Rythu Bharosa : తెలంగాణ సర్కార్ రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల సమయంలో హామి ఇచ్చినట్లుగా రాష్ట్రంలోని అర్హులైన రైతులకు రైతు భరోసా సాయం అందించేందుకు సిద్ధమైంది. కొత్త ఏడాదిలో సంక్రాతి నుంచి ఈ పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇందుకు సంబంధించి రిమోర్ట్ సెన్సింగ్ డాటా సేకరణ, పంట విస్తీర్ణం అంచనాలు సహా వివిధ సాంకేతిక అంశాలపై చర్చించేందుకు వివిధ కంపెనీల ప్రతినిధులతో అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వర రావు సమావేశమైయ్యారు.
రాష్ట్ర సచివాలయంలో సమావేశం నిర్వహించిన మంత్రి తుమ్మల.. రైతు భరోసాను సాగులో ఉన్న భూమికి మాత్రమే అందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఉద్దేశాలు కచ్చితంగా అమలు కావాలని, ఏ పథకం అమలులోనూ తప్పిదాలు, నిర్లక్ష్యానికి ఆస్కారం ఇవ్వకూడదనేది తమ ఆలోచనగా చెప్పారు. ఎన్నికల్లో తాము ఇచ్చిన హామి మేరకు రైతులకు తప్పకుండా పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించిన మంత్రి.. అత్యాధునిక సాంకేతికతలు వినియోగించిన సాగు భూమి వివరాలు సేకరించనున్నట్లు వెల్లడించారు.
క్షేత్ర స్థాయిలో సాగు భూముల వివరాలు, రైతుల వారీగా విస్తీర్ణాలను వ్యవసాయ విస్తీర్ణాధికారులు ద్వారా ఎప్పటికప్పుడు నమోదు చేస్తారని తెలిపారు. అదే సమయంలో రైతు భరోసా పథకం అమలులో కచ్చితత్వంతో కోసం శాటిలైట్ డేటాను వినియోగించుకుంటామని ప్రకటించారు. ఇందులో.. గ్రామాల వారీ సర్వేగా, నెంబర్ల వారీగా సాగులో ఉన్న భూముల విస్తీర్ణం తెసుకుంటామన్నారు. అలాగే..సాగును అనువు గానీ భూముల విస్తీర్ణంతో పాటు ప్రస్తుతం ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు వంటి వివరాలను సేకరించనున్నట్లు ప్రకటించారు.
అధికారుల నుంచి సేకరించే వివరాలతో పాటు శాటిలైట్ డేటా ఆధారంగా రైతు భరోసా పథకం అమలులో పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. ఈ విధానం.. రైతు భరోసా పథకం అమలుతో పాటు, భవిష్యత్తులో చేపట్టనున్న పంటల భీమా అమలుకు ఉపయోగపడుతోందన్నారు. సాంకేతికత వినియోగం వల్ల పంటల ఆరోగ్య స్థితి, పంటల ఎదుగుదల, చీడపీడలను ఆరంభములోనే గుర్తించడం సహా.. వరదలు, తుఫానుల వల్ల జరిగే పంటనష్టాన్ని అంచనా వేయడంలో సహాయపడుతుందని తెలిపారు. నూతన సాంకేతికతల వినియోగానికి రేవంత్ రెడ్డి సర్కార్ సిద్దంగా ఉందని ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వ అవసరాల మేరకు వివిధ కంపెనీ ప్రతినిధులు వారి ప్రాజెక్టు వివరాల్ని, నమూనా వివరాల్ని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ముందుంచారు. రెండు మండలాల్లో చేపట్టిన సాంపిల్ సర్వేలో పంటల వారీగా, గ్రామాల వారీగా సేకరించిన సమాచారాన్ని.. ఇప్పటి వరకు సాగైన పంట వివరాల్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలో సాగుకు అనువు గానీ ప్రాంతాలను డిజిటల్ మ్యాప్స్ ద్వారా చూపించారు. పంటలలో తలెత్తే చీడపీడలను ఆరంభములో గుర్తించే విధంగా.. ఆయా కంపెనీలు AI పరిజ్ఞానంలో తయారు చేసిన మోడల్స్ ను వివరించారు.
Also Read : న్యూ ఇయర్ బాగా ఎంజాయ్ చేయండి.. కానీ ఇలా చేశారో నేరుగా జైలుకే అంటున్న పోలీసులు..
ఈ వివరాల్ని పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.. కంపెనీల ప్రతినిధుల్ని పూర్తి వివరాలలో సిద్దంగా ఉండాలని సూచించారు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ వీటన్నిటిని పరిశీలించి మంత్రి వర్గ ఉపసంఘానికి సిఫార్సు చేస్తుందని తెలిపారు. అక్కడ నిర్ణయం మేరకు క్యాబినెట్ ఆమోదానికి పంపిస్తామని, ఆ తర్వాత క్షేత్ర స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టు అమల్లోకి వస్తుందని మంత్రి తెలియజేశారు.