BRS Land: స్వేచ్ఛ బ్యూరో: భారత్ రాష్ట్రీయ సమితి పదేళ్ల పాలనలో జరిగిన భూ కేటాయింపుల వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. గత ప్రభుత్వంలో ఎక్కడెక్కడ, ఎవరెవరికి, ఏ ప్రాతిపదికన భూములు కేటాయించారు? అసైన్డ్ భూముల బదిలీల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? అనే అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిస్థాయి స్క్రీనింగ్ ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన సమగ్ర వివరాలు, ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం, జరిగిన అక్రమాలపై నివేదిక ఇవ్వాలని సీఎం రెవెన్యూ , పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. దీనితో పేదల సంక్షేమం కోసం ఇచ్చిన అసైన్డ్ భూములను నిషేధిత జాబితా నుంచి ఎలా తొలగించారో అధికారులు పరిశీలించనున్నారు.జీవోలు, ఆర్డినెన్సుల పేరుతో భూమి హక్కులను మార్చి రియల్ ఎస్టేట్ దిగ్గజాలకు, బీఆర్ఎస్ అనుకూల బినామీలకు కట్టబెట్టారనే ఆరోపణలపై ల్యాండ్ రికార్డులను రీ-వెరిఫై చేయనున్నారు.ఇక పరిశ్రమలు పెడతామని చెప్పి కోట్లు విలువ చేసే భూములను నామమాత్రపు ధరలకు పొందిన కంపెనీల జాబితాను సిద్ధం చేస్తున్నారు.
పూర్తి స్థాయిలో ఎంక్వయిరీ..?
భూమి పొంది ఐదేళ్లు దాటినా.. పరిశ్రమలు ప్రారంభించని సంస్థలు, ఒప్పందానికి విరుద్ధంగా భూమిని లేఅవుట్లుగా మార్చి విక్రయించిన కంపెనీల కేటాయింపులను రద్దు చేయడానికి నోటీసులు సిద్ధం చేస్తున్నారు.మరో వైపు
హైదరాబాద్ చుట్టూ ఉన్న హెచ్ఎండిఏ , ఓ ఆర్ ఆర్ పరిసర ప్రాంతాల్లో , రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో అత్యంత విలువైన భూముల కేటాయింపుల్లో సాగిన పొలిటికల్ లాబీయింగ్‌పై నిఘా విభాగం వివరాలు సేకరిస్తోంది. మార్కెట్ విలువ కంటే చాలా తక్కువకు కట్టబెట్టడం వెనుక అప్పటి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల హస్తం ఉందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. అంతే కాకుండా గత పదేళ్లలో భూముల అమ్మకాలు, లీజులు, కేటాయింపుల ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన రాబడి ఎంత? అసలు వచ్చిందేంత? అనే వ్యత్యాసాన్ని అధికారులు లెక్కిస్తున్నారు.
యాక్షన్ ఇలా..?
అసైన్డ్ భూములను అక్రమ రిజిస్ట్రేషన్లు, బినామీ కొనుగోళ్లు జరిగితే నిబంధనలు ఉల్లంఘన కింద భూములు స్వాధీనం చేసుకోనున్నారు. పారిశ్రామిక భూములు ల్లో పరిశ్రమలు స్థాపించకపోవడం, కమర్షియల్ వాడకం చేయకుంటే నోటీసులు జారీ చేసి కేటాయింపుల రద్దు చేయనున్నారు. హెచ్ఎండిఏ ,ఓ ఆర్ ఆర్ భూములను నామమాత్రపు ధరలకే ప్రైవేట్ వేలం, పక్షపాతంలావాదేవీలపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ఇచ్చే పూర్తిస్థాయి రిపోర్టు ఆధారంగా.. సర్కార్ తుది నిర్ణయం తీసుకోనున్నదని సెక్రటేరియట్ లోని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.
సీఎం సీరియస్..
ప్రజాధనం, ప్రభుత్వ భూములు కొందరి వ్యక్తిగత ఆస్తులు కావు..పారిశ్రామిక పురోగతి పేరుతో భూములను పొంది రియల్ ఎస్టేట్ ధందా నడిపిన వారిపై కఠిన చర్యలు ఉండాలి.సమగ్ర నివేదిక రాగానే చట్టపరంగా ముందుకు వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఉన్నతాధికారులు రివ్యూలో తేల్చి చెప్పారు మరోవైపుఅధికారులు ఇచ్చే పూర్తిస్థాయినివేదిక ఆధారంగా ప్రభుత్వం భూ కేటాయింపులపై అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రం విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పంపిణీ చేసిన భూములను తిరిగి ప్రభుత్వ ఖజానాలోకి తీసుకోవడంతో పాటు, బాధ్యులైన అధికారులపై, గత పాలకులపై చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది.
Also Read: అబద్ధాలు, కట్టుకథలతో చరిత్రను మార్చలేరు! కాంగ్రెస్‌పై హరీష్ రావు ఫైర్!