Indiramma Housing Scheme: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు న్యాయం చేయాలన్న సంకల్పంతో.. ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకాన్ని పునఃప్రారంభించింది. ఇళ్లులేని నిరుపేదలకు భద్రమైన నివాసం కల్పించాలనే లక్ష్యంతో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ పథకం కింద ఇప్పటికే చాలా మందికి ఇళ్లు మంజూరవ్వగా, కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత విస్తరించేందుకు చర్యలు ప్రారంభించింది.
జీ+3 మోడల్ నిర్మాణాలకు ప్రభుత్వ ప్రణాళిక
నగరాల్లో స్థల సమస్యను దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వ ఆవాసాలను జీ+3 (గ్రౌండ్ ప్లస్ మూడు అంతస్తులు) మోడల్‌లో నిర్మించేందుకు యోచిస్తోంది. పేదలు నివసిస్తున్న భూములపై ఆయా ప్రాంతాల పరిస్థితులను.. విశ్లేషించి నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. దీనివల్ల భూమిని వేరుగా కేటాయించాల్సిన అవసరం లేకుండా, అదే ప్రాంతంలో పునర్నిర్మాణం ద్వారా గృహాల నిర్మాణం వీలవుతుంది.
ఈ దిశగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తగిన స్థలాలు, అర్హుల జాబితాను తక్షణమే సిద్ధం చేయాలని సూచించారు. త్వరలోనే నిర్మాణాలు ప్రారంభించే దిశగా అధికారులు కృషి చేస్తున్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పూర్తి ప్రక్రియ వేగవంతం
గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం కింద.. కొన్ని ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాకుండా మిగిలిపోయాయి. ఈ నిర్మాణాలను వెంటనే పూర్తి చేసి, అర్హులైన పేదలకు ఇవ్వాల్సిందిగా సంబంధిత శాఖలను ఆదేశించారు. నిర్మాణానికి ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు.. సమన్వయంగా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.
ఇందిరమ్మ పథకం కింద నగదు సహాయం
మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. స్థలం ఉన్నా తమకు ఇంటిని నిర్మించుకోవడానికి.. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు రూ. 5 లక్షల నగదు సహాయం అందిస్తోంది ప్రభుత్వం. ఈ సహాయంతో పేదలు తమ స్వంత స్థలంలో ఇల్లు నిర్మించుకునే అవకాశం కలుగుతుంది. ఇది వారికి ఆర్థిక భద్రతతో పాటు.. గౌరవప్రదమైన జీవన స్థితిని కూడా కల్పిస్తుంది.
స్థలాల గుర్తింపు, అర్హుల తేల్చే ప్రక్రియ వేగవంతం
ప్రభుత్వం అన్ని జిల్లాల్లో పథకానికి.. అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించింది. ప్రతి జిల్లాలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, గ్రామాల వారీగా లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. దీనితో పాటు స్థలాల గుర్తింపు, భూమి పరిమితులు, నిర్మాణానికి అనుకూలత వంటి అంశాలను పరిశీలించనున్నారు.
Also Read: రాంకీ కంపెనీ లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. భయంతో జనాలు పరుగులు
పేదలకు ఇంటి కల నిజం కావాలంటే..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు.. పేదలకు సొంతింటి కలను సాకారం చేయడంలో కీలకంగా నిలవనున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల పునఃప్రారంభం, జీ+3 నిర్మాణం, రూ. 5 లక్షల నగదు సహాయం వంటి ఆలోచనలు పేదల జీవితాల్లో గణనీయమైన మార్పును తీసుకురానున్నాయి. ప్రభుత్వం పథకాన్ని పారదర్శకంగా, వేగంగా అమలు చేస్తే ఎంతోమంది పేదలకు స్థిరనివాసం కల్పించగలుగుతుందని ఆశించవచ్చు.