Kavitha: స్వేచ్ఛ బ్యూరో: కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటళ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. భూపాలపల్లి ప్రభుత్వ హాస్పిటల్ లోని ఎస్ఎన్ సీయూలో సీలింగ్ కూలిన ఘటనపై ఎక్స్ వేదికగా శనివారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదేనా మీ ప్రజా పాలన..?
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు మృతి చెందిన ఘటన మరవక ముందే భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సీలింగ్ కూలిందని.. ప్రజల ప్రాణాలపైఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఈ ఘటనతో అర్థం చేసుకోవచ్చన్నారు. సీలింగ్ కూలిన సమయంలో వార్డులో అదృష్టవశాత్తూ పిల్లలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. లేదంటే ఈ ప్రభుత్వం పట్టిలేనితనానికి మరికొంత మంది పసికందులు బలయ్యేవారని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో సర్కార్ దవాఖానాకు వెళ్తే ప్రజల ప్రాణాలకు గ్యారంటీ లేని దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘మాట్లాడితే ప్రజా పాలనంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇదేనా ప్రజా పాలన? మీ చేతగానీతనం కారణంగానే సర్కార్ దవాఖానాలు ఇంత అధ్వాన్నంగా తయారయ్యాయి’ అని ధ్వజమెత్తారు.
ఆపరేషన్ బ్లూ కోడ్ తో వైఫల్యాలను ఎండగడతాం
హాస్పిటల్స్ లో పారిశుద్ద్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని, రోగులకు కనీస సౌకర్యాలు, మందులు లేని పరిస్థితి ఉందన్నారు. బెడ్లు లేక వీల్ చైర్ లో చికిత్స చేసే దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. చేతగానీ కాంగ్రెస్ పాలన కారణంగా ప్రభుత్వ హాస్పిటల్స్ ఎంత దయనీయంగా ఉన్నాయో త్వరలోనే బయటపెడతామని చెప్పారు. ఆపరేషన్ బ్లూ కోడ్ పేరుతో తెలంగాణ రక్షణ సేన నాయకులు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శిస్తారని.. ప్రభుత్వ వైఫల్యం కారణంగా అక్కడ ఎలాంటి దయనీయ పరిస్థితులు ఉన్నాయో ప్రజల ముందుంచుతామని చెప్పారు.
మృతుల కుటుంబాలను ఆదుకోవాలి
వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రైవేటు బస్సు బోల్తా పడి నలుగురు మృతి చెందిన ఘటనపై కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన చికిత్స అందించాలని కోరారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read: ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ సంబరాలు.. ఈసారి ప్రత్యేకం ఏంటో తెలుసా?