Telangana Govt: వేసవికాలం వేళ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. వడగాల్పులను విపత్తుగా ప్రకటించింది. దీని కింద మరణించిన కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. బాధిత కుటుంబాలకు రూ. 4 లక్షలు పరిహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
నివేదికలు ఏం చెబుతున్నాయి?
వాతావరణ మార్పుల కారణంగా సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవు తున్నాయి.ఎండ తీవ్రత, ఆపై వడగాల్పులతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది.ఐదు దశాబ్దాల్లో వడ గాల్పుల వల్ల దేశవ్యాప్తంగా 17వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు నివేదిక చెబుతున్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాల్లో అధికంగా మరణాలున్నట్లు తేలింది.
ప్రస్తుతం రోజురోజుకూ ఉష్టోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉదయం 11 నుంచి 5 గంటల వరకు వేడి కాల్పులు కొనసాగుతున్నాయి. దీని దాటికి చాలామంది పిట్టల్లా రాలిపోతున్నారు. వేసవికాలం ఎండలో లక్షలాది మంది బయట పని చేస్తారు. ఈ నేపథ్యంలో అవుట్ డోర్ కార్మికులను రక్షించడానికి ప్రభుత్వ చర్యలు చేపట్టింది. వడగాల్పులను విపత్తుగా ప్రకటించింది.
తుపానులు, వరదలు, భూకంపాలు వల్ల మరణించినవారికి మాత్రమే ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తోంది. తాజాగా వేసవికాలంలో వడదెబ్బ తగిలి చనిపోతే పరిహారం చెల్లించనుంది. వడ గాల్పుల మరణాలపై జాతీయ స్థాయిలో నష్టపరిహారం చెల్లించే పాలసీ లేదు. కొన్ని రాష్ట్రాలు పరిహారం చెల్లిస్తున్నాయి. వాటిలో తెలంగాణ కూడా చేరిపోయింది.
ALSO READ: కారు పార్టీ లోగుట్టు.. ‘కొత్త’ పలుకులు, రాజకీయ చర్చ
జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం-2005 కింద వడ దెబ్బను ప్రకృతి విపత్తుగా గుర్తించలేదు కేంద్రం. ఉత్తరాదిలో కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిహారం అందిస్తోంది. అయితే అక్కడ 50 డిగ్రీల పైగానే ఉష్టోగ్రతలు నమోదు కావాల్సివుంది. కాకపోతే విపత్తుల నిర్వహణ నిధుల నుంచి 10 శాతం ఖర్చు చేసేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇచ్చింది కేంద్రం.
ఆ జోన్‌లో తెలుగు రాష్ట్రాలు
గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు హెచ్చరికలు చేస్తుంది వాతావరణ కేంద్రం. కోర్ హీట్‌వేవ్ జోన్లుగా పిలిచే ప్రాంతాల్లో మరణాలు ఎక్కువగా ఉంటాయి. వాటిలో హీట్‌వేవ్, సీవియర్ హీట్‌వేవ్ వంటి ప్రాంతాలున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే మే లో వీటి ప్రభావం ఎక్కువ.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా, బెంగాల్, ఛత్తీస్‌గఢ్, బీహార్, జార్ఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలు కోర్ హీట్‌వేవ్ జోన్ కిందకు వస్తాయి.
ఒక వ్యక్తి వడ దెబ్బతో చనిపోయారో లేదో తెలుసుకునేందుకు డాక్టర్లు పోస్టుమార్టం చేస్తారు. ఆ తరువాత పీహెచ్‌సీ డాక్టర్, ఎమ్మార్వో, ఎస్‌ఐలతో కూడిన కమిటీ ధ్రువీకరించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ప్రభుత్వం నుంచి పరిహారం అందుతుంది. పోస్ట్‌మార్టం చేయకుంటే నష్ట పరిహారం అస్సలు అందదు.
గ్లోబల్ వార్మింగ్‌కు కారణమైన కార్బన్ డయాక్సైడ్, మీథేన్ వాయువులు పెరగడమే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తీవ్ర స్థాయిలో వచ్చే వడగాల్పులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడనుంది. డీహైడ్రేషన్, తిమ్మిరులు రావడం, గుండెపోటు వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చిరిస్తున్నారు.