Fine Rice Distribution: నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా తెల్లరేషన్‌కార్డు కలిగిన కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ ప్రారంభం కానుంది. ఉగాది రోజున హుజూర్‌నగర్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభమైన ఈ పథకం.. నేటి నుంచి హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో ఆరంభం కానుంది. రాష్ట్ర జనాభాలో 85 శాతం మంది పేదలకు ప్రజా పంపిణీ వ్యవస్థ కింద నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ కానుంది.
నేటి నుంచి అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేతుల మీదుగా సన్న బియ్యం పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ రంగం సిద్ధం చేసింది. నల్గొండ జిల్లా కనగల్లు మండలం యడవల్లి గ్రామంలో 11గంటలకు సన్న బియ్యం పంపిణిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించనున్నారు. కొత్త రేషన్ కార్డు లేనప్పటికీ లబ్ధిదారులు జాబితాలో పేరు ఉంటే వారికి సన్నబియ్యం ఇవ్వనున్నారు.
ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు ఎమ్మెల్యేలు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2 వేల 328 రేషన్ షాపుల్లో నేడు పంపిణీ జరగనుంది. మొత్తం 32 లక్షల 49 వేల 407 మంది లబ్ధిదారులకు 20 వేల 765 టన్నుల సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు అధికారులు.
ప్రజలకు ఉగాది కానుక తెలంగాణ ప్రభుత్వం ఉచిత సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.. నేటి నుంచి ప్రజలకు సన్నబియ్యం సరఫరా చేసేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నేటి నుంచి అమలు చేయనుంది. రేషన్‌కార్డుల్లో పేర్లు నమోదై ఉన్న ప్రతి ఒక్కరికీ ఆరు కిలోల చొప్పున బియ్యం సరఫరా చేయనున్నారు.
దేశంలోనే రేషన్‌కార్డు ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. రాష్ట్ర ప్రభుత్వం సొంద నిధులతో సన్నబియ్యం ఇవ్వనుంది. ఏటా ప్రభుత్వానికి 13వేల 523 కోట్లు ఖర్చు అవుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చేందుకు సిద్ధమైంది. జిల్లాలో పౌరసరఫరాలశాఖ 566 చౌకధరల దుకాణాల ద్వారా 2,76,908 కుటుంబాలకు రేషన్‌కార్డుల ద్వారా బియ్యం, నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తున్నారు. ఈ కుటుంబాలలో 8,04,968 మంది నెలనెలా బియ్యం పొందుతున్నారు. జిల్లాలో 2,61,164 ఆహారభద్రతా కార్టులు ఉండగా ఆయా కుటుంబాల్లోని 7,64,122 మంది సభ్యులకు ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున 45,847 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేస్తున్నారు.
Also Read: బాబు ఉన్నప్పుడే..! ఆ భూములకు హెచ్‌సియుకు సంబంధం లేదు.. ఆధారాలు ఇవే..!
రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా సరే రేషన్ తీసుకోవడానికి వీలుగా ఉండేలా డ్రెస్ సిస్టం అందుబాటులోకి తెస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. కొత్త రేషన్ కార్డులు కావాలని అనుకున్న వాళ్లకి అర్హతను బట్టి మంజూరు చేస్తామని అలాగే కొత్తగా ఫిజికల్ రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని కూడా ఆయన చెప్పుకొచ్చారు. రేషన్ కార్డు ఉన్నా లేకపోతే సన్న బియ్యం వాళ్లకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అందజేస్తామని తెలిపారు. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉండగా 2.85 కోట్ల రేషన్ కార్డు లబ్ధిదారులు రేషన్ సరుకులు తీసుకుంటున్నట్లు వివరించారు.