Family Romantic Comedy: లండన్ లో వడాపావ్ రెస్టారెంట్ నడుపుకుంటూ హాయిగా జీవిస్తున్న ఓ కుటుంబం… ఆ ఇంట్లో ప్రేమకథ మొదలవ్వడంతో సీన్ రివర్స్ అవుతుంది. ఒకవైపు కుటుంబ బాధ్యతలు.. మరోవైపు మనసుకు నచ్చిన వ్యక్తితో జీవితం పంచుకోవాలనే కోరిక… ఈ రెండింటి మధ్య సాగే గమ్మత్తైన ప్రేమకథే మరాఠీ సినిమా ‘వడాపావ్’ (Vadapav). మరి ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనే వివరాల్లోకి వెళ్తే…
లండన్ లో డెష్‌ముఖ్ కుటుంబం వడాపావ్ వ్యాపారం చేసుకుంటూ ఉంటుంది. ఆ కుటుంబానికి జయదేవ్ డెష్‌ముఖ్ పెద్ద దిక్కుగా ఉంటాడు. కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ, వ్యాపారాన్ని నడిపిస్తూ తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంటాడు. అతని కుటుంబంలో పిల్లలు, పెద్దలు… ఇలా మూడు తరాలకు చెందిన వ్యక్తుల మధ్య ఉండే అనుబంధాలు, సరదా గొడవలతొ కథ ఆసక్తికరంగా సాగుతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో జయదేవ్ జీవితంలో గౌరీ ప్రవేశిస్తుంది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. కానీ ఈ ప్రేమను అంత తేలిగ్గా అంగీకరించే పరిస్థితి ఉండదు. ముఖ్యంగా ఇద్దరి మధ్య ఉన్న వయసు తేడా కుటుంబంలో రచ్చకు దారితీస్తుంది. ఒకవైపు తమ జీవితాన్ని తమకు నచ్చినట్టుగా కొనసాగించాలనుకునే జంట… మరోవైపు కుటుంబం, సమాజం ఏమనుకుంటుందనే ఆలోచనతో ఉండే పెద్దలు కనిపిస్తారు. ఈ ప్రేమకథే కుటుంబంలో కొత్త రకమైన గందరగోళానికి కారణమవుతుంది.
అదే సమయంలో జయదేవ్ కుటుంబంలోని యువతరం కూడా తమ తమ ప్రేమలు, సంబంధాలతో బిజీగా ఉంటుంది. ఇంట్లో ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో కథ నడుస్తుంటుంది. వడాపావ్ వ్యాపారం, కుటుంబ బాధ్యతలు, ప్రేమ, పెళ్లి… ఇన్ని సమస్యలతో ఇంట్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. ఒకరి నిర్ణయం మరొకరి జీవితాన్ని ప్రభావితం చేసే పరిస్థితి వస్తుంది. నవ్వించే సంఘటనలతో పాటు కుటుంబ సభ్యుల మధ్య భావోద్వేగ సన్నివేశాలు కూడా కథలో భాగమవుతాయి. అందుకే సినిమా కేవలం లవ్‌స్టోరీగా కాకుండా మూడు తరాల కుటుంబ సంబంధాలను కూడా చూపించే కథగా సాగుతుంది.
జయదేవ్, గౌరీ ప్రేమను కుటుంబం చివరకు అంగీకరిస్తుందా ? వయసు తేడా వాళ్ల బంధానికి అడ్డుగా నిలుస్తుందా ? కుటుంబంలో ఏర్పడే సమస్యల మధ్య వీళ్ల ప్రేమ ఎలాంటి మలుపులు తిరుగుతుంది ? యువతరం ప్రేమకథలు ఈ కుటుంబ సమస్యలకు ఎలా ముడిపడతాయి ? చివరకు ఈ ఇంట్లో ప్రేమ గెలుస్తుందా… లేక కుటుంబ పరిస్థితులే నిర్ణయాన్ని మార్చేస్తాయా ? అనేదే ‘వడాపావ్’లో చూడాల్సిన అంశం.
ప్రసాద్ ఓక్ (Prasad Oak), గౌరీ నలావడే (Gauri Nalawade), అభినయ్ బెర్డే (Abhinay Berde), రితికా శ్రోత్రి (Ritika Shrotri), రసికా వెంగుర్లేకర్ (Rasika Vengurlekar), శాల్వ కింజ్‌వడేకర్ (Shalva Kinjawadekar), సవితా ప్రభుణే (Savita Prabhune) తదితరులు నటించిన ఈ మరాఠీ ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీకి ప్రసాద్ ఓక్ దర్శకత్వం వహించారు. 2025 అక్టోబర్ 2న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ‘వడాపావ్’ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రైమ్ వీడియో లిస్టింగ్ ప్రకారం ఆడియో మరాఠీలో మాత్రమే ఉంది, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ ఉన్నాయి. తెలుగు ఆడియో గానీ, తెలుగు సబ్‌టైటిల్స్ గానీ ప్రస్తుతం లిస్టింగ్‌లో లేవు. కాబట్టి ఈ సినిమాను తెలుగులో చూడాలనుకునే వారికి ప్రస్తుతం తెలుగు వెర్షన్ అందుబాటులో లేదు.
Read Also: డేటింగ్ యాప్ ఫౌండర్ కు డేరింగ్ ఛాలెంజ్… ఓటీటీలోకి తెలుగులో ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ సిరీస్