
Telangana Elections 2023 : తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్ధుల రెండో జాబితాపై కసరత్తు కొలిక్కి వస్తోంది. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన.. సీఈసీ ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. మొదటి విడతలో 55 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ రెండో విడతలో 35 నుంచి 40 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
తెలంగాణ నుంచి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశానికి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావ్ థాక్రే, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ హాజరవుతారు. ఈ సమావేశం తర్వాత తెలంగాణ కాంగ్రెస్ రెండో విడత అభ్యర్థులను సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఖరారు చేయనుంది.
వామపక్షాలతో సీట్ల సర్దుబాటు, పార్టీలో చేరికలు పూర్తయితే మూడో జాబితాలో సీట్లు కేటాయింపు ప్రక్రియను అధిష్టానం పూర్తి చేయనుంది. ఇప్పటికే చెన్నూరు, కొత్తగూడెం సీట్లను సిపిఐకి కేటాయించిన కాంగ్రెస్ సిపిఎం కు వైరా, మిర్యాలగూడ సీట్లను కేటాయిస్తున్నట్లుగా సమాచారం. ఈ విషయంలో అధికారిక ప్రకటన రావడమే ఆలస్యమంటున్నారు.
రెండో జాబితాలో ఏ సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు కేటాయిస్తారోనని రాజకీయ వర్గంలో ఆసక్తి నెలకొంది.
ఈసారైనా తమకు సీటు దక్కుతుందా లేదా అని.. ఆశావహులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అసంతృప్తి జ్వాలలు బయటకి రాకుండా వారిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీలో జానారెడ్డి, మాణిక్ రావ్ థాక్రే, దీపాదాస్ మున్షీ, మీనాక్షి నటరాజన్ ఉన్నారు. రెండవ జాబితా సిద్ధం చేస్తున్న నేపథ్యంలో అసంతృప్తులను బుజ్జగించేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగారు.