Telangana Journalist Accreditation: రాష్ట్రంలోని అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. గురువారం సచివాలయంలో సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ ప్రియాంక, ముఖ్యమంత్రి సీపీఆర్‌వో మల్సూర్‌లతో అక్రిడిటేషన్ ప్రక్రియపై మంత్రి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.
అక్రిడిటేషన్ కార్డుల జారీలో పారదర్శకత కోసం ప్రభుత్వం తొలుత జీవో 252ను జారీ చేసిందని, అనంతరం జర్నలిస్టు సంఘాల సూచనల మేరకు అవసరమైన సవరణలు చేసి జీవో 103ను తీసుకువచ్చామని మంత్రి వెల్లడించారు. ఈ నూతన నిబంధనల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియా విభాగాల్లో మొత్తం 44,706 అక్రిడిటేషన్ కార్డులు మంజూరు కానున్నాయి. గతంలో కేవలం 23 వేల కార్డులు మాత్రమే ఉండగా, ఇప్పుడు అదనంగా మరో 21 వేల మందికి పైగా జర్నలిస్టులకు లబ్ధి చేకూరుతుందని ఆయన వివరించారు.
2.50 లక్షల పైగా సర్క్యులేషన్ ఉన్న 8 పత్రికలకు 6,256 కార్డులు, 75 వేల నుండి 2.50 లక్షల సర్క్యులేషన్ ఉన్న 24 పత్రికలకు 17,784 కార్డులు కేటాయించారు. 15,001 నుండి 75,000 మధ్య సర్క్యులేషన్ ఉన్న పత్రికలకు మొత్తం 15,051 కార్డులు, అలాగే 15 వేలలోపు సర్క్యులేషన్ ఉన్న పత్రికలకు 226 కార్డులు అందనున్నాయి. 21 శాటిలైట్ ఛానళ్లకు 4,431 కార్డులు, జాతీయ ఛానళ్లకు 32, లోకల్ కేబుల్ ఛానళ్లకు 200 కార్డులు కేటాయించారు. పీరియాడికల్స్‌కు 624, న్యూస్ ఏజెన్సీలకు 68, డిజిటల్ మీడియాకు 10 కార్డులు మంజూరు చేశారు.
మొత్తం కార్డులలో రాష్ట్ర, జిల్లా స్థాయిలలో 16,056 కార్డులు, నియోజకవర్గ, మండల స్థాయిలలో 28,650 కార్డులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అక్రిడిటేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ అని, మీడియా ప్రతినిధుల గౌరవం, భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.