహ్న భోజనంపై హర్షం

ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఇంటర్ ప్రభుత్వ లెక్చరర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి సంఘం నాయకులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. అలాగే తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ వస్కుల శ్రీనివాస్, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ హర్షం వ్యక్తంచేశారు. దీనివల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే సుమారు 2 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.

పెదవి విరిచిని ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు

ఈ బడ్జెట్ లో విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు పెదవి విరిచాయి. జనాకర్షక పథకాలకే తప్ప ప్రస్తుత వ్యవస్థను బాగుచేసే విధంగా విద్యారంగానికి కేటాయింపులు లేవని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ రవి, వెంకట్ విమర్శించారు. విద్యారంగానికి దశ, దిశ చూపలేని బడ్జెట్ అని టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వొడ్నాల రాజశేఖర్, తెల్కలపల్లి పెంటయ్య, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ హన్మంత్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. పెండింగ్ బిల్లులు, పీఆర్సీ ప్రస్తావన లేకపోవడం దారుణమని మండిపడ్డారు. ఇదిలా ఉండగా టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కటకం రమేశ్, మారెడ్డి అంజిరెడ్డి.., కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన 15 శాతం నిధులను విద్యాశాఖకు కేటాయించడంలో విఫలమైందని, అరకొర నిధులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ నిర్వహణ అసాధ్యమని వారు పేర్కొన్నారు. 15 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు.

విద్యారంగంపై కాంగ్రెస్..

విద్యాశాఖకు అరకొర నిధులే ప్రతిపాదించారని, గత సంవత్సరం బడ్జెట్ కంటే కేవలం 0.62 శాతం మాత్రమే పెంచి విద్యాశాఖలో అద్భుతాలు ఎలా సృష్టిస్తారో చెప్పాలని ఎస్టీ యూటీఎస్ నాయకుడు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల విడుదలపై ఎలాంటి ప్రస్తావని లేదని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు, ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ రాజు విమర్శించారు. విశ్వవిద్యాలయాల అభివృద్ధికి శూన్య హస్తం అందించారని మండిపడ్డారు. విద్యారంగంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, చెప్పేది ఒకటి చేసేది ఒకటని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రజనీకాంత్, నాగరాజ్ ఫైరయ్యారు. కనీసం ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కూడా అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. బడ్జెట్ లో విద్యారంగానికి మొండిచెయ్యి చూపడంపై నిరసనగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా బడ్జెట్ ప్రతులు దగ్ధం చేయాలని వారు పిలుపునిచ్చారు.

Also Read: Today Movies in TV : శనివారం టీవీ సినిమాలు.. ఆ రెండు వెరీ స్పెషల్.. డోంట్ మిస్…

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×