BigTV English

Telangana Electricity Consumption: తెలంగాణలో భారీగా పెరిగిన కరెంటు వినియోగం.. వేసవికి ముందే డిమాండ్

Telangana Electricity Consumption: తెలంగాణలో భారీగా పెరిగిన కరెంటు వినియోగం.. వేసవికి ముందే డిమాండ్

Telangana Electricity Consumption| వేసవిలో సహజంగానే విద్యుత్ డిమాండ్ అధికంగా ఉంటుంది. ఈ డిమాండ్‌ను తీర్చేందుకు డిస్కంలు ముందస్తుగానే చర్యలు చేపడుతున్నాయి. ఈసారి వేసవి ప్రారంభం కాకముందే ఈ ప్రయత్నాలను విద్యుత్ రంగ సంస్థలు ప్రారంభించాయి. గత ఏడాది మార్చి నెలలో అత్యధికంగా 15 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. కానీ ఈ సంవత్సరం వేసవి రాకముందే జనవరి నెలలోనే 15,205 మెగావాట్ల డిమాండ్ నమోదయింది. ఇంకా ఎండలు పూర్తిగా ప్రారంభం కాకముందే ఇంత డిమాండ్ ఏర్పడితే, పీక్ సమ్మర్ సీజన్‌లో ఊహించని స్థాయిలో డిమాండ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.


ఈ డిమాండ్ పెరుగుదలకు కేవలం గృహ వినియోగమే కారణం కాదు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో బాగా వర్షాలు పడి, రికార్డ్ స్థాయిలో పంట దిగుబడి సాధించడంతో వ్యవసాయ రంగంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. అలాగే పారిశ్రామిక, గృహ వినియోగంలో కూడా భారీగా వృద్ధి కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా జనవరిలో 10 వేల మెగావాట్ల డిమాండ్ ఏర్పడగా, ఒక్క హైదరాబాద్ మహానగరంలోనే 5,000 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. మొత్తంగా చూస్తే 15 వేలకు పైగా మెగావాట్ల డిమాండ్ ఏర్పడింది. ఈ ఏడాది పీక్ వేసవిలో కనీసం 17,000 నుంచి 18 వేల మెగావాట్ల డిమాండ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని అంచనా.

Also Read: బీజేపీ ఆఫీస్ అడ్రస్‌కు గద్దర్ పేరు పెడతాం..? బండి సంజయ్‌కు సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్


డిప్యూటీ సిఎం భట్టి సమీక్ష
ఈ పరిస్థితులను గమనిస్తూ, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. వేసవి కాలంలో డిమాండ్‌కు తగిన నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంపై తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు దృష్టి పెట్టాయి. విద్యుత్ సరఫరా సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షలు నిర్వహిస్తున్నారు. పెరుగుతున్న డిమాండ్‌కు తగిన సరఫరా ఎలా ఉందనే అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారు. ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచిస్తున్నారు.

గత ఏడాది జనవరిలో పీక్ డిమాండ్ 13,810 మెగావాట్లు కాగా, ఈ ఏడాది జనవరి 31న రికార్డ్ స్థాయిలో 15,205 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. ఇది గత ఏడాది పీక్ వేసవిలో ఉన్న డిమాండ్ కంటే కూడా ఎక్కువ. గత ఏడాది మార్చి 3న అత్యధికంగా 15,623 మెగావాట్ల డిమాండ్ ఏర్పడింది. ఈ ఏడాది డిమాండ్ ఎంత పెరిగినా, దానికి తగిన సరఫరా అందించేందుకు విద్యుత్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. వేసవిలో విద్యుత్ డిమాండ్ ఒత్తిడిని తట్టుకోవడానికి ప్రతి జిల్లాకు సీనియర్ ఇంజనీర్లను నోడల్ అధికారులుగా నియమించారు. విద్యుత్ కంట్రోల్ రూమ్ 1912ను బలోపేతం చేసి, ప్రజలకు అందుబాటులో ఉంచారు.

పెరుగుతున్న డిమాండ్‌కు తగిన విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. సింగరేణి నుంచి రోజుకు 17 లక్షల క్యూబిక్ మీటర్ల బొగ్గు సరఫరాను నిరంతరాయంగా కొనసాగించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే సోలార్ పవర్ సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో డిమాండ్‌కు తగిన విద్యుత్ సరఫరా చేయడానికి పవర్ బ్యాంకింగ్ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇతర రాష్ట్రాలలో డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు తెలంగాణ నుంచి విద్యుత్ సరఫరా చేసి, తెలంగాణలో డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ దిగుమతి చేసుకునే విధానాన్ని పవర్ బ్యాంకింగ్ అంటారు. ఉత్తర మరియు దక్షిణ భారతదేశాలలో విద్యుత్ వినియోగ సీజన్లలో వ్యత్యాసాలు ఉండటంతో, పవర్ బ్యాంకింగ్ ద్వారా పీక్ వేసవిలో డిమాండ్‌కు తగిన సరఫరా చేయగలమని అధికారులు తెలిపారు.

Related News

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండి కుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Big Stories

×