Kavitha Maha Dharna: కాళేశ్వరం కమిషన్ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు ఎమ్మెల్సీ కవిత. ఆయన ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చా రని ప్రశ్నించారు. కేసీఆర్‌కు నోటీసులిస్తే.. తెలంగాణ సమాజానికి ఇచ్చినట్లేనని అన్నారు.
కాళేశ్వరం కమిషన్ కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బుధవారం ఉదయం ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు దిగారు కవిత. ఆమెతోపాటు తెలంగాణ జాగృతి నేతలు మాత్రమే హాజరయ్యారు. ఈ ధర్నాకు బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు దూరంగా ఉన్నారు.
కవిత ధర్నాకు వెళ్లవద్దని పార్టీ హైకమాండ్ నుంచి సంకేతాలు రావడంతో బీఆర్ఎస్ నేతలు వెనక్కి తగ్గారంటూ ఆ పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది. కవిత విషయంలో బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని చాలామంది తప్పుబడుతున్నారు. కేసీఆర్‌కు కమిషన్ నోటీసులు ఇచ్చారన్న కారణంతోనే ధర్నాకు దిగారని, ఇలాంటప్పుడు పార్టీ సైలెంట్‌గా ఉండడం కరెక్టు కాదని అంటున్నారు.
ఇలాంటి వ్యవహారాలకు అంతర్గత సమస్యలను ముడిపెట్టడం సరికాదని అంటున్నారు. దీనివల్ల బీజేపీలో బీఆర్ఎస్‌ని విలీనం చేసే అవకాశముందన్న కవిత వాదనలకు మరింత బలం చేకూరుతుందని అంటున్నారు. ధర్నా ఆరంభంలో కవిత మాట్లాడారు. కేవలం కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని మాత్రమే ప్రశ్నించారు. పార్టీ వ్యవహారాలను ఏ మాత్రం ప్రస్తావించలేదు.
ALSO READ: బీజేపీకి రాజాసింగ్ గుడ్ బై?
రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారని కవిత ఆరోపించారు. కాలేశ్వరంలో ఎత్తిపోసిన మట్టితో దాదాపు 300 పిరమిడ్లు కట్టవచ్చన్నారు. ఈ ప్రాజెక్టుకు ఉపయోగించిన స్టీల్‌తో 100 ఈఫిల్ టవర్లు కట్టవచ్చన్నారు. కాంక్రీటుతో 50 బుర్జ్ ఖలీఫాలు కట్టొచ్చన్నారు. ఈ ప్రాజెక్టు అంతపెద్దదని చెబుతూనే, ఈ ప్రాజెక్టు మొత్తమంతా పూర్తయితే తెలంగాణలో 35 శాతం భూభాగానికి తాగు నీరు వస్తుందన్నారు.
కాలేశ్వరం గురించి మాట్లాడుతూనే గోదావరి-పెన్నా లింకేజ్‌తో బనకచర్లకు నీళ్లు తీసుకెళ్లాలని ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. ఆ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఆపాలన్నారు. దీనిపై కేంద్రానికి, అఫెక్స్ కౌన్సిల్‌కు లేఖ రాయాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ పిల్లర్ కుంగిందని, మరో రెండింటికి పగుళ్లు ఏర్పడ్డాయన్నారు. ఈ ప్రభుత్వం ఎందుకు రిపేర్ చేయలేదని ప్రశ్నించారు. కుట్రతోనే ఇదంతా జరిగిందన్నారు.
ఏపీలో ప్రాజెక్టు కడుతున్నా తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు నోరు ఎత్తలేదని ప్రశ్నించారు కవిత. టీడీపీ మీద ఆధారపడి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసినా బీజేపీ నేతలు నోరు ఎత్తలేదన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల కూడా మాట్లాడలేదన్నారు. దీనిపై గల్లీ నుంచి ఢిల్లీ వరకు జాగృతి ఉద్యమం చేస్తుందన్నారు కవిత.