TG New Ration cards: నూతన రేషన్ కార్డుల కోసం ఎదురుచూపుల్లో ఉన్న ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సాధ్యమైనంత త్వరగా ఎన్నికల కోడ్ లేని జిల్లాలలో నూతన రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అర్హులై ఉండి కూడా రేషన్ కార్డు లేని ప్రజలకు.. ప్రభుత్వం లబ్ధి చేకూర్చేందుకు నూతన కార్డులను మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎందరో తమ దరఖాస్తులను సమర్పించి, నూతన రేషన్ కార్డు కోసం ఎదురుచూపులు చూస్తున్న పరిస్థితి. ఆ ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ పెట్టేలా సివిల్ సప్లై అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
జనవరి 26వ తేదీన రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. అదే రోజు నూతన రేషన్ కార్డులను మంజూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. ఈ దశలో గతంలో ప్రభుత్వం దృష్టికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అధికారులు, గ్రామ సభల ద్వారా కూడా దరఖాస్తులను స్వీకరించారు. రోజురోజుకు రేషన్ కార్డు కోసం దరఖాస్తులు అధికం కావడంతో ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని సైతం ప్రకటించింది.
సమీప గ్రామాల్లో గల మీసేవ కేంద్రాల ద్వారా కూడా దరఖాస్తులను స్వీకరించింది. ఈ నిర్ణయంతో ప్రజలకు దరఖాస్తులు సమర్పించే అవకాశం మరింత దగ్గరికి చేరిందని చెప్పవచ్చు. పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లను నమోదు చేయడం, అర్హులుగా ఉన్నవారికి నూతన రేషన్ కార్డును మంజూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సివిల్ సప్లై అధికారులతో సమీక్ష నిర్వహించి కార్డు తయారీ పై పలు సూచనలు చేశారు. అయితే కొత్త, పాత రేషన్ కార్డులను కలిపి మొత్తం కోటి రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు సమాచారం. రేషన్ కార్డులపై బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్ ఉండేలా, పోస్ట్ కార్డ్ సైజులో కార్డును తయారు చేయనున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఎన్నికల కోడ్ లేని మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ లలో నూతన రేషన్ కార్డులను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం.
కాగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేసేందుకు గురువారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సివిల్ సప్లై అధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కొత్త రేషన్ కార్డుల ఎంపిక, వీటి జారీ తదితర అంశాలపై చర్చ సాగింది. ఇప్పటికే రేషన్ కార్డులను నమూనాలను సీఎం పరిశీలించిన నేపథ్యంలో, కార్డుల జారీ ప్రక్రియను సివిల్ సప్లై అధికారులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. దీనితో సాధ్యమైనంత త్వరగా తెలంగాణ ప్రజలకు నూతన రేషన్ కార్డులు అందనున్నట్లు భావించవచ్చు.
రేషన్ కార్డు కలిగి ఉంటేనే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలతో లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం.. ప్రజలకు మేలు చేకూర్చేందుకు నూతన రేషన్ కార్డులు ప్రక్రియను కొనసాగించగా.. ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అతి త్వరలో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ సన్నబియ్యం అందించేందుకు ప్రభుత్వం సిద్దమవుతుండగా, కార్డుల జారీకి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.