Padmashali MLC: గవర్నర్ కోటాలో మండలికి వెళ్లే పద్మశాలీ నేత ఎవరు ? ఇప్పుడు కాంగ్రెస్‌లో ఇదే చర్చ..! గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్ పదవీ కాలం నవంబర్ 14న ముగుస్తుంది. ఈ మూడు సీట్లలో ఒకటి పద్మశాలీ నేతకు పోతే..మిగిలిన రెండు సీట్లలో ఒకటి ఎస్సీ వర్గానికి, రెండోది బ్రాహ్మణ వర్గానికి కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టుగా.. సిరిసిల్ల సభ వేదికను బాగా వినియోగించుకున్నారు సీఎం రేవంత్. పద్మశాలి వర్గం ఎక్కువగా ఉండే వేదికపై ఆ కులస్తుడిని మండలికి పంపుతానని ప్రకటించడం ద్వారా..తాము బీసీల పక్షం కూడా అని చెప్పడమే కాదు.. విమర్శల నోళ్లకు తాళం వేయడం CM వ్యూహంగా తెలుస్తోంది.
రేవంత్ హామీ.. హస్తం పార్టీలో జోరుగా చర్చ!
సీఎం నోటి వెంట వచ్చిన హామీ కాబట్టి పద్మశాలి వర్గం నేత ఎవరనే డిస్కషన్ పార్టీలో నడుస్తోంది. బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్‌తో పాటు కొండా లక్ష్మణ్ బాపూజీ మనవరాలు వాణి పేర్లను పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు చట్టసభల్లో అడుగు పెట్టని కులాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనేది సీఎం ఉద్దేశంగా కనిపిస్తోంది. అందుకే రజక కులానికి చెందిన బస్వరాజు సారయ్యకు మళ్లీ అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రభుత్వ పరిశీలనలో మూడు పేర్లు..
గతంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల అభ్యర్థిత్వం కోర్టు పరిధికి వెళ్లి వివాదాన్ని తెచ్చిపెట్టింది. ఇలాంటివి పునరావృతం కాకుండా ఆచితూచి అడుగులేస్తోంది సర్కార్. బీఆరెస్ పార్టీ నుంచి బ్రహ్మాణులకు అవకాశం దొరికింది. సురభి వాణిదేవీ, దేశ్‌పతి శ్రీనివాస్‌లకు ఆ పార్టీ ఛాన్స్ ఇచ్చింది. కాంగ్రెస్ కూడా ఈ కోణంలో ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓ మూడు పేర్లు ప్రభత్వ పరిశీలనకు వచ్చినట్టు సమాచారం.
బ్రాహ్మణ సమీకరణాల్లో రేవంత్ వ్యూహం!
ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించే అంశంపైనా కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది. వరంగల్‌కు చెందిన డొమా సాంబయ్య, మానవతా రై వంటి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఖమ్మం నుంచి కూడా కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. మూడో ఎమ్మెల్సీ స్థానం బ్రాహ్మణ సామాజిక వర్గానికి దక్కే అవకాశం ఉందంటున్నారు. పద్మశాలి, ఎస్సీ, బ్రాహ్మణ సమీకరణాన్ని వర్కౌట్ చేయాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది.
Also Read: బార్‌లో వార్.. రోడ్డుపై రివేంజ్! ఈసీఐఎల్ కారు యాక్సిడెంట్ వెనుక దాగిన కోణం ఇదే!