Junior Lecturers: స్వేచ్ఛ బ్యూరో: జూనియర్ అధ్యాపకుల క్రమబద్ధీకరణలో జరిగిన అక్రమాలపై ఇంటర్ బోర్డు ఉక్కుపాదం మోపింది. జూనియర్ అధ్యాపకుల క్రమబద్ధీకరణలో అక్రమాలు జరిగాయని తేలడంతో 35 మందిపై వేటు వేసింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఇంకా పూర్తిస్థాయిలో అర్హులకు న్యాయం దక్కలేదనే విమర్శలు వస్తున్నాయి. కంటితుడుపు చర్యగా 35 మందితో సరిపెడితే ఎలా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అర్హులకు న్యాయం దక్కకపోగా.. అనర్హులకు మాత్రం అందలమెక్కిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనర్హులుగా ఉన్న మిగతా వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తం వెయ్యి మంది వరకు నకిలీ జేఎల్‌లకు రెగ్యులరైజ్ చేశారని ఒక కీలక స్థాయి అధికారి వ్యాఖ్యానించినట్లు పలువురు సిబ్బంది చెబుతున్నారు. జనరల్ విభాగంగా దాదాపు 700 మందికిపైగా అనర్హులకు రెగ్యులరైజ్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
35 మంది జూనియర్ లెక్చరర్ల పై వేటు..
నకిలీ సర్టిఫికెట్లతో రెగ్యులరైజ్ అయ్యారనే ఆరోపణల నేపథ్యంలో ఇంటర్ బోర్డు 35 మంది జూనియర్ లెక్చరర్లను ఉద్యోగాలను నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వీరు నకిలీ పీజీ సర్టిఫికెట్లతో లెక్చరర్ ఉద్యోగాలు పొందారని, వీరికి ఇచ్చిన షోకాజ్ నోటీసులకు సరైన సమాధానాలు రాకపోవడంతో వారిని విధుల నుంచి తొలగిస్తున్నామని ఇంటర్మీడియట్ విద్యాశాఖ జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. 2014 కంటే ముందునుంచే కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్న సుమారు 3000కు పైగా మందిని 2023లో రెగ్యులరైజ్ చేశారు. అయితే వీరిలో కొంతమంది ఇతర రాష్ట్రాల్లోని 16కు పైగా యూనివర్సిటీల్లో చదివినట్లు సర్టిఫికెట్లు అందజేసినట్లు తెలిసింది. ఈ సర్టిఫికెట్లు ఒరిజినలా లేదా నకిలీవా అని తెలుసుకునేందుకు ఇంటర్ విద్యాశాఖ అధికారులు ఆ యూనివర్సిటీలను సంప్రదించగా ఆ సర్టిఫికెట్లు నకిలీవి అని తేలడంతో వారికి తొలుత నోటీసులు జారీ చేశారు. వాటికి సరైన సమాధానం రాకపోవడంతో వారిని ఉద్యోగాల నుంచి తొలగించారు.
35 మందితోనే సరిపెడితే ఎలా?
అయితే.. ఇంటర్ బోర్డు.. 35 మందితోనే సరిపెడితే ఎలా? అనే ప్రశ్నలు మిగతా సిబ్బంది నుంచి ఉత్పన్నమవుతున్నాయి. వెయ్యి మందికి పైగా నకిలీ జేఎల్ లు రెగ్యులరైజ్ అయ్యారని వారు ఆరోపించారు. మరోవైపు, ఒకేషనల్ విభాగంలో దశాబ్దాలుగా సేవలందించిన పలువురు ఒప్పంద అధ్యాపకులకు సాంక్షన్ పోస్టులు లేవనే కారణంతో క్రమబద్ధీకరణ అవకాశం దక్కలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకేషనల్ విభాగంలో సుమారు 26 సంవత్సరాలుగా సేవలందించినప్పటికీ కొందరికి క్రమబద్ధీకరణ జరగలేదని, అదే సమయంలో అర్హతలపై సందేహాలు ఉన్న వ్యక్తులకు మాత్రం ప్రయోజనం కల్పించారన్న విమర్శలు ఉన్నాయి. మొత్తం 411 మంది వరకు ఒకేషనల్ ఒప్పంద అధ్యాపకులకు న్యాయం జరగాల్సి ఉన్నప్పటికీ, నిబంధనల అమలులో తేడాల కారణంగా వారు నష్టపోయారని పలువురు సిబ్బంది ఆరోపిస్తున్నారు.
అధికారుల పాత్రపై ప్రశ్నలు..
2023లో క్రమబద్ధీకరణ ప్రక్రియలో నియామక పత్రాలు జారీ చేసిన అధికారులు, వాటి పరిశీలనకు బాధ్యత వహించిన అధికారుల పాత్రపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అప్పటి పరిస్థితుల్లో కొందరు అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ రాజకీయ ఒత్తిళ్లు ప్రభావం చూపాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇకపోతే.. జనరల్ విభాగంలో సుమార్ 700 మందికి పైగా రెగ్యలరైజ్ అయ్యారని, వారి అర్హతలను మరోసారి పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు. సుమారు 364 మంది ఇతర రాష్ట్రాల్లో పీజీలు చదివిన అభ్యర్థుల అర్హతలపై అనుమానాలు ఉన్నాయని, కొందరి విషయంలో సర్వీస్‌లో గ్యాప్‌లు ఉన్నప్పటికీ వాటిని పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. విదేశాల్లో కొంతకాలం ఉన్న వ్యక్తుల సర్వీస్ వివరాలపైనా పరిశీలన జరగాలని వారు కోరుతున్నారు.
క్రమబద్ధీకరణలో అక్రమాలు..
ఇంటర్ విద్యాశాఖలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు క్రమబద్ధీకరణ ప్రక్రియలో కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఒకేషనల్ విభాగానికి సంబంధించిన వ్యవహారంలో అప్పటి ఇంటర్ విద్యా కమిషనర్ స్థాయి అధికారి విజిలెన్స్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇదిలాఉండగా కేవలం ఒప్పంద అధ్యాపకుల క్రమబద్ధీకరణకే కాకుండా ఇంటర్ విద్యాశాఖలో జరిగిన కొన్ని ప్రమోషన్లపైనా ఆరోపణలు వస్తున్నాయి. సుమారు 55 మంది లైబ్రేరియన్లు ఇతర రాష్ట్రాల విద్యార్హతల పత్రాలతో ప్రమోషన్లు పొందారన్న ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా నాన్-టీచింగ్ సిబ్బంది ప్రమోషన్లలో సుమారు 86 మంది విషయంలో ఇతర రాష్ట్రాల మెమోలు వినియోగించారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలు నిజమా? కాదా? అన్నది సంబంధిత విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, విద్యాశాఖ రికార్డుల ఆధారంగా పరిశీలించాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అదేవిధంగా డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలల్లో జరిగిన క్రమబద్ధీకరణల్లోనూ లోటుపాట్లు ఉన్నాయన్న ఆరోపణలపై విచారణ జరపాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశిస్తే, తెలంగాణ ఇంటర్ విద్యాశాఖలో క్రమబద్ధీకరణలు, నియామకాలు, ప్రమోషన్లకు సంబంధించిన అనేక అనుమానాలకు స్పష్టత వచ్చే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు.
Also Read: మా ప్రాంత చెరువులనూ కాపాడండి సార్! హైడ్రా ప్రజావాణికి వెల్లువెత్తిన అర్జీలు